Sanju Samson: వైభవ్ అరంగేట్రం.. సంజుకి మరలా అన్యాయం.. కెరీర్‌లో ప్రతి మ్యాచ్ 'డూ ఆర్ డై'నే!

Sanju Samson: Indian Fans Suppoert Sanju Samson. టీ20 ప్రపంచకప్ 2026 విన్నర్ సంజు శాంసన్‌ స్థానంలో బుడ్డోడికి అవకాశం దక్కింది.

Rishvik
Published on: 4 July 2026 10:00 PM IST
Sanju Samson
X

Sanju Samson: వైభవ్ అరంగేట్రం.. సంజుకి మరలా అన్యాయం.. కెరీర్‌లో ప్రతి మ్యాచ్ 'డూ ఆర్ డై'నే!

Sanju Samson: మాంచెస్టర్ వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం చేశాడు. టీ20 ప్రపంచకప్ 2026 విన్నర్ సంజు శాంసన్‌ స్థానంలో బుడ్డోడికి అవకాశం దక్కింది. సూర్యవంశీకి అరంగేట్రం అవకాశం ఇవ్వడం ఎంతటి సంచలనమో.. అదే సమయంలో సంజును తుది జట్టు నుంచి తప్పించడం మరో పెద్ద చర్చకు దారితీసింది. 15 ఏళ్ల వైభవ్‌కు అవకాశం రావడాన్ని అభిమానులు స్వాగతిస్తున్నప్పటికీ.. సంజుకు మాత్రం అన్యాయం జరిగిందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వైరల్ అవుతున్నాయి.

ఈ ఏడాది ఆరంభంలో జరిగిన టీ20 ప్రపంచకప్‌ 2026లో సంజు శాంసన్ 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్'గా నిలిచాడు. అంతే కాకుండా ఐపీఎల్‌ 2026లో రెండు సెంచరీలు బాది అద్భుత ఫామ్‌ను కనబరిచాడు. అలాంటి ఆటగాడిని వరుసగా మూడు మ్యాచ్‌లలో విఫమైన కారణంగా జట్టు నుంచి తప్పించడం సరైన నిర్ణయం కాదని పలువురు అభిమానులు అభిప్రాయపడుతున్నారు. సూర్యవంశీకి అవకాశం ఇవ్వడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ సంజుకు మరిన్ని అవకాశాలు ఇవ్వాల్సిందని అభిమానులు ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మరో పోస్టు సంజు శాంసన్ టీ20 కెరీర్‌ను వివరిస్తోంది. అందులో సంజు ఆడిన దాదాపు ప్రతి మ్యాచ్‌ను 'డూ ఆర్ డై మ్యాచ్'గా పేర్కొంటూ.. ప్రతి అవకాశాన్ని నిరూపించుకోవాల్సిన పరిస్థితి అతడికి ఎదురైందని పేర్కొన్నారు. 36వ, 37వ, 40వ టీ20ల్లో సెంచరీలు సాధించినప్పటికీ.. మళ్లీ ప్రతి మ్యాచ్‌లో తన స్థానాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. టీ20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్‌పై అజేయంగా 97 పరుగులు చేయడం, సెమీఫైనల్‌లో 89, ఫైనల్లో మరో 89 పరుగులతో కీలక పాత్ర పోషించినప్పటికీ.. 66వ మ్యాచ్‌కు వచ్చేసరికి మళ్లీ తన స్థానాన్ని నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. 'సంజు కెరీర్‌లో ప్రతి మ్యాచ్ డూ ఆర్ డై మ్యాచ్‌లాగే మారింది' అంటూ అభిమానులు భావోద్వేగ పోస్టులు షేర్ చేస్తున్నారు.

అయితే మరోవైపు భారత జట్టు మేనేజ్‌మెంట్ మాత్రం భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా టాస్ సందర్భంగా వైభవ్ తన ప్రదర్శనతో ఈ అవకాశానికి పూర్తిగా అర్హుడని స్పష్టం చేశాడు. దీంతో ఒకవైపు భారత క్రికెట్‌లో కొత్త అధ్యాయం ప్రారంభమైన ఆనందం కనిపిస్తుండగా.. మరోవైపు సంజు శాంసన్ భవిష్యత్తుపై అభిమానుల్లో ఆందోళన కొనసాగుతోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో #SanjuSamson, #VaibhavSooryavanshi హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ అవుతున్నాయి. మరలా సంజు జట్టులో ఎప్పుడు చోటు సంపాదిస్తాడో చూడాలి. ప్లేయింగ్ 11లో లేనంత మాత్రాన సంజు పని అయిపోలేదని అంటున్నారు. చూడాలి మరి సంజు కెరీర్ ఎలా సాగుతుందో.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story