Team India: ఐర్లాండ్ నుంచి ఇంగ్లండ్ వరకు నిరాశే.. టీమిండియా చరిత్రలోనే అవమానకరమైన ఓటములు!

Team India: Shashi Tharoor criticized Team India after the T20I series loss to England. కాంగ్రెస్ సీనియర్ ఎంపీ శశి థరూర్ భారత జట్టు ప్రదర్శనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Rishvik
Published on: 10 July 2026 8:57 PM IST
Team India
X

Team India: ఐర్లాండ్ నుంచి ఇంగ్లండ్ వరకు నిరాశే.. టీమిండియా చరిత్రలోనే అవమానకరమైన ఓటములు!

Team India: ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో భారత జట్టు వరుస పరాజయాలను ఎదుర్కొంటూ తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. అంతకుముందు పసికూన ఐర్లాండ్ చేతిలో పొట్టి సిరీస్‌ను 2-0తో కోల్పోయిన టీమిండియా.. ఇప్పుడు ఇంగ్లండ్‌తో కూడా సిరీస్‌ను చేజార్చుకోవడంతో అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు, రాజకీయ ప్రముఖులు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ ఎంపీ, క్రికెట్ అభిమాని శశి థరూర్ భారత జట్టు ప్రదర్శనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాజాగా బ్రిస్టల్‌లో జరిగిన నాలుగో టీ20లో భారత్ 9 వికెట్ల తేడాతో ఘోర పరాజయం పాలైంది. దాంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే శ్రేయాస్ సేన సిరీస్‌ను కోల్పోయింది. ఈ దారుణ ఓటమి అనంతరం ఎంపీ శశి థరూర్ సోషల్ మీడియాలో స్పందించారు. 'నిజంగా నాకు మాటలు రావడం లేదు. భారీ షాక్‌కు గురయ్యాను. ఇది మరో అవమానకరమైన ఓటమి. ఇంకా చెప్పడానికి ఏమీ లేదు' అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన పోస్టులో బీసీసీఐ, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌లను ట్యాగ్ చేయడం మరింత చర్చనీయాంశమైంది.

టీ20 ప్రపంచకప్ 2026 విన్నింగ్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను తప్పించి స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌కు సారథ్య బాధ్యతలను బీసీసీఐ సెలెక్టర్లు అప్పగించారు. శ్రేయాస్ సారథ్యంలో భారత జట్టు ఆశించిన ఫలితాలు అందుకోలేదు. రెండున్నరేళ్ల తర్వాత టీ20 జట్టులోకి తిరిగి వచ్చిన శ్రేయస్.. వ్యక్తిగతంగా బ్యాటింగ్‌లో మంచి ప్రదర్శనలు చేస్తున్నప్పటికీ జట్టుకు మాత్రం విజయాలను అందించలేకపోతున్నాడు. శ్రేయస్ కెప్టెన్సీలో భారత్ ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడగా.. ఐదు ఓడిపోయి, ఒక మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం లేకుండా ముగిసింది.

శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో భారత్ తొలుత ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో 2-0తో వైట్‌వాష్‌కు గురైంది. ఇది టీమిండియా చరిత్రలోనే ఘోర అవమానకర ఓటములుగా మిగిలాయి. పసికూన ఐర్లాండ్ పటిష్ట భారత జట్టుపై విజయం సాధించడం ఇదే మొదటిసారి. ఆ తర్వాత ఇంగ్లండ్ పర్యటనలోనూ పరిస్థితి మారలేదు. తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దవ్వగా.. మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ వరుస విజయాలు సాధించి సిరీస్‌ను కైవసం చేసుకుంది. భారత్ అన్ని విభాగాల్లో విఫలమైంది. దీంతో భారత జట్టు ప్రదర్శనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

నాలుగో టీ20లో భారత్ తొలుత బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 158/7 స్కోరు చేసింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అజేయంగా 80 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేశాడు. మిగతా బ్యాటర్లు విఫలమవడంతో భారీ స్కోర్ చేయలేకపోయింది. యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ 15 పరుగులు మాత్రమే చేసి మరోసారి నిరాశపరిచాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్ చెరో రెండు వికెట్లు తీసి భారత్‌ను కట్టడి చేశారు. 159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ కేవలం 13.5 ఓవర్లలోనే ఒక వికెట్ మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. కెప్టెన్ హ్యారీ బ్రూక్ (79 నాటౌట్), ఫిల్ సాల్ట్ (59 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఇద్దరు భారత బౌలింగ్‌ను చీల్చిచెండాడారు. ఈ విజయంతో ఇంగ్లండ్ సిరీస్‌లో 3-0 ఆధిక్యం సాధించింది. చివరి మ్యాచ్‌లో క్లీన్‌స్వీప్ లక్ష్యంగా ముందుకు సాగుతోంది. చివరి టీ20లో నైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని భారత్ చూస్తోంది.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story