Sanju Samson: అతడు నా కంటే బాగా ఆడాడు.. ఇక నా కెరీర్ క్లోజ్ అని అర్ధమైంది!

Sanju Samson: Sanju Samson shares an story about losing his place in T20 World Cup. సంజు శాంసన్ తన కెరీర్‌లో ఎదుర్కొన్న అత్యంత క్లిష్టమైన దశను గుర్తు చేసుకున్నాడు.

Rishvik
Published on: 21 July 2026 6:47 PM IST
Sanju Samson
X

Sanju Samson: అతడు నా కంటే బాగా ఆడాడు.. ఇక నా కెరీర్ క్లోజ్ అని అర్ధమైంది!

Sanju Samson: టీమిండియా వికెట్‌కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ తన కెరీర్‌లో ఎదుర్కొన్న అత్యంత క్లిష్టమైన దశను గుర్తు చేసుకున్నాడు. 2026 టీ20 ప్రపంచ కప్‌కు ముందు న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో విఫలమైన తర్వాత మెగా టోర్నీలో తనకు తుది జట్టులో స్థానం దక్కలేదని, ఆ సమయంలో చాలా బాదపడ్డాడని చెప్పాడు. అదే సమయంలో ఇషాన్ కిషన్ అద్భుత ప్రదర్శనలతో తన కంటే ముందుకు వెళ్లాడని వెల్లడించాడు. ప్రపంచ కప్‌లో చోటు దక్కే అవకాశాలు ముగిసిపోయాయని తనకు అర్ధమైందని, అప్పుడు నిశ్శబ్దంగా కూర్చుని చప్పట్లు కొట్టడమేనని మిగిలిందని భావోద్వేగంగా సంజు చెప్పుకొచ్చాడు.

జియో స్టార్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంజు శాంసన్ మాట్లాడుతూ... 'ఆ సమయంలో ఇషాన్ కిషన్ కెరీర్ పూర్తిగా భిన్నంగా సాగింది. మొదట అతను జట్టులో కూడా లేడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో రాణించాడు. ఝార్ఖండ్‌కు ఒంటిచేత్తో టైటిల్ అందించాడు. ఆ తర్వాత భారత జట్టులోకి వచ్చి అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఇషాన్ సెలెక్టర్ల దృష్టిలో నాకంటే ముందుకు వెళ్తున్నాడని నాకు స్పష్టంగా అర్థమైంది. న్యూజిలాండ్ సిరీస్‌లో నేను ఐదు మ్యాచ్‌ల్లో 24, 6, 6, 10, 0 పరుగులే చేశాను. నేను వరుసగా విఫలమవుతుంటే ఇషాన్ వచ్చి 70కి పైగా పరుగులు చేయడంతో పాటు సెంచరీ కూడా బాదాడు. ఫామ్‌లో ఉన్న ఆటగాడినే ఏ జట్టైనా ప్రపంచ కప్‌లో ఆడిస్తుంది. అప్పుడే ప్రపంచ కప్ అవకాశాలు నా చేతుల్లో నుంచి జారిపోయాయని అర్థమైంది. ఇక నేను చేయగలిగింది నిశ్శబ్దంగా కూర్చుని చప్పట్లు కొట్టడమే అని అనుకున్నా' అని చెప్పాడు.

భారత జట్టులో పోటీ ఎంత తీవ్రంగా ఉంటుందో ఈ అనుభవం తనకు బాగా అర్థమైందని సంజు శాంసన్ పేర్కొన్నాడు. 'భారత జట్టులో పోటీ తీవ్రంగా ఉంటుంది. భారత క్రికెటర్ జీవితంలో చోటు నిలుపుకోవడమే అసలైన సవాల్. ఒక్క రోజులోనే పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి. నాకు వరుసగా ఏడు మ్యాచ్‌ల్లో అవకాశం వచ్చినప్పుడు మూడు సెంచరీలు చేస్తానని నేనే ఊహించలేదు. ఆ ఇన్నింగ్స్‌ల తర్వాత అందరూ టీ20 జట్టులో నా స్థానం ఖాయమైందని చెప్పారు. కానీ నేను మాత్రం అలా ఎప్పుడూ అనుకోలేదు. అందుకు ఉదాహరణే ప్రపంచ కప్. మొదట ఆడకున్నా.. ఆ దేవుడి దయ వల్ల అవకాశం వచ్చింది. మూడు మ్యాచులలో పరుగులు చేయడంతో చాలా సంతోషం వేసింది' అని వెల్లడించాడు.

ప్రపంచ కప్ జట్టులో చోటు కోసం తాను ఎంతగానో శ్రమించినప్పటికీ ఫలితం దక్కలేదని సంజు శాంసన్ తెలిపాడు. 'టీ20 ప్రపంచ కప్ జట్టులో ఉండాలనే లక్ష్యంతో ప్రాణం పెట్టి ప్రాక్టీస్ చేశాను. కానీ ఐదు మ్యాచ్‌ల్లో నా అత్యధిక స్కోరు 24 మాత్రమే. అప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది. గంటల తరబడి ప్రాక్టీస్ చేయడం ఒక్కటే విజయానికి మార్గం కాదు. ఆ క్లిష్ట సమయంలో నా భార్య చెప్పిన సలహా ఎంతో ఉపయోగపడింది. నేను అతిగా శ్రమిస్తున్నానని, మానసికంగా ప్రశాంతంగా, సంతోషంగా ఉండటం కూడా అంతే ముఖ్యమని నా భార్య ఎప్పుడూ చెప్పేది. న్యూజిలాండ్ సిరీస్ తర్వాత ఆమె చెప్పిందే నిజమని అర్థమైంది. మానసికంగా బలంగా ఉండగలిగితేనే మైదానంలో అత్యుత్తమ ప్రదర్శన చేయగలమనే పాఠాన్ని ఆ సిరీస్ నాకు నేర్పింది' అని సంజు చెప్పుకొచ్చాడు.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story