Rohit Sharma records: వెస్టిండీస్‌తో వన్డే సిరీస్.. ఆ మూడు రికార్డులపై కన్నేసిన రోహిత్ శర్మ..!

Rohit Sharma records: వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు టీమిండియా సిద్ధమవుతున్న వేళ రోహిత్ శర్మ (Rohit Sharma)పై అందరి దృష్టి నెలకొంది. ఈ సిరీస్‌లో అతడి బ్యాట్ నుంచి వచ్చే పరుగులు కీలకమే కాదు.. కొన్ని అరుదైన రికార్డులకు కూడా దగ్గరగా ఉన్నాడు.

Venkat
Published on: 25 Sept 2026 10:26 AM IST
Rohit Sharma records
X

Rohit Sharma records: వెస్టిండీస్‌తో వన్డే సిరీస్.. ఆ మూడు రికార్డులపై కన్నేసిన రోహిత్ శర్మ..!

Rohit Sharma records: భారత క్రికెట్ జట్టు (Team India) మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) మరోసారి వన్డేల్లో తన సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. వెస్టిండీస్‌తో జరిగే మూడు వన్డేల సిరీస్‌లో అతడి బ్యాటింగ్‌పై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. సెప్టెంబర్ 27న తిరువనంతపురంలో తొలి వన్డే జరగనుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. తరువాత సెప్టెంబర్ 30న గువాహటిలో రెండో వన్డే, అక్టోబర్ 3న ముల్లన్‌పూర్‌లో మూడో మ్యాచ్ జరగనున్నాయి. ఈ సిరీస్‌లో రోహిత్‌కు వ్యక్తిగతంగా పలు కీలక మైలురాళ్లు అందుకునే అవకాశం ఉంది.

వన్డేల్లో ఓపెనర్‌గా రోహిత్ ఇప్పటివరకు 9,865 పరుగులు చేశాడు. అతడి మొత్తం వన్డే పరుగులు 11,895. మరో 135 పరుగులు చేస్తే ఓపెనర్‌గా 10 వేల పరుగుల మార్క్ చేరుకుంటాడు. ఈ ఘనత సాధిస్తే వన్డే చరిత్రలో ఈ మైలురాయిని అందుకున్న నాలుగో ఓపెనర్‌గా నిలుస్తాడు. సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar), సనత్ జయసూర్య (Sanath Jayasuriya), క్రిస్ గేల్ (Chris Gayle) ఇప్పటికే ఈ జాబితాలో ఉన్నారు.

వెస్టిండీస్‌పై వన్డేల్లోనూ రోహిత్‌కు మరో అవకాశం ఉంది. ఆ జట్టుతో 35 ఇన్నింగ్స్‌ల్లో అతడు 1,613 పరుగులు చేశాడు. ఇందులో మూడు శతకాలు ఉన్నాయి. మరో సెంచరీ సాధిస్తే ఈ ఫార్మాట్‌లో వెస్టిండీస్‌పై నాలుగు శతకాలతో సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేస్తాడు. భారత ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ (Virat Kohli) తొమ్మిది శతకాలతో ఈ జాబితాలో ముందున్నాడు.

సిక్సర్ల విషయంలోనూ రోహిత్ రికార్డుకు చేరువలో ఉన్నాడు. వెస్టిండీస్‌పై వన్డేల్లో అతడి ఖాతాలో 35 సిక్సర్లు ఉన్నాయి. మరో ఆరు సిక్సర్లు బాదితే ఏబీ డివిలియర్స్ (AB de Villiers) 40 సిక్సర్ల రికార్డును అధిగమించి ఈ జాబితాలో అగ్రస్థానానికి చేరుకుంటాడు.

ఇవే కాకుండా భారత్ తరఫున వన్డే సెంచరీ చేసిన అత్యంత పెద్ద వయస్కుడిగా నిలిచే అవకాశం రోహిత్ ముందుంది. వెస్టిండీస్‌పై వన్డే శతకం చేసిన అత్యంత పెద్ద వయస్కుడిగా నిలిచే అవకాశం కూడా ఉంది. అంతర్జాతీయ క్రికెట్‌లో 2,000 ఫోర్ల మైలురాయికి అతడు మరో 18 బౌండరీల దూరంలో ఉన్నాడు. దీంతో ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్ రోహిత్‌కు వ్యక్తిగత రికార్డుల పరంగా ప్రత్యేకంగా మారే అవకాశం ఉంది.

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.