Sanjiv Goenka: మైదానంలో రిషభ్ పంత్‌తో వాగ్వాదం.. క్లారిటీ ఇచ్చిన లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకా!

ఐపీఎల్ 2026 మొదటి మ్యాచ్‌లోనే తన జట్టు ఓటమిని సంజీవ్ గోయెంకా తట్టుకోలేకపోయారు. మైదానంలో లక్నో కెప్టెన్ రిషభ్ పంత్‌కు తనదైన శైలిలో క్లాస్ పీకారు.

Rishvik
Published on: 2 April 2026 7:24 PM IST
Sanjiv Goenka
X

Sanjiv Goenka: మైదానంలో రిషభ్ పంత్‌తో వాగ్వాదం.. క్లారిటీ ఇచ్చిన లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకా!

IPL 2026: ఐపీఎల్ 2026లో భాగంగా బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఆరు వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది. లుంగి ఎంగిడి (3/27), నటరాజన్‌ (3/29), కుల్దీప్ యాదవ్‌ (2/31) విజృంభించడంతో లక్నో బ్యాటింగ్‌లో పూర్తిగా విఫలమై కేవలం 141 పరుగులకే ఆలౌట్ అయింది. మిచెల్‌ మార్ష్‌ (35), అబ్దుల్‌ సమద్‌ (36) చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. లక్ష్యాన్ని ఢిల్లీ 17.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. సమీర్ రిజ్వీ (70 నాటౌట్‌), ట్రిస్టన్ స్టబ్స్ (39 నాటౌట్‌) అద్భుతంగా ఆడి డీసీకి సునాయాస విజయాన్ని అందించారు. మ్యాచ్ అనంతరం లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకా వార్తల్లో నిలిచారు.

ఐపీఎల్ 2026 మొదటి మ్యాచ్‌లోనే తన జట్టు ఓటమిని సంజీవ్ గోయెంకా తట్టుకోలేకపోయారు. మైదానంలో లక్నో కెప్టెన్ రిషభ్ పంత్‌కు తనదైన శైలిలో క్లాస్ పీకారు. అలానే పక్కనే ఉన్న హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్‌పై కూడా ఫైర్ అయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియోస్, పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దాంతో 2024లో మాజీ కెప్టెన్ కేఎల్ రాహుల్‌‌ని అవమానించేలా మాట్లాడిన తీరును గుర్తుచేస్తూ గోయెంకాను నెటిజెన్స్ మరోసారి టార్గెట్ చేశారు. 'సంజీవ్ గోయెంకా మళ్లీ మొదలెట్టాడు', 'లక్నో కెప్టెన్లకు ఏఈ టార్చర్ ఏంటి రా బాబు'. 'అప్పుడు రాహుల్, ఇప్పుడు పంత్ బలి' అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేశారు. లక్నో జట్టులో ఏదో జరుగుతోందంటూ నెట్టింట ఊహాగానాలు మొదలయ్యాయి. దాంతో గోయెంకా స్వయంగా స్పందించాల్సి వచ్చింది.

ఐపీఎల్ సుదీర్ఘమైన టోర్నీ అని, ఒక గొప్ప జట్టును నిర్మించే క్రమంలో ఇలాంటి క్షణాలు సహజం అంటూ ఎక్స్‌ వేదికగా సంజీవ్ గోయెంకా ఓ పోస్ట్ చేశారు. 'ఐపీఎల్ సుదీర్ఘమైన సీజన్. ఒక గొప్ప జట్టును నిర్మించే క్రమంలో ఇలాంటి క్షణాలు సహజం. మా కెప్టెన్, జట్టుపై నాకు పూర్తి నమ్మకం ఉంది. మా అభిమానుల మద్దతుకు ధన్యవాదాలు. మేము మరింత బలంగా తిరిగి వస్తాం. మేం ఆడింది ఒకటే మ్యాచ్. ఈ సీజన్‌లో లక్నో కథ ఇంకా ముగియలేదు' అని గోయెంకా ట్వీట్ చేశారు. జట్టుకు, కెప్టెన్‌కు తాను పూర్తి మద్దతుగా ఉన్నానని ఈ పోస్ట్‌తో గోయెంకా స్పష్టం చేశారు.

మ్యాచ్ అనంతరం మాట్లాడిన రిషభ్ పంత్ తన బ్యాటింగ్ స్థానంపై స్పందించాడు. 'ఈ మ్యాచ్‌లో నేను ఓపెనర్‌గా వచ్చాను. భవిష్యత్తులో ఓపెనర్‌గా వస్తానా అన్నది చెప్పలేను. 50-50 ఛాన్సెస్. మ్యాచ్‌లో రన్ అవుట్ లాంటి విషయాలను మర్చిపోవడమే ఉత్తమ మార్గం. వాటిని గురించి ఆలోచిస్తే ఒత్తిడి పెరుగుతుంది. ఈ మ్యాచ్‌లో సరైన భాగస్వామ్యాలు లేకపోవడం వల్లే జట్టు తక్కువ స్కోరుకే పరిమితమైంది' అని పంత్ అంగీకరించాడు. ఇంపాక్ట్ సబ్‌గా షాహ్‌బాజ్ అహ్మద్‌ను తీసుకోవడం కూడా పరిస్థితుల కారణంగానే తీసుకున్న నిర్ణయమేనని తెలిపాడు. పూరన్ కంటే ముందు అయుష్ బడోనీని పంపడంపై కూడా వివరణ ఇచ్చాడు. మధ్య ఓవర్లలో ఆటను మలుపు తిప్పడం కోసం బడోనీకి ప్రత్యేక పాత్ర ఇచ్చాం అని చెప్పుకొచ్చాడు.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story