Saina Nehwal: రీ-ఎంట్రీ, కోచింగ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సైనా నెహ్వాల్!

Saina Nehwal praises PV Sindhu's Japan Open Super 750 triumph. జపాన్ ఓపెన్ సూపర్ 750 టైటిల్ గెలిచిన పీవీ సింధుపై సైనా ప్రశంసల వర్షం కురిపించింది.

Rishvik
Published on: 20 July 2026 6:51 PM IST
Saina Nehwal
X

Saina Nehwal: రీ-ఎంట్రీ, కోచింగ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సైనా నెహ్వాల్!

Saina Nehwal: జపాన్ ఓపెన్ సూపర్ 750 టైటిల్ గెలిచిన భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధుపై భారత బ్యాడ్మింటన్ దిగ్గజం సైనా నెహ్వాల్ ప్రశంసల వర్షం కురిపించింది. గాయాల కారణంగా గత రెండు, మూడు సంవత్సరాలు కష్టకాలాన్ని ఎదుర్కొన్న సింధు.. ఇప్పుడు మరింత బలంగా తిరిగి వచ్చిందని సైనా పేర్కొంది. నిజమైన ఛాంపియన్లను ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదని, వారు ఎప్పటికైనా మళ్లీ విజయపథంలోకి వస్తారని తెలిపింది. ప్రస్తుతం కోచింగ్ గురించి వెంటనే నిర్ణయం తీసుకునే ఆలోచన లేదని సైనా స్పష్టం చేసింది.

టోక్యోలో జరిగిన జపాన్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో మూడు సార్లు ప్రపంచ చాంపియన్ అకానే యమగుచిని వరుస గేమ్‌ల్లో ఓడించిన పీవీ సింధు.. తన కెరీర్‌లో తొలి సూపర్ 750 టైటిల్‌ను సొంతం చేసుకుంది. 2019 ప్రపంచ ఛాంపియన్‌షిప్ తర్వాత ఆమె సాధించిన మేజర్ టైటిల్ ఇదే. ఈ విజయంపై స్పందించిన సైనా.. 'గత రెండు మూడు సంవత్సరాలు సింధుకు చాలా కష్టంగా గడిచాయి. గాయాల నుంచి కోలుకుని తిరిగి అత్యున్నత స్థాయిలో ఆడటం అంత సులభం కాదు. కానీ జపాన్ ఓపెన్‌లో సింధు ప్రదర్శన అద్భుతంగా ఉంది. ప్రపంచ స్థాయి ఆటగాళ్లను వరుసగా ఓడించి టైటిల్ గెలుచుకుంది. ముఖ్యంగా అటాకింగ్ గేమ్ చాలా మెరుగుపడింది. గతంతో పోలిస్తే సింధు అటాకింగ్ మరింత పదునుగా కనిపించింది' అని కొనియాడింది.

పీవీ సింధు వయసు పెరుగుతున్న కొద్దీ గాయాలు, ఒత్తిడిని ఎదుర్కోవడం సవాలుగా మారిందని సైనా చెప్పింది. 'అత్యున్నత స్థాయిలో ఆడేటప్పుడు ఒత్తిడి సహజం. కానీ ఈ టైటిల్ గెలవడంతో సింధుకు ఆత్మవిశ్వాసం తిరిగి వచ్చింది. ఛాంపియన్లను ఎప్పుడూ తక్కువగా అంచనా వేయకూడదు. వారు మళ్లీ బలంగా తిరిగి వచ్చి విజయాలు సాధిస్తారు. సింధు ఎన్నో సంవత్సరాలుగా ప్రపంచ స్థాయిలో నిలకడగా రాణిస్తోంది. ప్రస్తుతం చాలామంది యువ ఆటగాళ్లు మంచి ప్రదర్శన చేస్తున్నారు. అయితే విజయాల్లో నిలకడ చాలా ముఖ్యం. బ్యాడ్మింటన్‌లో నిరంతర విజయాలే ఆటగాడి స్థాయిని నిర్ణయిస్తాయి. ఒక్కో టోర్నీలో మెరవడం కాదు.. వరుసగా మంచి ప్రదర్శనలు ఇవ్వాలి. యువ ఆటగాళ్లు తదుపరి ఛాంపియన్‌షిప్‌లపై దృష్టి పెట్టి మరింత మెరుగ్గా రాణించాలి' అని సూచించింది.

ఆగస్టు 17 నుంచి 23 వరకు భారత్‌లో జరగనున్న బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌పై సైనా ఆశాభావం వ్యక్తం చేసింది. '17 ఏళ్ల తర్వాత ఈ ప్రతిష్టాత్మక టోర్నీ భారత్‌లో జరుగుతుండటం ఆనందంగా ఉంది. సింధు అద్భుత ఫామ్‌లో ఉంది. లక్ష్య సేన్ కూడా మంచి ఆట ప్రదర్శిస్తున్నాడు. మన ఆటగాళ్లకు స్వదేశంలో పతకాలు గెలిచే సత్తా ఉంది. ఈ టోర్నీ ప్రపంచంలోనే అత్యుత్తమంగా జరగాలని కోరుకుంటున్నాను. గ్లాస్గోలో జరగనున్న కామన్వెల్త్ గేమ్స్‌లో బ్యాడ్మింటన్, హాకీ, షూటింగ్ వంటి ప్రముఖ క్రీడలను ఈసారి చేర్చకపోవడం బాధ కలిగించింది. కామన్వెల్త్ గేమ్స్‌తో నాకు ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. పాల్గొంటున్న భారత క్రీడాకారులందరికీ శుభాకాంక్షలు. వారు ఎక్కువ బంగారు పతకాలు సాధించాలని కోరుకుంటున్నాను' అని చెప్పింది.

తాను కోచ్‌గా మారే విషయంపై కూడా సైనా స్పందించింది. ప్రస్తుతం కోచింగ్ గురించి వెంటనే నిర్ణయం తీసుకునే ఆలోచన లేదని స్పష్టం చేసింది. 'ఆడటం కంటే కోచింగ్ చాలా కష్టం. ఆటగాడిగా మనపై మాత్రమే దృష్టి పెడతాం. కానీ కోచ్‌గా చాలా మంది ఆటగాళ్ల బాధ్యత తీసుకోవాలి. ప్రస్తుతం యువతకు ప్రేరణాత్మక ప్రసంగాలు ఇస్తూ బ్యాడ్మింటన్‌కు సేవ చేస్తున్నాను. భవిష్యత్తులో పరిస్థితులను బట్టి కోచింగ్‌పై నిర్ణయం తీసుకుంటాను" అని వెల్లడించింది. తిరిగి అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌లోకి వస్తారా అనే ప్రశ్నకు సైనా సమాధానం ఇచ్చింది. 'ఆర్థరైటిస్ వచ్చిన తర్వాత మళ్లీ అంతర్జాతీయ స్థాయిలో ఆడటం చాలా కష్టం. వచ్చే ఏడాది నుంచి స్కోరింగ్ విధానంలో మార్పులు వచ్చినా, తిరిగి కోర్టులోకి రావడం అంత సులభం కాదు' అని పేర్కొంది.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story