Sanju Samson-BCCI: జింబాబ్వే సిరీస్‌లో సంజుపై వేటు.. కారణం ఏంటో తెలిసిపోయింది.. బీసీసీఐ అసలు ప్లాన్ ఇదే!

BCCI Plan Explained Sanju Samson Dropped. సంజు శాంసన్‌ను తప్పించడం వెనుక బీసీసీఐ సెలెక్టర్లకు స్పష్టమైన ప్రణాళిక ఉందని తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి.

Rishvik
Published on: 7 July 2026 7:36 PM IST
Sanju Samson
X

Sanju Samson-BCCI: జింబాబ్వే సిరీస్‌లో సంజుపై వేటు.. కారణం ఏంటో తెలిసిపోయింది.. బీసీసీఐ అసలు ప్లాన్ ఇదే!

Sanju Samson: టీమిండియా స్టార్ వికెట్‌కీపర్ బ్యాటర్ సంజు శాంసన్‌ను జింబాబ్వేతో జరిగే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ఎంపిక కాని విషయం తెలిసిందే. సంజుకు జట్టులో చోటు లేకపోవడంతో అభిమానుల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. 2026 టీ20 ప్రపంచకప్‌లో 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్'గా నిలిచిన సంజూను పక్కన పెట్టడంపై బీసీసీఐపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ నిర్ణయం వెనుక సెలెక్టర్లకు స్పష్టమైన ప్రణాళిక ఉందని తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి.

ప్రయోగాల వేదికగా చూసిన సెలెక్టర్లు:

అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సెలక్షన్ కమిటీ జింబాబ్వే పర్యటనను యువ ఆటగాళ్లు, రిజర్వ్ ప్లేయర్లను పరీక్షించే సిరీస్‌గా భావించింది. అందుకే ఇప్పటికే భారత జట్టులో కీలక సభ్యుడిగా ఉన్న సంజు శాంసన్‌ను ఈ సిరీస్‌కు ఎంపిక చేయలేదని తెలుస్తోంది. అతడి సామర్థ్యంపై ఎలాంటి సందేహం లేకపోవడంతో కొత్త ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ప్రభ్‌సిమ్రన్ సింగ్‌కు తొలి అవకాశం:

సంజు శాంసన్ ఇప్పటికే సెప్టెంబర్‌లో జపాన్ వేదికగా జరిగే 2026 ఆసియా క్రీడల కోసం భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. దీంతో మరో వికెట్‌కీపర్ బ్యాటర్‌ను పరీక్షించాలనే ఉద్దేశంతో ప్రభ్‌సిమ్రన్ సింగ్‌కు తొలి అవకాశం కల్పించారు. గత రెండు ఐపీఎల్ సీజన్లలో పంజాబ్ కింగ్స్ తరఫున ప్రభ్‌సిమ్రన్ నిలకడైన ప్రదర్శన చేయడంతో పాటు ఇటీవల శ్రీలంకలో జరిగిన ఇండియా-ఏ ట్రైసిరీస్‌లో కూడా ఆకట్టుకున్నాడు. ఇప్పుడు జింబాబ్వే సిరీస్‌లో ఇషాన్ కిషన్‌తో కలిసి వికెట్‌కీపర్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు.

ప్రపంచకప్ హీరో.. కానీ ఇటీవల వరుస వైఫల్యాలు:

2026 టీ20 ప్రపంచకప్‌లో సంజు శాంసన్ అద్భుత ప్రదర్శన చేశాడు. టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లలో మూడో స్థానంలో నిలవడంతో పాటు 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్' అవార్డును సొంతం చేసుకున్నాడు. అలాగే ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున రెండు సెంచరీలు బాదుతూ జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. అయితే ఆ తర్వాత ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల్లో మాత్రం అతడు నిరాశపరిచాడు. వరుసగా 5, 0, 1 పరుగులకే పరిమితమయ్యాడు. దీంతో ఇంగ్లండ్‌తో రెండో టీ20లో సంజును తప్పించి 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి అరంగేట్ర అవకాశం కల్పించారు.

ఆసియా క్రీడలపై సంజూ ఫోకస్:

జింబాబ్వే సిరీస్‌కు ఎంపిక కాకపోయినా సంజు శాంసన్‌పై బీసీసీఐ సెలెక్టర్లు పూర్తిగా నమ్మకం కోల్పోయారని చెప్పలేం. ఇప్పటికే ఆసియా క్రీడల జట్టులో అతడికి చోటు దక్కింది. అందువల్ల జపాన్‌లో జరిగే మెగా ఈవెంట్‌లో మరోసారి తన సత్తా చాటేందుకు సంజు సిద్ధమవుతున్నాడు. మంచి ప్రదర్శన కనబరిస్తే భవిష్యత్ టీ20 ప్రణాళికల్లో అతడు మళ్లీ కీలక పాత్ర పోషించే అవకాశాలు లేకపోలేదు.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story