ఒక్క ఇన్నింగ్స్‌తో విమర్శకులకు ఇచ్చిపడేసిన సంజూ శాంసన్.. ఢిల్లీలో రికార్డుల మోత..!
Sanju Samson: అఫ్గానిస్థాన్‌తో సిరీస్‌లో చోటుపై చెలరేగిన విమర్శలకు స్టార్ ఓపెనర్ సంజూ శాంసన్ తన బ్యాట్‌తోనే దీటైన సమాధానం చెప్పాడు.
ఒక్క ఇన్నింగ్స్‌తో విమర్శకులకు ఇచ్చిపడేసిన సంజూ శాంసన్.. ఢిల్లీలో రికార్డుల మోత..!
Sanju Samson: భారత క్రికెట్ జట్టు (Team India), అఫ్గానిస్థాన్ (Afghanistan) మధ్య ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం (Arun Jaitley Stadium) వేదికగా జరిగిన రెండో టీ20 సమరంలో సంజూ శాంసన్ (Sanju Samson) ఊచకోత కోశాడు. తొలి మ్యాచ్‌లో కేవలం 10 పరుగులకే నిష్క్రమించడంతో, యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi)ని కాదని సంజూను ఆడించడంపై బీసీసీఐ (BCCI) తీవ్ర విమర్శలు ఎదుర్కొంది.
వీటన్నింటికీ ఫుల్‌స్టాప్ పెడుతూ రెండో పోరులో శాంసన్ కేవలం 22 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 57 పరుగులు సాధించి రషీద్ ఖాన్ (Rashid Khan) బౌలింగ్‌లో వెనుదిరిగారు. ఈ క్రమంలో కేవలం 20 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేసి, అంతర్జాతీయ టీ20ల్లో అఫ్గాన్‌పై రెండో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ బాదిన బ్యాటర్‌గా నిలిచారు.
తన టీ20 కెరీర్‌లో కూడా సంజూకు ఇదే అత్యంత వేగవంతమైన అర్ధశతకం. 2024లో బంగ్లాదేశ్ మీద 22 బంతుల్లో చేసిన రికార్డును ఆయన అధిగమించారు. టీ20 ప్రపంచకప్ (T20 World Cup) 2026 ఫైనల్ పోరులో 46 బంతుల్లో 89 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు అందుకున్న తర్వాత పొట్టి ఫార్మాట్‌లో సంజూకు ఇదే తొలి ఫిఫ్టీ కావడం విశేషం.
ఈ మెరుపు ఇన్నింగ్స్ సహాయంతో భారత ఓపెనర్‌గా అంతర్జాతీయ టీ20ల్లో 1000 పరుగుల మైలురాయిని శాంసన్ దాటేశారు. ఇప్పటివరకు రోహిత్ శర్మ (Rohit Sharma), కేఎల్ రాహుల్ (KL Rahul), శిఖర్ ధావన్ (Shikhar Dhawan), అభిషేక్ శర్మ (Abhishek Sharma) మాత్రమే ఈ ఘనత సాధించగా, ఇప్పుడు వారి సరసన సంజూ నిలిచారు.
60 ఇన్నింగ్స్‌ల్లో 1499 పరుగులు చేసిన ఈ కేరళ బ్యాటర్ ఖాతాలో మూడు సెంచరీలు, ఏడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అయితే 27.25 సగటుతో నిలకడలేమి సమస్య వెంటాడుతున్న వేళ, ఈ కీలక ఇన్నింగ్స్ ఆయనకు కొండంత ఊరటనిచ్చింది.




