Rohit Sharma: రోహిత్ శర్మ భవితవ్యంపై సస్పెన్స్.. అంతా శుభ్‌మన్ గిల్ చేతుల్లోనే!
Rohit Sharma: Mohammad Kaif on Rohit Sharma's 2027 World Cup Future. టీమిండియా సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ భవిష్యత్తుపై అనిశ్చితి ఇంకా కొనసాగుతోంది.
Rohit Sharma: రోహిత్ శర్మ భవితవ్యంపై సస్పెన్స్.. అంతా శుభ్‌మన్ గిల్ చేతుల్లోనే!
Rohit Sharma: టీమిండియా సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ భవిష్యత్తుపై అనిశ్చితి ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే టీ20, టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన రోహిత్.. 2027 వన్డే ప్రపంచ కప్ ఆడాలనే లక్ష్యంతో ఉన్నట్లు గతంలో ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశాడు. అయితే ప్రస్తుతం 39 ఏళ్ల వయసులో ఉన్న హిట్‌మ్యాన్.. ప్రపంచ కప్ సమయానికి 40 ఏళ్లకు చేరుకోనున్నాడు. ఈ నేపథ్యంలో అతని భవిష్యత్తుపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డే తన చివరి మ్యాచ్ కావచ్చనే ప్రచారం జోరుగా సాగినా.. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఆ వార్తలను ఖండించారు.
ఇంగ్లండ్‌పై మూడో వన్డే మ్యాచ్‌లో రోహిత్ శర్మ 110 బంతుల్లో 138 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఆడి తన సత్తా చాటాడు. దీంతో హిట్‌మ్యాన్ వన్డే కెరీర్ ఇంకా కొనసాగుతుందనే ఆశాభావం అభిమానుల్లో నెలకొంది. అయితే 2027 ప్రపంచ కప్ జట్టులో రోహిత్‌కు స్థానం దక్కాలంటే.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కీలక పాత్ర పోషించాలని భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ అభిప్రాయపడ్డాడు.
తన యూట్యూబ్ ఛానెల్‌లో కైఫ్ మాట్లాడుతూ.. 'ఇది ప్రస్తుతం వేచి చూడాల్సిన పరిస్థితి. రోహిత్ భవిష్యత్తుపై స్పష్టత రావాలి. శుభ్‌మన్ గిల్ మీడియా ముందుకు వచ్చి 2027 ప్రపంచ కప్‌కు రోహిత్ కావాలని బహిరంగంగా చెప్పాలి. జట్టు ఎంపికలో కెప్టెన్ అభిప్రాయం చాలా కీలకం. ఆటగాళ్ల సామర్థ్యం గురించి సెలెక్టర్ల కంటే కెప్టెన్‌కే ఎక్కువ అవగాహన ఉంటుంది. రోహిత్ జట్టుకు ఎంత అవసరమో కోచ్, సెలెక్టర్లను గిల్ ఒప్పిస్తే సరిపోతుంది' అని చెప్పాడు.
గతంలో సౌరవ్ గంగూలీ, మహేంద్ర సింగ్ ధోనీ వంటి కెప్టెన్లు తమ సీనియర్ ఆటగాళ్లకు అండగా నిలిచిన విషయాన్ని కైఫ్ గుర్తు చేశాడు. 'వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్ ఫామ్‌లో లేకపోయినా గంగూలీ వారికి మద్దతుగా నిలిచాడు. ధోనీ కూడా తన ఆటగాళ్లను ఎప్పుడూ విశ్వసించేవాడు. రోహిత్ శర్మ కూడా కెప్టెన్‌గా అనేక మంది ఆటగాళ్లకు అండగా నిలిచాడు. ఒక మంచి కెప్టెన్ తన ఆటగాళ్లను కష్ట కాలంలో ఆదుకోవాలి. ఇప్పుడు గిల్ వంతు వచ్చింది. రోహిత్ చాలా మంచి ఆటగాడు. ఇంగ్లండ్‌పై మూడో వన్డే మ్యాచ్‌లో భారీ సెంచరీ చేశాడు. రూమర్ల మధ్య కూడా ఎలాంటి టెన్షన్ లేకుండా ఆడాడు. రోహిత్ తప్పకుండా మెగా టోర్నీలో ఆడాలి' అని కైఫ్ వివరించాడు.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి సీనియర్ ఆటగాళ్ల విషయంలో జట్టు యాజమాన్యం పారదర్శకంగా వ్యవహరించాలని కూడా కైఫ్ సూచించాడు. 'బీసీసీఐ, సెలెక్టర్లతో మాట్లాడం వల్ల జట్టులో స్పష్టత పెరుగుతుంది. కెప్టెన్‌గా గిల్‌పై ఆటగాళ్లకు మరింత గౌరవం ఏర్పడుతుంది. ప్రస్తుతం ప్రతి విషయం బయటకు వస్తున్న కాలం ఇది. కాబట్టి సందిగ్ధతకు తావివ్వకుండా స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవాలి. అలాంటి పారదర్శకత జట్టుకు మరింత మేలు చేస్తుంది' అని మహ్మద్ కైఫ్ అభిప్రాయపడ్డాడు.




