Ruturaj Gaikwad: ఈ ఓటమికి నాదే బాధ్యత.. నిజాయితీగా ఒప్పుకున్న సీఎస్కే కెప్టెన్!
CSK Captain Ruturaj Gaikwad Comments Goes Viral. ఆర్సీబీపై ఓటమి అనంతరం సీఎస్కే కెప్టెన్ గైక్వాడ్ నిరాశ వ్యక్తం చేశాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన గైక్వాడ్.. ఓటమికి తానే బాధ్యుడని నిజాయితీగా ఒప్పుకున్నాడు.
Ruturaj Gaikwad: ఈ ఓటమికి నాదే బాధ్యత.. నిజాయితీగా ఒప్పుకున్న సీఎస్కే కెప్టెన్!
Ruturaj Gaikwad: ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)ను వరుస పరాజయాలు వెంటాడుతున్నాయి. ఆదివారం రాత్రి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో జరిగిన మ్యాచ్‌లో 43 పరుగుల తేడాతో ఓడిన సీఎస్కే.. ఈ సీజన్లో వరుసగా మూడో ఓటమిని చవిచూసింది. ఇప్పటివరకు ఒక్క విజయం కూడా సాధించని చెన్నై.. పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. అంతేకాదు నెట్ రన్ రేట్ -2.517గా ఉండడం సీఎస్కేకు పెద్ద ప్రతికూలం. ఆర్సీబీపై ఓటమి అనంతరం సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ నిరాశ వ్యక్తం చేశాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన గైక్వాడ్.. జట్టు పోరాటాన్ని ప్రశంసించినప్పటికీ, ఓటమికి తానే బాధ్యుడని నిజాయితీగా ఒప్పుకున్నాడు.
'నేను ఎక్కువ రన్స్ చేసుంటే పరిస్థితి భిన్నంగా ఉండేదేమో. నేను ఈ మ్యాచ్‌లో విఫలమయ్యా. ఈ ఓటమికి నాదే పూర్తి బాధ్యత. మేం బౌలింగ్ చేసే సమయంలో 14-15వ ఓవర్ వరకూ మ్యాచ్ మా చేతుల్లోనే ఉంది. ఆ తర్వాత మ్యాచ్ మా నుంచి చేజారిపోయింది. టిమ్ డేవిడ్‌ను కాంబోజ్ క్లీన్‌బౌల్డ్ చేశాడు. అది నోబాల్ అవ్వడం మా దురదృష్టం. లైఫ్ అనంతరం డేవిడ్ దూకుడుగా ఆడాడు. అతడు ఆ బంతికి ఔటై ఉంటే ఆర్సీబీ భారీ స్కోరు చేసుండేది కాదు. ఛేదనలో మాకు శుభారంభం దక్కలేదు. నిజంనిజాయితీగా చెప్పాలంటే.. సర్ఫరాజ్ ఖాన్ అలా ఆడుతాడు అనుకోలేదు. నేను ఆశ్చర్యపోయాను. అతడు అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ప్రశాంత్ వీర్, ఓవర్టన్ తమ వంతు కృషి చేశారు. శివమ్ దూబే దురదృష్టవశాత్తూ పెవిలియన్‌కు చేరడం తీవ్ర ప్రభావం పడింది. టాప్ ఆర్డర్లో నేను మరింతగా కాంట్రిబ్యూట్ చేసి ఉంటే మ్యాచ్ గెలిచే అవకాశముండేది. అందుకే ఈ ఓటమికి పూర్తి బాధ్యత నాదే' అని రుతురాజ్ గైక్వాడ్ చెప్పాడు.
ఫీల్డింగ్‌లో అవకాశాలను వదులుకోవడం కూడా మ్యాచ్ ఫలితాన్ని ప్రభావితం చేసిందని రుతురాజ్ గైక్వాడ్ పేర్కొన్నాడు. 'విరాట్ కోహ్లీకి ఇచ్చిన క్యాచ్ పట్టుంటే మ్యాచ్ మోమెంటమ్ మాకు వచ్చేదేమో. అయినా 13వ, 14వ ఓవర్ల వరకు మ్యాచ్ మా చేతిలోనే ఉంది. అక్కడే మోమెంటమ్ పూర్తిగా మారిపోయింది' అని గైక్వాడ్ విశ్లేషించాడు. జట్టు బాగా పోరాడినప్పటికీ, కీలక సందర్భాల్లో తీసుకున్న నిర్ణయాలు, కోల్పోయిన అవకాశాలు ఓటమికి కారణమయ్యాయని గైక్వాడ్ అభిప్రాయపడ్డాడు. తదుపరి మ్యాచ్‌లలో ఈ తప్పిదాలను సరిదిద్దుకుని బలంగా తిరిగి రావాలని సీఎస్కే కెప్టెన్ చెప్పుకొచ్చాడు. ఒక దశలో 30/3తో కష్టాల్లో పడిన సీఎస్కేను సర్ఫరాజ్ ఖాన్ (25 బంతుల్లో 50), ప్రశాంత్ వీర్ (29 బంతుల్లో 43), జేమీ ఓవర్టన్ (16 బంతుల్లో 37) పోరాట ఇన్నింగ్స్‌లతో గేమ్‌లో నిలిపారు. అయితే చివరికి లక్ష్యానికి 43 పరుగులు దూరంగా నిలిచి పరాజయాన్ని చవిచూసింది.




