శ్రీలంకపై భారీ విజయం.. గోల్డ్ సెలబ్రేషన్స్‌కు స్పెషల్ స్కెచ్ వేసిన లేడీ సెహ్వాగ్.. అదేంటంటే?

Asian Games 2026: ఆసియా క్రీడలు మహిళల క్రికెట్ పోరులో భారత జట్టు పసిడి పతకాన్ని ముద్దాడింది. ఫైనల్ పోరులో శ్రీలంక జట్టుపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి అద్భుత విజయాన్ని అందుకుంది.

Venkat
Published on: 22 Sept 2026 6:50 PM IST
Asian Games 2026
X

శ్రీలంకపై భారీ విజయం.. గోల్డ్ సెలబ్రేషన్స్‌కు స్పెషల్ స్కెచ్ వేసిన లేడీ సెహ్వాగ్.. అదేంటంటే?

Asian Games 2026: ఆసియా క్రీడల్లో భారత మహిళా క్రికెట్ జట్టు (Indian Women Cricket Team) తిరుగులేని ఆధిపత్యాన్ని చాటుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంక జట్టుపై ఏకంగా 147 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించి వరుసగా రెండోసారి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) సారథ్యంలోని టీమిండియా నిర్దేశించిన 217 పరుగుల లక్ష్య ఛేదనలో శ్రీలంక ఘోరంగా తడబడింది. ప్రత్యర్థి జట్టు కేవలం 69 పరుగులకే కుప్పకూలింది. భారత జట్టు సాధించిన ఈ చారిత్రక విజయంలో ఓపెనర్ షెఫాలీ వర్మ ఆల్‌రౌండ్ షో కీలకంగా నిలిచింది. దేశ గౌరవాన్ని చాటడమే తమ ప్రధాన లక్ష్యమని చెప్పిన ఆమె, ఈ విజయోత్సవాన్ని జట్టు సభ్యులతో కలిసి డిన్నర్ చేస్తూ జరుపుకుంటామని వెల్లడించింది.

మ్యాచ్‌లో షెఫాలీ బ్యాట్‌తో, బంతితో రాణించింది. కేవలం 29 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో ధనాధన్ 48 పరుగులు చేసి శుభారంభాన్ని ఇచ్చింది. అనంతరం బౌలింగ్‌లోనూ మ్యాజిక్ చేస్తూ 2 ఓవర్లలో కేవలం 3 పరుగులు ఇచ్చి 2 కీలక వికెట్లు పడగొట్టింది. ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేయడంలో ప్రధాన పాత్ర పోషించింది.

స్వర్ణ పతకం గెలిచిన అనంతరం షెఫాలీ మాట్లాడుతూ, దేశ పతాకం గాల్లో రెపరెపలాడటం చూడటమే తమకు అసలైన ప్రేరణ అని తెలిపింది. ఆ క్షణాన్ని ప్రత్యక్షంగా చూడటం ఎంతో గర్వకారణంగా అనిపించిందని సంతోషం వ్యక్తం చేసింది. ప్రస్తుతం జట్టు సభ్యులందరితో కలిసి డిన్నర్ చేయడం ద్వారా సెలబ్రేషన్స్ చేసుకుంటామని, ఇంటికి వెళ్లిన తర్వాత కుటుంబ సభ్యుల సమక్షంలో మరోసారి సంబరాలు ఉంటాయని ఆమె వివరించింది.

ఈ టోర్నీలో క్రీడాకారుల బస ఏర్పాట్లు భిన్నంగా సాగాయి. నిర్వాహకులు ప్రత్యేకంగా గేమ్స్ విలేజ్ ఏర్పాటు చేయకుండా కంటైనర్ తరహా నివాసాలు, క్రూయిజ్ షిప్‌లు, హోటళ్లలో వసతి కల్పించారు. భారత మహిళల జట్టు ఒక హోటల్‌లో బస చేయడంతో ఇతర క్రీడల అథ్లెట్లను నేరుగా కలిసే అవకాశం దక్కలేదని, అయినప్పటికీ ప్రతి ఒక్కరికీ తన తరపున శుభాకాంక్షలు తెలుపుతున్నానని షెఫాలీ పేర్కొంది.

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.