Sanju Samson: అఫ్గాన్‌తో తొలి టీ20.. సంజు శాంసన్ పేరిట చెత్త రికార్డ్.. ఓపెనర్‌గా కష్టమేగా..?

Sanju Samson: అఫ్గానిస్థాన్‌తో అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగే తొలి టీ20 సమరానికి భారత క్రికెట్ జట్టు సన్నద్ధమైంది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని భారత జట్టులో ఓపెనింగ్ స్థానం ఎవరికి దక్కుతుందనే అంశం చర్చనీయాంశంగా మారింది.

Venkat
Published on: 13 Sept 2026 1:19 PM IST
Sanju Samson
X

Sanju Samson: అఫ్గాన్‌తో తొలి టీ20.. సంజు శాంసన్ పేరిట చెత్త రికార్డ్.. ఓపెనర్‌గా కష్టమేగా..?

Sanju Samson: భారత జట్టు ఓపెనింగ్ విభాగంలో అభిషేక్ శర్మ (Abhishek Sharma) తన స్థానాన్ని దాదాపు ఖాయం చేసుకోగా, అతడితో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించే మరో బ్యాటర్ ఎవరనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) నేతృత్వంలో టీమ్ మేనేజ్‌మెంట్ ఎవరి వైపు మొగ్గు చూపుతుందనేది తేలాల్సి ఉంది. టీ20 ప్రపంచకప్ (T20 World Cup) కీలక దశలో అద్భుతమైన ఇన్నింగ్స్‌లతో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచిన సంజు శాంసన్, ఆ తర్వాత ఇంగ్లండ్ పర్యటనలో నాలుగు ఇన్నింగ్స్‌లలో కేవలం 33 పరుగులు మాత్రమే చేయగలిగాడు.

అనంతరం జింబాబ్వే సిరీస్‌కు విశ్రాంతి తీసుకున్నాడు. అదే సమయంలో జట్టులోకి వచ్చిన 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కేవలం మూడు ఇన్నింగ్స్‌లలోనే 151 పరుగులు బాది జట్టు యాజమాన్యాన్ని ఆకట్టుకున్నాడు.

ఈ క్రమంలో అఫ్గానిస్థాన్‌పై సంజు శాంసన్ పేరిట ఒక విచిత్రమైన గణాంకం నమోదై ఉంది. పొట్టి ఫార్మాట్‌లో అఫ్గాన్‌పై ఆడి ఒక్క పరుగు కూడా చేయని ఏకైక భారత బ్యాటర్‌గా శాంసన్ నిలిచాడు. 31 ఏళ్ల ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్ అఫ్గానిస్థాన్‌తో ఇప్పటివరకు కేవలం ఒకే ఒక్క అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడాడు.

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం (Chinnaswamy Stadium) వేదికగా 2024 జనవరి 17న జరిగిన ఆ మ్యాచ్‌లో శాంసన్ ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. ఫరీద్ అహ్మద్ (Fareed Ahmed) బౌలింగ్‌లో ఎదుర్కొన్న తొలి బంతికే గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు.

ఆ మ్యాచ్‌లో భారత జట్టు 212 పరుగుల భారీ స్కోరు సాధించి, సూపర్ ఓవర్ ద్వారా చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేసుకుంది. అదే మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సైతం డకౌట్ అయినప్పటికీ, అంతకుముందే అఫ్గాన్‌పై శతకం బాదిన ఘనత అతడికి ఉంది.

దీంతో అఫ్గానిస్థాన్‌పై ఖాతా తెరవని భారత ఆటగాడిగా సంజు శాంసన్ మాత్రమే మిగిలాడు. తాజా సిరీస్‌లో చోటు దక్కించుకుని మెరుపులు మెరిపించాలని శాంసన్ భావిస్తున్నాడు.

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.