Sachin Tendulkar: మీ రీప్లేస్‌మెంట్ కోసం చూస్తున్నాం, తప్పుకుంటారా?.. సచిన్‌కే షాక్ ఇచ్చిన సెలెక్టర్!
Sachin Tendulkar: సచిన్ టెండూల్కర్.. క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ బ్యాటర్. క్రికెట్ దేవుడిగా పేరుగాంచిన సచిన్.. తన 24 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో ఎన్నో రికార్డులు సృష్టించాడు.
Sachin Tendulkar: మీ రీప్లేస్‌మెంట్ కోసం చూస్తున్నాం, తప్పుకుంటారా?.. సచిన్‌కే షాక్ ఇచ్చిన సెలెక్టర్!
Sachin Tendulkar: సచిన్ టెండూల్కర్.. క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ బ్యాటర్. క్రికెట్ దేవుడిగా పేరుగాంచిన సచిన్.. తన 24 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో ఎన్నో రికార్డులు సృష్టించాడు. టెస్టులు, వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచిన సచిన్.. అంతర్జాతీయ క్రికెట్‌లో 100 శతకాలు చేశాడు. వన్డే వరల్డ్ కప్ కలను సాకారం చేసుకున్న లిటిల్ మాస్టర్.. 2013లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అయితే సచిన్ రిటైర్మెంట్‌కు సంవత్సరం ముందే భారత జట్టులో ఆయనకు ప్రత్యామ్నాయం వెతకాలని బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ఆలోచించిందనే విషయం తాజాగా బయటకు వచ్చింది.
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) చీఫ్ సెలెక్టర్‌గా ఉన్న సందీప్ పాటిల్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్ గురించి ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. '2012లో సచిన్ ఫామ్ అంతగా లేదు. బీసీసీఐ సెలెక్టర్లు జట్టులో మార్పుల గురించి ఆలోచించారు. ఆ ఏడాది సచిన్ 9 టెస్టుల్లో కేవలం 23.80 సగటుతో మాత్రమే పరుగులు చేశాడు. వన్డేల్లో కూడా 10 మ్యాచ్‌ల్లో 31.50 సగటుతోనే ఆడాడు. ఈ నేపథ్యంలో ఒకసారి సచిన్‌ను కలిశా. మీ భవిష్యత్ ప్రణాళికలు ఏమిటి? అని అడిగా. దానికి సచిన్ ఎందుకు అడుగుతున్నారు? అని ప్రశ్నించాడు. ఇక నేనే ఓపెన్ అయ్యా. సెలెక్షన్ కమిటీ జట్టుకు కొత్త ఆటగాళ్లను సిద్ధం చేసేందుకు ప్రత్యామ్నాయం గురించి ఆలోచిస్తున్నట్లు చెప్పా. ఆ మాట విని సచిన్ ఆశ్చర్యపోయాడు' అని సందీప్ పాటిల్ చెప్పారు.
'ఆ తర్వాత సచిన్ మళ్లీ ఫోన్ చేసి నిజంగానే అంటున్నారా? అని అడిగాడు. అవును అని చెప్పా. సచిన్ తాను కొనసాగుతానని చెప్పడంతో సెలెక్షన్ కమిటీ కూడా అంగీకరించింది. చివరికి సచిన్ స్వయంగా నిర్ణయం తీసుకుని రిటైర్మెంట్ ప్రకటించాడు. సాధారణంగా ఏ ఆటగాడికీ మీ కెరీర్ ముగిసిందని సెలక్టర్లు నేరుగా చెప్పరు. మీ ప్లాన్స్ ఏంటి? అని పరోక్షంగా అడుగుతారు. సెలెక్టర్లకు ఆటగాళ్లను జట్టులోంచి తప్పించే అధికారం ఉన్నా.. వారిని బలవంతంగా రిటైర్మెంట్ ప్రకటించమని అడగరు. నేను అదే చేశా. నా సెలెక్షన్ కమిటీ కాలాన్ని ప్రజలు ఎక్కువగా సచిన్ జట్టులో లేకపోవడమే గుర్తు పెట్టుకున్నారు. కానీ అదే సమయంలో షమీ, బుమ్రా, అశ్విన్, జడేజా, రహానె వంటి భవిష్యత్ స్టార్ ఆటగాళ్లను జట్టులోకి తీసుకొచ్చామని ఎవరూ చెప్పరు. యువ ఆటగాళ్ల ఎంట్రీ గురించి ఎవరూ మాట్లాడరు. సచిన్ విషయమే ఎక్కువగా గుర్తు పెట్టుకున్నారు' అని సందీప్ పాటిల్ వివరించారు. సచిన్ తన చివరి టెస్టు మ్యాచ్‌ను 2013 నవంబర్‌లో వెస్టిండీస్‌తో ముంబైలో ఆడాడు. స్వదేశ ప్రేక్షకుల మధ్య జరిగిన ఆ మ్యాచ్‌తో తన అద్భుతమైన క్రికెట్ కెరీర్‌కు సచిన్ ఘనంగా ముగింపు పలికాడు.




