KKR vs GT : కేకేఆర్, గుజరాత్ జట్లకు మైండ్ బ్లాక్ అయ్యే షాక్.. మైదానంలోనే కుప్పకూలిన ఇద్దరు స్టార్ ప్లేయర్లు

KKR vs GT : గుజరాత్ స్టార్ బ్యాటర్ సాయి సుదర్శన్, కేకేఆర్ భారీ ధర పెట్టి కొన్న మతీషా పతిరానా ఇద్దరూ మ్యాచ్ మధ్యలోనే గాయపడి మైదానాన్ని వీడారు.

CR Reddy
Updated on: 17 May 2026 7:17 AM IST
KKR vs GT
X

KKR vs GT 

KKR vs GT : ఐపీఎల్ 2026 సీజన్ రసవత్తరంగా సాగుతున్న వేళ, కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), గుజరాత్ టైటాన్స్ (GT) జట్లకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన 60వ మ్యాచ్ కేవలం పరుగుల వరదకే కాదు, ఆటగాళ్ల గాయాలకు కూడా వేదికైంది. గుజరాత్ స్టార్ బ్యాటర్ సాయి సుదర్శన్, కేకేఆర్ భారీ ధర పెట్టి కొన్న మతీషా పతిరానా ఇద్దరూ మ్యాచ్ మధ్యలోనే గాయపడి మైదానాన్ని వీడారు. ఈ హఠాత్పరిణామంతో ఇరు జట్ల అభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

గుజరాత్ టైటాన్స్ జట్టు 248 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఇన్నింగ్స్ మూడో ఓవర్లో కోల్‌కతా బౌలర్ కార్తీక్ త్యాగి విసిరిన ఒక బుల్లెట్ లాంటి బంతి నేరుగా సాయి సుదర్శన్ మోచేతికి బలంగా తగిలింది. దెబ్బ తగలగానే సుదర్శన్ నొప్పితో మైదానంలోనే విలవిలలాడుతూ పడిపోయాడు. ఫిజియో వచ్చి చికిత్స చేసినా, కనీసం పరిగెత్తలేని స్థితిలో అతను రిటైర్డ్ హర్ట్‎గా వెనుదిరగాల్సి వచ్చింది. అప్పటికి అతను 13 బంతుల్లో 23 పరుగులు చేసి మంచి ఊపులో ఉన్నాడు.

కోల్‌కతా నైట్ రైడర్స్ కథ మరింత దారుణంగా ఉంది. శ్రీలంక బౌలర్ మతీషా పతిరానాను ఈ వేలంలో కేకేఆర్ ఏకంగా రూ.18 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. ఈ సీజన్లో తన డెబ్యూ మ్యాచ్ ఆడుతున్న పతిరానా, తన రెండో ఓవర్ తొలి బంతి వేయగానే కండరాల నొప్పితో ఇబ్బంది పడ్డాడు. కనీసం ఓవర్ కూడా పూర్తి చేయలేక మైదానం వీడటంతో కేకేఆర్ శిబిరంలో ఆందోళన మొదలైంది. ఇంత భారీ ధర పెట్టిన ప్లేయర్ ఇలా తొలి మ్యాచ్‌లోనే గాయపడటం టీమ్ మేనేజ్‌మెంట్‌కు పెద్ద ఎదురుదెబ్బ.

ఈ సీజన్లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టును గాయాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పటికే కీలక బౌలర్లు ఆకాష్ దీప్, హర్షిత్ రాణా టోర్నీ మొత్తానికి దూరమవ్వగా, వరుణ్ చక్రవర్తి ఇప్పుడిప్పుడే కోలుకుని జట్టులోకి వచ్చాడు. ఇప్పుడు పతిరానా కూడా గాయపడటంతో డెత్ ఓవర్లలో బౌలింగ్ వేసే క్వాలిటీ బౌలర్ కరువయ్యేలా ఉన్నాడు. గుజరాత్ జట్టుకు కూడా సాయి సుదర్శన్ దూరం అవ్వడం భారీ లోటు అనే చెప్పాలి, ఎందుకంటే ఈ సీజన్లో ఆ జట్టు తరపున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ ఆయనే.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story