RR vs GT: అతడు అస్సలు వద్దు, ప్రసిద్ధ్ కృష్ణ ముద్దు.. గుజరాత్ టైటాన్స్‌కు మాజీ ప్లేయర్ సూచన!

RR vs GT: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న గుజరాత్ టైటాన్స్‌ (జీటీ)కు మాజీ భారత క్రికెటర్ ఆకాష్ చోప్రా, ప్రముఖ వ్యాఖ్యాత కీలక సూచన చేశాడు.

Rishvik
Published on: 9 May 2026 6:30 PM IST
RR vs GT: అతడు అస్సలు వద్దు, ప్రసిద్ధ్ కృష్ణ ముద్దు.. గుజరాత్ టైటాన్స్‌కు మాజీ ప్లేయర్ సూచన!
X

RR vs GT: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న గుజరాత్ టైటాన్స్‌ (జీటీ)కు మాజీ భారత క్రికెటర్ ఆకాష్ చోప్రా, ప్రముఖ వ్యాఖ్యాత కీలక సూచన చేశాడు. శనివారం రాత్రి జైపూర్‌లోని సవాయి మాన్‌సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌కు ముందు గుజరాత్ తమ ప్లేయింగ్ ఎలెవన్‌లో మార్పులు చేయాలని సూచించాడు. ముఖ్యంగా పేసర్ ప్రసిద్ధ్ కృష్ణను తప్పకుండా జట్టులోకి తీసుకోవాలని అభిప్రాయపడ్డాడు. స్పిన్నర్ మానవ్ సుతార్‌ను ఈ మ్యాచ్‌లో ఆడించకూడదని చోప్రా చెప్పుకొచ్చాడు.

ఐపీఎల్ 2026లో శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ అద్భుత ఫామ్‌లో ఉంది. గుజరాత్ ఇప్పటివరకు 10 మ్యాచ్‌లలో ఆరు విజయాలు నమోదు చేసింది. ఇటీవల వరుసగా మూడు విజయాలు సాధించిన జీటీ.. 12 పాయింట్లతో పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్‌కు 12 పాయింట్లు ఉన్నప్పటికీ.. నెట్ రన్‌రేట్ తక్కువగా ఉండటంతో ఒక స్థానం దిగువన ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా టాప్-2లోకి వెళ్లే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో నీతో మ్యాచ్ జీటీ, ఆర్ఆర్ జట్లకు కీలకంగా మారింది. విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న రెండు జట్లు పటిష్ట ప్లేయింగ్ 11తో బరిలోకి దిగనున్నాయి. ఈ కీలక పోరుకు ముందు ఆకాష్ చోప్రా తన యూట్యూబ్ ఛానల్‌లో మాట్లాడాడు.

గుజరాత్ బౌలింగ్ యూనిట్‌ను ఆకాష్ చోప్రా ప్రశంసించాడు. 'ఒక జట్టులోని నలుగురు బౌలర్లు టాప్-10 వికెట్ టేకర్ల జాబితాలో ఉండటం చాలా గొప్ప విషయం. కానీ అలాంటి జట్టు స్టార్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణను బెంచ్‌పై కూర్చోబెట్టింది. ఐపీఎల్ 2026లో అతడు ఆడిన మ్యాచ్‌ల్లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. గుజరాత్ విజయంలో బౌలింగ్ కీలక పాత్ర పోషిస్తోంది. మనవ్ సుతార్ స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణను తీసుకోవాలి. స్పిన్ అవసరమైతే వాషింగ్టన్ సుందర్‌తో బౌలింగ్ చేయించొచ్చు. రాజస్థాన్ టాప్ ఆర్డర్‌లో ఇద్దరు ఎడమచేతి బ్యాటర్లు ఉంటారు. మధ్యలో రవీంద్ర జడేజా, షిమ్రాన్ హెట్మయర్ వంటి హిట్టింగ్ చేసే బ్యాటర్లు ఉంటారు. అలాంటి సమయంలో సుందర్ ఆఫ్‌స్పిన్ ఉపయోగపడుతుంది. మరోవైపు టాప్ స్పిన్నర్ రషీద్ ఖాన్ కూడా ఉన్నాడు. కాబట్టి కృష్ణను జట్టులోకి తీసుకోవడం సరైన నిర్ణయం అవుతుంది' అని చోప్రా చెప్పాడు.

ఐపీఎల్ 2026లో ప్రసిద్ధ్ కృష్ణ ఇప్పటివరకు ఏడు మ్యాచ్‌లు ఆడి 12 వికెట్లు తీసి మంచి ఫామ్‌లో ఉన్నాడు. అయినప్పటికీ పంజాబ్ కింగ్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో అతడిని ఆడించలేదు. ఇక మనవ్ సుతార్ ఈ సీజన్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడి కేవలం రెండు వికెట్లు మాత్రమే తీసుకున్నాడు. దీంతో రాజస్థాన్‌తో మ్యాచ్‌లో గుజరాత్ తమ కాంబినేషన్‌లో మార్పులు చేస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story