Cricket: 3 సెంచరీలు, 109 నాటౌట్.. ఆస్ట్రేలియా టెస్ట్ జట్టులోకి స్టార్ ఓపెనర్ రీఎంట్రీ ఖాయమా.?
Cricket: ఆస్ట్రేలియా టెస్ట్ జట్టులోకి తిరిగి రావాలనే లక్ష్యంతో దేశవాళీల్లో వరుస సెంచరీలు కొడుతున్న 21 ఏళ్ల శామ్ కాన్‌స్టాస్, సౌత్ ఆస్ట్రేలియాతో షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్‌లో 109 పరుగులతో నాటౌట్‌గా నిలిచి న్యూసౌత్‌వేల్స్‌ను ఆదుకున్నాడు.
Cricket: 3 సెంచరీలు, 109 నాటౌట్.. ఆస్ట్రేలియా టెస్ట్ జట్టులోకి స్టార్ ఓపెనర్ రీఎంట్రీ ఖాయమా.?
Cricket: ఆస్ట్రేలియా టెస్ట్ జట్టులోకి తిరిగి రావాలన్న లక్ష్యంతో బరిలోకి దిగిన యువ బ్యాటర్ శామ్ కాన్‌స్టాస్ తన బ్యాట్‌తో సమాధానం చెబుతున్నాడు. దేశవాళీ క్రికెట్‌లో వరుసగా భారీ స్కోర్లు సాధిస్తూ సెలక్టర్ల దృష్టిని ఆకర్షిస్తున్నాడు. తాజాగా షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో సౌత్ ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో ఈ సీజన్‌లో తన మూడో సెంచరీని నమోదు చేశాడు. సిడ్నీ వేదికగా జరుగుతున్న ఈ పోరులో రెండో రోజు ఆట ముగిసే సమయానికి 109 పరుగులతో అజేయంగా నిలిచి న్యూసౌత్‌వేల్స్‌కు అండగా నిలిచాడు.
ఈ మ్యాచ్‌లో న్యూసౌత్‌వేల్స్ తొలి ఇన్నింగ్స్‌లో 204 పరుగులకే ఆలౌట్ కావడంతో ఒత్తిడిలో పడింది. సౌత్ ఆస్ట్రేలియా జేక్ వెదరాల్డ్ 142 పరుగులతో రాణించడంతో 325 పరుగులు చేసి ఆధిక్యం సాధించింది. అయితే రెండో ఇన్నింగ్స్‌లో కాన్‌స్టాస్ బాధ్యతాయుతంగా ఆడాడు. కుర్టిస్ ప్యాటర్సన్‌తో కలిసి రెండో వికెట్‌కు 117 పరుగులు జోడించి జట్టును నిలబెట్టాడు. కేవలం 129 బంతుల్లోనే ఈ సెంచరీని పూర్తి చేశాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి న్యూసౌత్‌వేల్స్ 2 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. దీంతో ప్రత్యర్థిపై 70 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది.
ప్రస్తుతం 21 ఏళ్ల వయసున్న కాన్‌స్టాస్ గత ఏడాది జూలైలో ఐదు టెస్టులు ఆడిన తర్వాత జాతీయ జట్టులో చోటు కోల్పోయాడు. అంతకుముందు తొలి 10 టెస్ట్ ఇన్నింగ్స్‌ల్లో 16.3 సగటుతో పరుగులు చేయడంతో జట్టు నుంచి తొలగించారు. అప్పటి నుంచి దేశవాళీ క్రికెట్‌లో తన సత్తా నిరూపించుకుంటున్నాడు. షెఫీల్డ్ షీల్డ్‌లో 71, 151 నాటౌట్, 5, 2, 24 పరుగులు సాధించాడు. తాజాగా మరో సెంచరీతో ఈ సీజన్‌లో నాలుగు దేశవాళీ మ్యాచ్‌ల్లో మూడో శతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇటీవల జరిగిన 50 ఓవర్ల మ్యాచ్‌లోనూ 149 పరుగులు చేశాడు.
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి టెస్టు డిసెంబర్ 9న పెర్త్‌లో ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌కు ఎంపిక కావాలంటే కాన్‌స్టాస్‌కు ప్రస్తుతం లభిస్తున్న ప్రతి అవకాశం కీలకమే. ఆస్ట్రేలియా సెలెక్షన్ ఛైర్మన్ జార్జ్ బెయిలీ మార్నస్ లబుషేన్‌ను న్యూజిలాండ్ సిరీస్‌కు ఎంపిక చేయబోమని ఇప్పటికే స్పష్టం చేశారు. లబుషేన్ స్థానం కోసం కాన్‌స్టాస్‌తో పాటు కుర్టిస్ ప్యాటర్సన్, జాక్ క్లేటన్, నాథన్ మెక్‌స్వీనీ పోటీలో ఉన్నారు. న్యూజిలాండ్ సిరీస్ జట్టును షెఫీల్డ్ షీల్డ్ నాలుగో రౌండ్ తర్వాత ప్రకటిస్తారు. సౌత్ ఆస్ట్రేలియాపై తన కెరీర్ బెస్ట్ 173 పరుగులు కూడా ఈ సీజన్‌లో కాన్‌స్టాస్ సాధించాడు.
వరుస భారీ ఇన్నింగ్స్‌లతో తన ఫామ్‌ను చాటుతున్న ఈ యువ ఆటగాడు సెలక్టర్లకు బలమైన సంకేతాలు పంపుతున్నాడు. షెఫీల్డ్ షీల్డ్‌లో ప్రస్తుతం అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ కూడా ఆయనే. మరి అతని ప్రదర్శనకు జాతీయ జట్టులో తిరిగి చోటు దక్కుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది.




