నేను ఏ తప్పు చేయలేదు.. డబ్బుల కోసమే నాపై కేసు పెట్టారు.. ఏడ్చేసిన పంజాబ్ కింగ్స్ స్టార్!

Shashank Singh Breaks Silence on Assault Allegations. తన కుటుంబంపై ఇటీవల నమోదైన కేసుపై పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్ శశాంక్ సింగ్ తొలిసారి స్పందించాడు.

Rishvik
Published on: 12 July 2026 5:38 PM IST
Shashank Singh
X

నేను ఏ తప్పు చేయలేదు.. డబ్బుల కోసమే నాపై కేసు పెట్టారు.. ఏడ్చేసిన పంజాబ్ కింగ్స్ స్టార్!

Shashank Singh Calls FIR an Extortion Attempt: తన కుటుంబంపై ఇటీవల నమోదైన కేసుపై పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) స్టార్ క్రికెటర్ శశాంక్ సింగ్ తొలిసారి స్పందించాడు. తనతో పాటు తన తండ్రి, రిటైర్డ్ స్పెషల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శైలేష్ సింగ్‌పై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లో అన్ని తప్పుడు ఆరోపణలే అని పేర్కొన్నాడు. పబ్లిక్ ఫిగర్‌గా తన ప్రతిష్ఠను దెబ్బతీసి డబ్బులు వసూలు చేయాలనే ఉద్దేశంతోనే ఈ కేసు పెట్టారని వెల్లడించాడు. నిజం తెలియకుండానే వేల మంది తనను తిట్టారని, ఒకరిని వేలెత్తి చూపేముందు అసలు నిజం తెలుసుకోవాలని శశాంక్ సింగ్ సోషల్ మీడియా వేదికగా భావోద్వేగం చెందాడు.

గత నెలలో భోపాల్‌లోని రతీబాద్ పోలీసులు శశాంక్ సింగ్, అతడి తండ్రిపై కేసు నమోదు చేశారు. శశాంక్ ఇంట్లో వంటమనిషిగా పనిచేసిన విపేంద్ర సింగ్ తోమర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. నెలకు రూ.15000 జీతం, ఉచిత భోజనం, వసతి ఒప్పందంతో శశాంక్ ఇంట్లో పనికి కుదిరానని ఫిర్యాదులో అతడు వెల్లడించాడు. శశాంక్, అతడి తండ్రి తనపై దాడి చేసి, దుర్భాషలాడడంతో పాటు మొబైల్ ఫోన్‌ను బలవంతంగా తీసుకున్నారని ఆరోపించాడు. ఇంట్లో బంధించి వేధించారని విపేంద్ర భోపాల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు శశాంక్ సింగ్‌పై క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారం తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ ఆరోపణలను శశాంక్ పూర్తిగా ఖండించాడు. తనను ఓ నిరుపేద వ్యక్తిపై దాడి చేసిన వ్యక్తిగా చిత్రీకరించారని ఆవేదన వ్యక్తం చేశాడు.

'ఈ ఘటన నన్ను పూర్తిగా మార్చేసింది. నేను సానుభూతి కోసం ఇదంతా చెప్పడం లేదు. నా కుటుంబం మొదటిసారి ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంది. ఒక అథ్లెట్‌గా ఎన్నో ఏళ్లుగా విమర్శలు, ట్రోలింగ్, దూషణలు ఎదుర్కొన్నాను. కానీ ఇది పూర్తిగా భిన్నమైనది. ఒక్క రాత్రిలోనే నన్ను చెడు వ్యక్తిగా మార్చేశారు. ఓ నిరుపేద వ్యక్తిని కొట్టినవాడిగా చిత్రీకరించారు. నిజం ఏమిటో తెలియకుండానే వేల మంది నన్ను దూషించారు. సదరు వ్యక్తి మా ఇంటి నుంచి వెళ్లేటప్పుడు పూర్తిగా క్షేమంగానే ఉన్నాడు. ఆ తర్వాత వీడియోలో అతడిని గాయాలతో చూసి మేము షాక్‌కు గురయ్యాము. అతడు తనంతట తానే పనికోసం మా ఇంటికి వచ్చాడు. ఇంట్లో అనుమానాస్పదంగా తిరుగుతూ ఫొటోలు తీసి ఇతరులకు పంపుతున్నట్లు గుర్తించి మూడో రోజే పంపించేశాము' అని శశాంక్ సింగ్ వివరించాడు.

'మేము పోలీసులకు అసలు విషయం చెప్పాం. పోలీసు రికార్డులను పరిశీలించగా సదరు వ్యక్తిపై ఇప్పటికే తొమ్మిది ఎఫ్‌ఐఆర్‌లు నమోదైనట్లు తెలిసింది. హత్యాయత్నం, ఇంట్లో దొంగతనం, దాడి, అక్రమ ప్రవేశం, బెదిరింపులు, గాయపరిచి డబ్బులు వసూలు చేయడం సహా పలు కేసుల్లో అతడిపై ఆరోపణలు ఉన్నాయి. అసలు గుర్తింపును దాచేందుకు అతడు మూడు వేర్వేరు పేర్లను ఉపయోగించాడు. సదరు వ్యక్తి నిజాయతీతో మా ఇంట్లోకి పని చేయడానికి రాలేదు. తప్పుడు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, పబ్లిక్ ఫిగర్‌గా నా ప్రతిష్ఠను కాపాడుకోవడానికి నేను డబ్బులు చెల్లిస్తానని భావించాడు. అందుకే నాపై ఒత్తిడి తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. డబ్బులు వసూలు చేసేందుకు ఈ ఎఫ్‌ఐఆర్ మా కుటుంబంపై నమోదు చేశాడు’ అని శశాంక్ సింగ్ పేర్కొన్నాడు.

తమ వాదన వినకుండా, కనీసం ప్రశ్నించకుండా కేసు నమోదు చేయడం తనను తీవ్రంగా కలచివేసిందని శశాంక్ చెప్పాడు. తమ కుటుంబంపై ఎలాంటి ప్రాథమిక విచారణ లేకుండానే కేసు నమోదు కావడం ఏంటి? అని అసంతృప్తి వ్యక్తం చేశాడు. 2026 ఏప్రిల్ 30న కూడా తాను ఇలాంటి ఘటనకు పాల్పడినట్లు వచ్చిన వార్తలను శశాంక్ ఖండించాడు. ఆ రోజున తాను ఐపీఎల్ మ్యాచ్ ఆడుతున్నానని, కనీసం విచారణ చేసినా ఆ ప్రచారం నిజం కాదని తెలిసేదని పేర్కొన్నాడు. వదంతులను వాస్తవాలుగా చూపించడం, ధ్రువీకరణ లేకుండా వార్తలు ప్రచారం చేయడం వల్ల ఒక వ్యక్తి ప్రతిష్ఠ ఎంత దెబ్బతింటుందో ఈ ఘటన తనకు తెలియజేసిందని శశాంక్ భావోద్వేగం చెందాడు.

ఈ ఘటన తనకు ఎన్నో కఠినమైన పాఠాలు నేర్పిందని పీబీకేఎస్ స్టార్ క్రికెటర్ శశాంక్ సింగ్ చెప్పాడు. ఇంట్లో పనిచేసే వారిని నియమించుకునే ముందు తప్పనిసరిగా పోలీసు వెరిఫికేషన్, పూర్తి బ్యాక్‌గ్రౌండ్ చెక్ చేయించాలని సూచించాడు. 'ఎవరైనా నిస్సహాయంగా కనిపించినంత మాత్రాన, ఏడుస్తున్నంత మాత్రాన లేదా సానుభూతి కోరినంత మాత్రాన వారు చెప్పేది నిజమని భావించకూడదు. నిజం బయటకు రావడానికి సమయం పడుతుంది. కానీ చివరకు నిజమే గెలుస్తుంది' అని శశాంక్ సోషల్ మీడియాలో చేసిన పోస్టులో పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అయింది.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story