Shashank Singh: ఆ రెండు క్యాచ్‌లు వదిలాక కృంగిపోయా.. 1000 క్యాచ్‌లు పట్టినా హ్యాపీగా లేను.. పంజాబ్ కింగ్స్ స్టార్ ఎమోషనల్!
Shashank Singh on IPL 2026. తన ఫీల్డింగ్‌పై వచ్చిన విమర్శలపై శశాంక్ సింగ్ భావోద్వేగం చెందాడు. ఐపీఎల్‌లో కొన్ని క్యాచ్‌లు వదిలేయడం తనను మానసికంగా ప్రభావితం చేసిందన్నాడు.
Shashank Singh: ఆ రెండు క్యాచ్‌లు వదిలాక కృంగిపోయా.. 1000 క్యాచ్‌లు పట్టినా హ్యాపీగా లేను.. పంజాబ్ కింగ్స్ స్టార్ ఎమోషనల్!
Shashank Singh: 2026 ఐపీఎల్ సీజన్ పంజాబ్ కింగ్స్‌కు తీవ్ర నిరాశను మిగిల్చింది. 2025లో 11 ఏళ్ల తర్వాత ప్లేఆఫ్స్‌కు చేరి రన్నరప్‌గా నిలిచిన పీబీకేఎస్.. 2026 సీజన్‌లో టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలో తొలి ఏడు మ్యాచ్‌ల్లో ఆరు విజయాలు సాధించి అద్భుత ఆరంభం చేసింది.
అయితే ఆ తర్వాత అనూహ్యంగా వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో ఓడిపోయి ప్లేఆఫ్స్‌కు దూరమైంది. ఈ అనూహ్య పతనంపై జట్టు ఆటగాళ్లు, మేనేజ్‌మెంట్‌పై తీవ్ర చర్చ జరిగింది. డ్రెస్సింగ్ రూమ్‌లో విభేదాలు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో ప్రచారం కూడా సాగింది. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్టార్ బ్యాటర్ శశాంక్ సింగ్ స్పష్టం చేశాడు. జట్టు సభ్యుల మధ్య ఎలాంటి విభేదాలు లేవని, మైదానం బయట తమ వాతావరణం సాధారణంగానే ఉందని చెప్పాడు.
వరుసగా ఆరు విజయాల తర్వాత ఆరు ఓటములు రావడం తమను కూడా ఆశ్చర్యానికి గురిచేసిందని శశాంక్ సింగ్ తెలిపాడు. 'వరుస విజయాల తర్వాత ఓటములు రావడం మమల్ని ఆశ్చర్యానికి గురిచేసింది. ఎక్కడ తప్పు జరుగుతుందో అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాము. అయితే ఐపీఎల్ వంటి టోర్నీలో తప్పులను వెంటనే సరిదిద్దడం అంత సులభం కాదు. కీలక క్యాచ్‌లు వదిలేయడం, ముఖ్యమైన ఓవర్లలో మెరుగ్గా బౌలింగ్ చేయలేకపోవడం, అవసరమైన సమయంలో భాగస్వామ్యాలను కొనసాగించలేకపోవడం వంటి చిన్న చిన్న అంశాలు మాకు విజయాలను దూరం చేశాయి. అందరికంటే ముందే మేమే ప్లేఆఫ్స్‌కు చేరుతాం అనుకున్నాం. కానీ అలా జరగలేదు' అని శశాంక్ నిరాశ వ్యక్తం చేశాడు.
డ్రెస్సింగ్ రూమ్ విభేదాలు అంటూ సోషల్ మీడియాలో వచ్చిన ప్రచారంపై స్పందిస్తూ.. అవి తమపై కనీస ప్రభావం చూపలేదని శశాంక్ స్పష్టం చేశాడు. 'వరుస ఓటములు ఎదురైనా శ్రేయస్ అయ్యర్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చహల్, రికీ పాంటింగ్ వంటి సీనియర్లు సానుకూల దృక్పథంతోనే వ్యవహరించారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని మేము పట్టించుకోలేదు. జట్టు సభ్యుల మధ్య కూడా దాని గురించి చర్చించలేదు.
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌలర్లు భారీగా పరుగులు ఇచ్చిన సమయంలో కెప్టెన్ శ్రేయస్ నాకు బంతిని ఇచ్చాడు. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ బ్యాటింగ్‌తో చెలరేగుతున్న సమయంలో నాకు అవకాశం వస్తే పరిస్థితిని మార్చగలననే నమ్మకంతో ఉన్నా. ప్రాక్టీస్ సమయంలో ఇలాంటి పరిస్థితులను ఎన్నోసార్లు ఊహించుకుని సిద్ధమయ్యా. అందుకే అవకాశం వచ్చిన వెంటనే ఆత్మవిశ్వాసంతో బౌలింగ్ చేశా' అని తెలిపాడు.
తన ఫీల్డింగ్‌పై వచ్చిన విమర్శలపై శశాంక్ సింగ్ భావోద్వేగం చెందాడు. 'ఐపీఎల్‌లో కొన్ని క్యాచ్‌లు వదిలేయడం నన్ను మానసికంగా ప్రభావితం చేసింది. నేను మంచి ఫీల్డర్‌నే. కెరీర్‌లో ఎన్నో మంచి క్యాచ్‌లు పట్టాను. కానీ ఆ రెండు క్యాచ్‌లు వదిలిన తర్వాత ఫీల్డింగ్‌ను ఆస్వాదించడం మానేశాను. రోజుకు 500 నుంచి 1000 క్యాచ్‌లు ప్రాక్టీస్ చేసినప్పటికీ సంతోషంగా లేను. నా కోచ్‌లు, చిన్ననాటి స్నేహితులతో మాట్లాడినప్పుడు ఫీల్డింగ్‌ను ఆస్వాదించడం లేదనే విషయాన్ని వారు గుర్తించారు. ప్రతి మ్యాచ్‌లో సెంచరీ చేయడం లేదా ఇకపై ఎప్పుడూ క్యాచ్ వదలకపోవడం నా చేతుల్లో ఉండకపోవచ్చు. అయితే బ్యాటింగ్, బౌలింగ్‌ను ఎలా ఆస్వాదిస్తానో ఫీల్డింగ్‌ను కూడా అలాగే ఆస్వాదించాల్సిన అవసరం ఉంది' పేర్కొన్నాడు.
'నేనూ ఒక మనిషినే. తప్పులు జరగొచ్చు. అది నాకు ఒక లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్' అంటూ శశాంక్ సింగ్ తన అనుభవాన్ని వివరించాడు. భవిష్యత్తులో ఫీల్డింగ్‌ను మరింత ఆనందిస్తూ ఆడాలని భావిస్తున్నట్లు తెలిపాడు. దేశవాళీ క్రికెట్‌లో ఛత్తీస్‌గఢ్ నుంచి పుదుచ్చేరికి మారడంపైశశాంక్ స్పందించాడు. ప్రస్తుతానికి వైట్ బాల్ క్రికెట్‌పై పూర్తిగా దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నట్లు చెప్పాడు. మూడు ఫార్మాట్లలో ఆడటం ఆల్‌రౌండర్‌గా కొంత భారంగా మారుతుందని.
ఈ సీజన్‌లో వన్డేల్లో 10 ఓవర్లు బౌలింగ్ చేయడంతో పాటు సెంచరీ చేయగలిగే వైట్ బాల్ ఆల్‌రౌండర్‌గా ఎదగాలనుకుంటున్నట్లు తెలిపాడు. తన రాష్ట్ర జట్టు నుంచి ఆశించినంత మద్దతు లభించడం లేదనే భావన తనలో ఏర్పడిందని శశాంక్ చెప్పాడు. అయితే దానిపై వివాదం చేయడం కంటే.. ముందుకు వెళ్లడమే మంచిదని భావించానని వివరించాడు. క్రికెటర్ కెరీర్ చాలా చిన్నదని, తన లక్ష్యాలకు అనుగుణంగా వైట్ బాల్ క్రికెట్‌పై దృష్టి పెట్టేందుకు అవకాశం లభించడంతో పుదుచ్చేరికి మారినట్లు వెల్లడించాడు.




