LSG vs RR : ఏకానాలో రాజస్థాన్ బౌలర్ల విధ్వంసం.. 160 పరుగుల లక్ష్యాన్ని కూడా ఛేదించలేకపోయిన లక్నో

LSG vs RR : లక్నో సూపర్ జెయింట్స్‌పై రాజస్థాన్ రాయల్స్ 40 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఆర్చర్ 3 వికెట్లతో చెలరేగగా, రాజస్థాన్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరింది.

CR Reddy
Published on: 23 April 2026 6:49 AM IST
IPL 2026
X

 IPL 2026

LSG vs RR : ఐపీఎల్ 2026లో భాగంగా ఏకానా స్టేడియంలో జరిగిన 32వ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఓడిపోతుందనుకున్న మ్యాచ్‌ను తమ బౌలర్ల బలంతో రాజస్థాన్ మలుపు తిప్పింది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. ఓపెనర్లు జైస్వాల్ (22), వైభవ్ (8) విఫలమైనా, మిడిల్ ఆర్డర్‌లో రవీంద్ర జడేజా 29 బంతుల్లో 43 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించాడు.

160 పరుగుల సాధారణ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్‌కు ఆదిలోనే కోలుకోలేని దెబ్బ తగిలింది. లక్నో బ్యాటర్లు పేకమేడలా కూలిపోయారు. ముఖ్యంగా జట్టులో అత్యంత కీలకం అనుకున్న ఆయుష్ బడోని, కెప్టెన్ రిషబ్ పంత్, ఐడెన్ మార్క్రమ్.. ఈ ముగ్గురు కనీసం ఖాతా కూడా తెరవకుండానే (సున్నా పరుగులకే) అవుట్ కావడం అందరినీ విస్మయానికి గురిచేసింది. నికోలస్ పూరన్ (22) కొద్దిసేపు పోరాడినా అది సరిపోలేదు.

ఒకవైపు వికెట్లు పడుతున్నా ఓపెనర్ మిచెల్ మార్ష్ ఒంటరి పోరాటం చేస్తూ 55 పరుగులు జోడించాడు. అయితే మార్ష్ అవుట్ అవ్వగానే లక్నో గెలుపు ఆశలు పూర్తిగా ఆవిరయ్యాయి. రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ నిప్పులు చెరిగే బంతులతో 3 వికెట్లు తీసి లక్నో నడుము విరిచాడు. అతనికి తోడుగా నాంద్రే బర్గర్, బ్రిజేష్ శర్మ తలో రెండు వికెట్లు పడగొట్టి లక్నోను 119 పరుగులకే ఆలౌట్ చేశారు.

ఈ విజయంతో రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి దూసుకెళ్లింది. ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో 10 పాయింట్లు సాధించి ప్లే ఆఫ్ రేసులో బలంగా నిలిచింది. మరోవైపు, సొంత గడ్డపై వరుసగా నాలుగో ఓటమిని చవిచూసిన లక్నో సూపర్ జెయింట్స్ పాయింట్ల పట్టికలో 9వ స్థానానికి పడిపోయి గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story