Rohit Sharma: రోహిత్ శర్మకు ఇదే చివరి వన్డేనా..? లార్డ్స్ మ్యాచ్‌పై ఉత్కంఠ
ఇంగ్లండ్‌తో మూడో వన్డే అనంతరం రోహిత్ శర్మ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశమున్నట్లు కథనాలు వెలువడ్డాయి.
Rohit Sharma Set to Retire After England ODI Series?
భారత క్రికెట్ జట్టు సీనియర్ బ్యాటర్ రోహిత్ శర్మ వన్డే క్రికెట్‌కు కూడా వీడ్కోలు చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా జులై 19న లార్డ్స్ వేదికగా జరిగే మూడో వన్డే రోహిత్‌కు భారత జట్టు తరఫున చివరి మ్యాచ్ కావచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.
వివిధ మీడియా కథనాల ప్రకారం, బీసీసీఐ సీనియర్ సెలెక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని ఎంపిక కమిటీ, ఈ ఇంగ్లండ్ పర్యటన తర్వాత జట్టులో యువ ఆటగాళ్లకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ విషయాన్ని ఇప్పటికే రోహిత్ శర్మతో పాటు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌కు కూడా తెలియజేసినట్లు తెలుస్తోంది.
భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని యశస్వి జైస్వాల్ వంటి యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలనే ఆలోచనలో సెలెక్టర్లు ఉన్నట్లు సమాచారం. దీంతో 2027 వన్డే ప్రపంచకప్ ప్రణాళికల్లో రోహిత్ శర్మకు చోటు ఉండకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే ఫిట్‌నెస్‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టి వన్డే క్రికెట్‌ను కొనసాగించాలని రోహిత్ భావించినప్పటికీ, తన భవిష్యత్తుపై తుది నిర్ణయాన్ని అతడికే వదిలేసినట్లు బీసీసీఐ వర్గాల సమాచారం.
ఇప్పటికే రోహిత్ శర్మ టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు 2024లో, టెస్టు క్రికెట్‌కు 2025లో వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వన్డేలకు కూడా రిటైర్మెంట్ ప్రకటిస్తారా లేదా అనేది లార్డ్స్ వేదికగా జరిగే మూడో వన్డే అనంతరం స్పష్టత వచ్చే అవకాశం ఉంది.




