Sai Sudharsan: చిన్నప్పుడు ఆ టీమ్ బస్సు కోసం రోడ్డుపై నిలబడేవాడిని.. ఇపుడు అదే జట్టుపై చితకబాదుతున్నా!

Sai Sudharsan About CSK Bonding. చిన్నప్పటి నుంచి తాను చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) వీరాభిమాని అని సాయి సుదర్శన్ వెల్లడించాడు.

Rishvik
Published on: 21 May 2026 7:39 PM IST
Sai Sudharsan
X

Sai Sudharsan: చిన్నప్పుడు ఆ టీమ్ బస్సు కోసం రోడ్డుపై నిలబడేవాడిని.. ఇపుడు అదే జట్టుపై చితకబాదుతున్నా!

Sai Sudharsan: ప్రస్తుతం ఐపీఎల్‌లో అత్యంత నిలకడగా రాణిస్తున్న యువ బ్యాటర్లలో సాయి సుదర్శన్ మొదటి స్థానంలో ఉన్నాడు. గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడుతున్న ఈ ఎలెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్.. తన అద్భుతమైన ఆటతో అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. ఐపీఎల్ 2025లో 759 పరుగులతో ఆరెంజ్ క్యాప్ అందుకున్న సాయి సుదర్శన్.. ఈ సీజన్‌లో కూడా అదే జోరు కొనసాగిస్తున్నాడు. ఇప్పటివరకు 13 మ్యాచ్‌ల్లో 554 పరుగులు చేసి మరోసారి తన క్లాస్‌ను చాటుకున్నాడు. అయితే తాజాగా సాయి చేసిన వ్యాఖ్యలు క్రికెట్ అభిమానుల మనసులను గెలుచుకున్నాయి.

చిన్నప్పటి నుంచి తాను చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) వీరాభిమాని అని సాయి సుదర్శన్ వెల్లడించాడు. 'సీఎస్‌కే మ్యాచ్‌లు తెగ చూసేవాడిని. మా స్నేహితులతో కలిసి స్కూల్ దగ్గర రోడ్డుపై నిలబడి సీఎస్‌కే టీమ్ బస్సు వెళ్లడాన్ని చూసేవాళ్లం. అందుకోసం చాలా సమయం వెయిట్ చేసేవాళ్లం. ఆ జ్ఞాపకాలు ఇప్పటికీ ఎంతో ప్రత్యేకం' అని గుర్తు చేసుకున్నాడు. సీఎస్‌కేతో తనకు భావోద్వేగ అనుబంధం ఉన్నప్పటికీ.. అదే జట్టుపై గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడటం దేవుడి కృప అని పేర్కొన్నాడు. ఐపీఎల్ 2023 ఫైనల్లో సీఎస్‌కేపై సాయి 47 బంతుల్లో 96 పరుగులు చేశాడు. 2024 సీజన్‌లో కూడా సీఎస్‌కేపైనే తన తొలి ఐపీఎల్ సెంచరీ నమోదు చేశాడు. సీఎస్‌కేతో ఆడేటప్పుడు తనలో ప్రత్యేకమైన ఉత్సాహం ఉంటుందని సాయి తెలిపాడు.

తన విజయ రహస్యంపై సాయి సుదర్శన్ మాట్లాడుతూ.. 'గతం గురించి ఎక్కువగా ఆలోచించను. నిన్న చేసింది ఈరోజు ఉపయోగపడదు. ప్రతి రోజు కొత్తగా మొదలుపెడతాను. అదే నా ఆలోచన విధానం' అని తెలిపాడు. శుభమాన్ గిల్‌తో తన భాగస్వామ్యంపై సాయి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'శుభ్‌మన్ గిల్ అద్భుతమైన క్రికెట్ మైండ్ కలిగిన ఆటగాడు. అతడు క్రీజులో ఉండటం వల్ల నాకు స్వేచ్ఛగా ఆడే ధైర్యం వస్తుంది. అతడు దాడి చేస్తే నేను నెమ్మదిగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళతా. మేమిద్దరం ఒకరినొకరం బాగా అర్థం చేసుకుంటాం' అని చెప్పాడు.

టీ20 క్రికెట్‌లో మార్పులకు అనుగుణంగా బ్యాటర్లు మారాల్సిందేనని సాయి సుదర్శన్ అభిప్రాయపడ్డాడు. 'టీ20 ఆట చాలా వేగంగా మారుతోంది. జట్టు అవసరానికి తగ్గట్టు మన ఆటను మార్చుకోవాలి. అదే విజయానికి కీలకం' అని తెలిపాడు. ఐపీఎల్‌లో తొలి 50 ఇన్నింగ్స్‌లలో అత్యధిక పరుగుల విషయంలో బాస్ క్రిస్ గేల్ రికార్డును అధిగమించడంపై మాట్లాడుతూ... 'రికార్డులు బద్దలవుతుంటే ఎంతో సంతోషంగా ఉంటుంది. అలాంటి మైలురాళ్లు మన సామర్థ్యంపై మరింత నమ్మకం పెంచుతాయి' అని తెలిపాడు. ఈరోజు సీఎస్‌కేతో మరో మ్యాచ్ ఆడేందుకు సాయి సిద్దమయ్యాడు. సాయి స్వస్థలం చెన్నై అణా విషయం తెలిసిందే.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story