Sanju Samson: సంజు శాంసన్‌కు కొత్త టెన్షన్.. ఇక ఆ దేవుడే కాపాడాలి!

Sanju Samson: Sanju Samson vs Vaibhav Sooryavanshi వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్‌ భవిష్యత్తుపై కొత్త ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Rishvik
Published on: 6 Jun 2026 6:59 PM IST
Sanju Samson
X

Sanju Samson: సంజు శాంసన్‌కు కొత్త టెన్షన్.. ఇక ఆ దేవుడే కాపాడాలి!

Sanju Samson: భారత టీ20 జట్టులో తాజాగా చోటుచేసుకున్న మార్పులు ఆసక్తికర చర్చకు దారితీశాయి. 2026 టీ20 ప్రపంచ కప్ విజేత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్థానంలో శ్రేయస్ అయ్యర్‌ను కొత్త సారథిగా నియమించిన బీసీసీఐ.. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలు సహా ఆసియా క్రీడల కోసం భారత జట్లను ప్రకటించింది.

ఈ మూడు జట్లలోనూ వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్‌కు చోటు దక్కింది. అయితే టీ20 ప్రపంచ కప్, ఐపీఎల్ 2026లో సంజు రాణించినా.. అతడి భవిష్యత్తుపై కొత్త ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అందుకు ప్రధాన కారణం 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ భారత జట్టులోకి ఎంట్రీ ఇవ్వడమే.

ఓపెనింగ్ కాంబినేషన్‌లో మార్పులు:

ఐపీఎల్ 2026లో అద్భుత ప్రదర్శనతో దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన వైభవ్ సూర్యవంశీకి తొలిసారిగా భారత సీనియర్ జట్టులో చోటు లభించింది. ఓపెనర్‌గా, మ్యాచ్‌ను ఒంటిచేత్తో మలుపుతిప్పగల ఆటగాడిగా గుర్తింపు పొందిన వైభవ్‌ను జట్టులోకి తీసుకోవడంతో భారత టీ20 కాంబినేషన్‌లో మార్పులు తప్పనిసరి కానున్నాయి. గత టీ20 ప్రపంచ కప్‌లో అభిషేక్ శర్మ, సంజు శాంసన్‌, ఇషాన్ కిషన్ టాప్-3లో బ్యాటింగ్ చేశారు.

అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రపంచ నంబర్-1 టీ20 బ్యాటర్‌గా కొనసాగుతున్న అభిషేక్ ఓపెనర్‌గా కొనసాగడం ఖాయం. మరో ఓపెనర్ స్థానానికి వైభవ్ సూర్యవంశీ బలమైన పోటీదారుడిగా ఉన్నాడు. దీంతో అభిషేక్-వైభవ్ జోడీ భవిష్యత్తులో భారత జట్టుకు అత్యంత ప్రమాదకర ఓపెనింగ్ కాంబినేషన్‌గా మారే అవకాశాలు ఉన్నాయి.

సంజు, ఇషాన్‌ల మధ్య నంబర్-3 పోటీ:

కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, వైస్ కెప్టెన్ తిలక్ వర్మ వరుసగా నాలుగో, ఐదో స్థానాల్లో బ్యాటింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో టాప్ ఆర్డర్‌లో మిగిలే కీలకమైన స్థానం నంబర్-3 మాత్రమే. ఈ స్థానానికి సంజు శాంసన్‌, ఇషాన్ కిషన్ మధ్య పోటీ నెలకొలనుంది.

ఇటీవల ఐపీఎల్‌లో ఇషాన్ నిలకడగా పరుగులు చేయడం, కీలక ఇన్నింగ్స్‌లు ఆడటం అతడికి ప్లస్ పాయింట్‌గా మారింది. సంజు కంటే ఇషాన్ మరింత నిలకడ ప్రదర్శించాడనే అభిప్రాయం సెలెక్టర్లలో ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవేళ ఇషాన్‌కు నంబర్-3 స్థానం ఖరారైతే.. వికెట్ కీపర్‌గా ఆరవ స్థానంలో సంజు బ్యాటింగ్ చేయనున్నాడు. ఓపెనర్‌గా సత్తాచాటే సంజు.. మిడిల్ ఆర్డర్‌లో ఎలా రాణిస్తాడో అన్న భయం కూడా ఉంది అభిమానుల్లో.

సూర్య మద్దతు ఇక లేదు:

గత కొంతకాలంగా సంజు శాంసన్‌ భారత టీ20 జట్టులో స్థిరపడటానికి ఇద్దరు కీలక వ్యక్తులు కారణమని క్రికెట్ వర్గాలు భావిస్తాయి. వారిలో ఒకరు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కాగా.. మరొకరు మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. సూర్యకుమార్, సంజు మధ్య మంచి అనుబంధం ఉంది.

గంభీర్, సూర్య ఇద్దరూ సంజుపై విశ్వాసం ఉంచడం అతడి కెరీర్‌కు ఉపయోగపడింది. అయితే ఇప్పుడు సూర్య కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో ఆ మద్దతు లేనట్లే. కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నుంచి అదే స్థాయి ప్రోత్సాహం లభిస్తుందా లేదా అనేది చూడాల్సి ఉంది.

ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందే

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సంజు శాంసన్‌కు జట్టులో స్థానం కొనసాగాలంటే ప్రతి అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. భారీ స్కోర్లు చేయడం, కీలక మ్యాచ్‌ల్లో బాధ్యతాయుత ఇన్నింగ్స్‌లు ఆడటం ద్వారా మాత్రమే తన స్థానాన్ని కాపాడుకోగలడు. ఈ విషయం అతడికి కూడా తెలుసు.

ఇప్పటికే ఎన్నో దెబ్బలు తిన్న సంజు.. తన కెరీర్ ఎలా ప్లాన్ చేసుకుంటాడో చూడాలి. వైభవ్ సూర్యవంశీ రాకతో భారత టీ20 జట్టులో పోటీ మరింత పెరిగింది. ఈ పోటీలో సంజు ఎలా నిలబడతాడు?, తన అనుభవంతో మళ్లీ జట్టులో కీలక ఆటగాడిగా మారతాడా? అన్నది రాబోయే సిరీస్‌లలో ఆసక్తికరంగా మారనుంది.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story