పంజాబ్ కింగ్స్ పతనానికి కారణం ఇదే.. సచిన్ టెండూల్కర్ విశ్లేషణ వైరల్!
Sachin Tendulkar on Punjab Kings Defeats. ఐపీఎల్ 2026 సీజన్ రెండో భాగంలో వరుస పరాజయాలతో ప్లేఆఫ్స్ రేసు నుంచి పంజాబ్ కింగ్స్ నిష్క్రమించింది.
పంజాబ్ కింగ్స్ పతనానికి కారణం ఇదే.. సచిన్ టెండూల్కర్ విశ్లేషణ వైరల్!
Sachin Tendulkar: ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు టైటిల్ ఫేవరేట్ జట్లలో పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) ముందు వరసలో నిలిచింది. అందుకు తగ్గట్టుగానే కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో, హెడ్ కోచ్ రికీ పాంటింగ్ మార్గదర్శకత్వంలో సీజన్‌ను అద్భుతంగా ప్రారంభించిన పీబీకేఎస్.. తొలి ఏడు మ్యాచ్‌ల్లో ఓటమి లేకుండా దూసుకెళ్లింది. ఇక ప్లేఆఫ్స్ బెర్త్ పక్కా అని అందరూ అనుకున్నారు. అయితే సీజన్ రెండో భాగంలో వరుస పరాజయాలతో ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో పంజాబ్ కింగ్స్ వైఫల్యానికి గల కారణాలపై భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
టోర్నీ తొలి భాగంలో పంజాబ్ కింగ్స్ తమ ప్రక్రియ (ప్రాసెస్)పై ఎక్కువగా దృష్టి పెట్టిందని, అదే వారి విజయానికి ప్రధాన కారణమైందని సచిన్ టెండూల్కర్ అన్నారు. టోర్నీ రెండో భాగానికి వచ్చేసరికి ఫలితాలపై ఎక్కువగా దృష్టి పెట్టడంతో అసలు ప్రణాళిక నుంచి దారి తప్పిందని ఆయన పేర్కొన్నారు. 'పంజాబ్ కింగ్స్ టోర్నీకి అద్భుతమైన ఎనర్జీ తీసుకొచ్చింది. వారి ఆట సానుకూలంగా, ధైర్యంగా సాగింది. అయితే ఐపీఎల్ లాంటి పెద్ద టోర్నీల్లో మొమెంటమ్ చాలా కీలకం. చివరికి ప్రక్రియను అనుసరించడమే విజయానికి మార్గం. మొదటి భాగంలో పంజాబ్ అదే చేసింది. కానీ రెండో భాగంలో ఫలితాలపై దృష్టి పెట్టడం వారి పతనానికి దారితీసింది' అని సచిన్ వివరించారు.
మరోవైపు రన్నరప్‌గా నిలిచిన గుజరాత్ టైటాన్స్‌పై సచిన్ ప్రశంసల వర్షం కురిపించారు. ఐపీఎల్ వంటి టోర్నీలో గుజరాత్ తమ ఆట తీరును ఎప్పటికప్పుడు స్థిరంగా కొనసాగించడం విశేషమని పేర్కొన్నారు. ఫలితాలు ఎలా ఉన్నా.. తమ ప్రణాళికకు కట్టుబడి ఉండటం వల్లే ఆ జట్టు విజయవంతమైందని ఆయన అభిప్రాయపడ్డారు. 'గుజరాత్ టైటాన్స్ ప్రత్యేకత ఏమిటంటే.. మొత్తం సీజన్‌లో ఒకేలా ఆడింది. వారు అత్యుత్తమ ప్రదర్శనలతో పాటు వైఫల్యాలను కూడా పెద్దగా ఎదుర్కోలేదు. అనిశ్చితిని నియంత్రించే సామర్థ్యం వారిని ఇతర జట్ల కంటే ప్రత్యేకంగా నిలబెట్టింది' అని సచిన్ పేర్కొన్నారు.
అలాగే ఐపీఎల్ 2026 సీజన్‌ను విశ్లేషిస్తూ.. టోర్నీలు ప్రారంభంలో ఎలా మొదలవుతాయన్నది కాకుండా చివరికి ఎలా ముగుస్తాయన్నదే ముఖ్యమని సచిన్ టెండూల్కర్ చెప్పారు. సీజన్ మధ్యలో పాయింట్ల పట్టిక ఒకలా కనిపించినా.. ముగిసే సమయానికి పూర్తిగా భిన్నంగా మారిందన్నారు. జట్లు మార్పులకు అనుగుణంగా తమ ఆటతీరును మెరుగుపరుచుకుంటూ ముందుకు సాగడమే విజయానికి కీలకమని ఆయన తెలిపారు. ఐపీఎల్ 2026 టైటిల్‌ను వరుసగా రెండోసారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కైవసం చేసుకోగా.. గుజరాత్ టైటాన్స్ రన్నరప్‌గా నిలిచింది. రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా ఆకట్టుకునే ప్రదర్శన కనబరిచాయి. అయితే సీజన్ తొలి అర్ధభాగంలో అందరి దృష్టిని ఆకర్షించిన పంజాబ్ కింగ్స్.. చివరకు ప్లేఆఫ్స్‌కే చేరుకోలేకపోవడం అభిమానులను నిరాశపరిచింది.




