Hit Wicket: ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఘోరమైన అవుట్ నీదే బాసూ
Hit Wicket: ఐపీఎల్ 2026 క్వాలిఫైయర్-1లో గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ సాయి సుదర్శన్ విచిత్రంగా హిట్ వికెట్ అయ్యాడు.
Hit Wicket: ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఘోరమైన అవుట్ నీదే బాసూ
Sai Sudharsan: క్రికెట్ మైదానంలో ఒక బ్యాటర్ వందల కిలోమీటర్ల వేగంతో వచ్చే బంతిని డిఫెండ్ చేయడమే పెద్ద టాస్క్. అలాంటిది క్లీన్ బౌల్డ్ అయినా, క్యాచ్ ఇచ్చినా, రనౌట్ లేదా ఎల్‌బీడబ్ల్యూ అయినా ఆటలో భాగమే అనుకోవచ్చు. కానీ, ఏ బౌలరో, ఫీల్డరో ప్రమేయం లేకుండా.. తన సొంత తప్పిదంతో, తన బ్యాట్‌తోనో లేదా కాలితోనో వికెట్లను పడేసుకుని అవుట్ అయితే? దానికి మించిన అవమానకరమైన, నిరాశాజనకమైన క్షణం ఒక బ్యాటర్‌కు మరొకటి ఉండదు. అదే హిట్ వికెట్ .
ముఖ్యంగా ఐపీఎల్ లాంటి అత్యంత వేగవంతమైన, హై-ప్రెజర్ టీ20 ఫార్మాట్‌లో ఇలాంటి అవుట్లు చాలా అరుదు. కానీ, ఐపీఎల్ సుదీర్ఘ చరిత్రలో ఇప్పటివరకు మొత్తం 19 సార్లు బ్యాటర్లు ఇలా విచిత్రంగా అవుట్ అయి పెవిలియన్ చేరారు. తాజాగా ఐపీఎల్ 2026 సీజన్ క్వాలిఫైయర్-1 మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ సాయి సుదర్శన్ ఈ తరహాలోనే అవుట్ అయి మరోసారి క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారాడు.
ధర్మశాల వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన క్వాలిఫైయర్-1 మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ సాయి సుదర్శన్ 14 పరుగులు చేసి మంచి జోరు మీదున్నాడు. అయితే జాకబ్ డఫీ వేసిన బంతిని ఆడే క్రమంలో అనుకోకుండా అతని చేతిలోంచి బ్యాట్ జారిపోయింది. ఆ జారిన బ్యాట్ పిచ్‌పై ఒక్కసారి బాదిన తర్వాత.. నేరుగా వెనక్కి వెళ్లి స్టంప్స్‌ను తాకింది. దీనితో బెయిల్స్ కిందపడిపోవడంతో రూల్స్ ప్రకారం థర్డ్ అంపైర్ అతన్ని హిట్ వికెట్‌గా ప్రకటించాడు.
విశేషం ఏమిటంటే..సాయి సుదర్శన్ కెరీర్‌లో ఇలా హిట్ వికెట్ అవ్వడం ఇది రెండోసారి. అంతకుముందు 2022 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కీరన్ పొలార్డ్ బౌలింగ్‌లో అతను మొదటిసారి ఇలాగే అవుట్ అయ్యాడు. ఐపీఎల్ నాకౌట్ లేదా ప్లేఆఫ్స్ మ్యాచ్‌ల్లో ఒక బ్యాటర్ హిట్ వికెట్ అవ్వడం ఐపీఎల్ చరిత్రలోనే ఇది రెండోసారి మాత్రమే.
సాయి సుదర్శన్ కంటే ముందు, ఐపీఎల్ 2025 ఎలిమినేటర్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌కే చెందిన బ్యాటర్ కుశాల్ మెండిస్ ప్లేఆఫ్స్ చరిత్రలోనే మొదటి హిట్ వికెట్ బాధితుడిగా రికార్డుకెక్కాడు. ఏది ఏమైనా, క్రికెట్‌లో టెక్నిక్ ఎంత ముఖ్యమో.. క్రీజులో బాడీ బ్యాలెన్స్, హ్యాండ్-ఐ కోఆర్డినేషన్ అంతే ముఖ్యమని చెప్పడానికి ఈ హిట్ వికెట్ రికార్డులే నిదర్శనం. ఎంతటి తోపు బ్యాటర్ అయినా సరే, ఒక్క క్షణం ఏకాగ్రత చెదరితే సొంత చేతులతోనే వికెట్ సమర్పించుకోవాల్సి వస్తుందని సాయి సుదర్శన్ అవుట్ మరోసారి నిరూపించింది.




