Sharmila Dhankad Journey: కట్నం కోసం వేధింపులు.. కుమార్తెలు పుట్టారని చిత్రహింసలు.. కట్ చేస్తే కామన్వెల్త్ గోల్డ్ విన్నర్!

Sharmila Dhankad's Inspiring Journey. భారత పారా అథ్లెట్ 'షర్మిలా ధన్‌ఖడ్‌' జీవిత కథ ఇప్పుడు దేశవ్యాప్తంగా స్ఫూర్తిదాయకంగా మారింది.

Rishvik
Published on: 28 July 2026 7:41 PM IST
Sharmila Dhankad Journey
X

Sharmila Dhankad Journey: కట్నం కోసం వేధింపులు.. కుమార్తెలు పుట్టారని చిత్రహింసలు.. కట్ చేస్తే కామన్వెల్త్ గోల్డ్ విన్నర్!

Sharmila Dhankad Journey: భారత పారా అథ్లెట్ 'షర్మిలా ధన్‌ఖడ్‌' జీవిత కథ ఇప్పుడు దేశవ్యాప్తంగా స్ఫూర్తిదాయకంగా మారింది. వ్యక్తిగత జీవితంలో ఎన్నో కష్టాలు, అవమానాలు, చిత్రహింసలను ఎదుర్కొన్న ఆమె.. ఇప్పుడు గ్లాస్గో 2026 కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకం సాధించి చరిత్ర సృష్టించింది. సోమవారం జరిగిన మహిళల ఎఫ్57 సీటెడ్ షాట్‌పుట్ విభాగంలో 9.81 మీటర్ల సీజన్ బెస్ట్ త్రోతో శర్మిలా స్వర్ణం కైవసం చేసుకుంది. కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలో పారా అథ్లెటిక్స్‌లో భారత్‌కు తొలి స్వర్ణ పతకం అందించిన అథ్లెట్‌గా ఆమె రికార్డుల్లో నిలిచింది. అలాగే 20 ఏళ్ల తర్వాత కామన్వెల్త్‌లో పారా అథ్లెటిక్స్‌లో భారత్‌కు గోల్డ్ అందించి మరో అరుదైన ఘనతను కూడా సాధించింది. ఈ విజయంతో భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరగా.. మొత్తం పతకాల సంఖ్య ఎనిమిదికి చేరుకుంది.

హర్యానాలోని మహేంద్రగఢ్‌ జిల్లా చిత్రౌలి గ్రామంలో జన్మించిన షర్మిలా ధన్‌ఖడ్‌కు రెండేళ్ల వయసులో పోలియో కారణంగా ఒక కాలు దెబ్బతింది. తండ్రి ఓ సన్నకారు రైతు కాగా.. తల్లికి దృష్టి లోపం. నలుగురు సంతానంలో షర్మిల రెండో బిడ్డ. చిన్నప్పటి నుంచే ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న ఆమె.. పదో తరగతి అవ్వగానే 18 ఏళ్ల వయసులో వివాహం చేశారు. అయితే ఆమెకు భర్త నుంచి నరకయాతన ఎదురైంది. కట్నం కోసం, ఇద్దరు కుమార్తెలకు జన్మనిచ్చిందనే కారణాలతో శారీరకంగా, మానసికంగా తీవ్ర వేధింపులకు గురైంది. 26 ఏళ్ల వయసులో ఒక రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు తనను కొట్టి ఇంటి నుంచి బయటకు పంపించారని షర్మిలా స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఆ తర్వాత ఇద్దరు కుమార్తెలతో కలిసి తల్లిదండ్రుల ఇంటికి చేరిన ఆమె తీవ్ర నిరాశలో ఆత్మహత్య ఆలోచనలు కూడా చేసింది.

'నా తల్లి అంధురాలు. నా తండ్రి రైతు. మా కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో జీవించింది. జీవితం ఎప్పుడూ అంత ఈజీగా లేదు. కానీ నా తల్లి నా కలలను నెరవేర్చేందుకు ప్రపంచంతో పోరాడింది' అని షర్మిలా ధన్‌ఖడ్‌కు భావోద్వేగంగా చెప్పింది. జీవితంలో ఎదురైన ఆ కష్టాలను అధిగమించి తిరిగి నిలబడటంలో తన తల్లి పాత్ర ఎంతో గొప్పదని ఆమె పేర్కొంది. 28 ఏళ్ల వయసులో అజిత్ సింగ్‌ను రెండోసారి వివాహం చేసుకోవడం శర్మిలా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. పారా అథ్లెటిక్స్ గురించి ఒక పత్రికలో చదివిన అజిత్ సింగ్ ఆమెను క్రీడల్లోకి ప్రోత్సహించారు. కుటుంబం ఆమె కల కోసం ఎంతో త్యాగం చేసింది. 2023లో ఆమె శిక్షణ, పోటీల ఖర్చుల కోసం తమ ఇంటినే అమ్మేశారు.

34 ఏళ్ల వయసులో షర్మిలా ధన్‌ఖడ్‌కు అథ్లెటిక్స్ ప్రారంభించింది. ఎంతో పట్టుదలతో తక్కువ సమయంలోనే భారత అగ్రశ్రేణి ఎఫ్57 షాట్‌పుట్ అథ్లెట్‌గా ఎదిగింది. 2021లో జాతీయ ఛాంపియన్‌గా నిలిచిన ఆమె.. ఇప్పుడు కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణ పతకంతో తన కెరీర్‌లో అత్యున్నత విజయాన్ని అందుకుంది. తన విజయంపై షర్మిలా స్పందించింది. 'నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. ఆ అనుభూతిని నుంచి బయతిరావడానికి రెండు, మూడు రోజులు పడుతుంది. నా తదుపరి లక్ష్యం ఆసియా క్రీడల్లో కూడా స్వర్ణ పతకం సాధించడమే' అని తెలిపింది. ఎన్నో అవమానాలు, బాధలు ఎదుర్కొన్న ఒక మహిళ.. అసాధారణమైన ఆత్మవిశ్వాసం, కుటుంబం అండతో ప్రపంచ వేదికపై స్వర్ణ పతకం సాధించి కోట్లాది మందికి ఆదర్శంగా నిలిచింది. షర్మిలా జీవితం నిజంగా పోరాటానికి, పట్టుదలకు ప్రతీకగా నిలిచింది.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story