Shoaib Akhtar: షోయబ్ అక్తర్ కుటుంబంలో తీవ్ర విషాదం!
Shoaib Akhtar: Shoaib Akhtar Brother Dead. పాకిస్థాన్ క్రికెట్ దిగ్గజం షోయబ్ అక్తర్ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
Shoaib Akhtar: షోయబ్ అక్తర్ కుటుంబంలో తీవ్ర విషాదం!
Shoaib Akhtar: పాకిస్థాన్ క్రికెట్ దిగ్గజం, మాజీ పేసర్ షోయబ్ అక్తర్ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అక్తర్ పెద్ద అన్నయ్య షాహిద్ అక్తర్ కన్నుమూశారు. ఈ విషయాన్ని స్వయంగా షోయబ్ అక్తర్ తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా వెల్లడించారు. షాహిద్ అక్తర్ మృతి పట్ల అభిమానులు, మాజీ క్రికెటర్లు, పాకిస్థాన్ క్రికెట్ వర్గాలు సంతాపం వ్యక్తం చేస్తున్నాయి. అయితే షాహిద్ అక్తర్ మరణానికి గల కారణాలను కుటుంబ సభ్యులు వెల్లడించలేదు.
పోస్ట్ చేసిన షోయబ్ అక్తర్ భావోద్వేగానికి లోనయ్యాడు. 'నా ప్రియమైన అన్న షాహిద్ అక్తర్ అల్లాహ్ వద్దకు వెళ్లిపోయారు. ఈ విషయాన్ని ఎంతో బాధతో తెలియజేస్తున్నాను. అంత్యక్రియల సమయం, స్థలం వివరాలను ఉదయం తెలియజేస్తాం' అని పేర్కొన్నాడు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. అభిమానులు అక్తర్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మాజీ పాకిస్థాన్ కెప్టెన్ రషీద్ లతీఫ్ కూడా ఈ విషాద వార్తను ధృవీకరించారు. ఆయన సోషల్ మీడియాలో స్పందిస్తూ.. 'మనం అల్లాహ్‌కు చెందిన వారమే, చివరికి ఆయన వద్దకే తిరిగి వెళ్తాం. షోయబ్ అక్తర్ సోదరుడు షాహిద్ అక్తర్ మరణించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాం' అని పేర్కొన్నారు.
ఇది షోయబ్ అక్తర్ కుటుంబంలో రెండో పెద్ద విషాదం. సుమారు ఐదేళ్ల క్రితం ఆయన తల్లి మరణించగా.. ఇప్పుడు అన్నను కూడా కోల్పోవడంతో అక్తర్ తీవ్ర మనోవేదనకు గురవుతున్నాడు. కుటుంబానికి ఎంతో అండగా నిలిచిన వ్యక్తిని కోల్పోవడం ఆయనకు తీరని లోటుగా మారింది. క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత కూడా అక్తర్ ఆటకు దూరం కాలేదు. ప్రముఖ క్రికెట్ విశ్లేషకుడిగా, కామెంటేటర్‌గా, టీవీ చర్చల్లో పాల్గొంటూ అభిమానులకు చేరువగా ఉంటున్నాడు. ముఖ్యంగా పాకిస్థాన్ క్రికెట్ జట్టు ప్రదర్శన, పరిపాలనా వ్యవహారాలపై ఆయన తరచూ తన అభిప్రాయాలను వెల్లడిస్తూ ఉంటాడు.
1990ల చివరి దశ, 2000ల ప్రారంభంలో పాకిస్థాన్ క్రికెట్‌ను ప్రపంచ స్థాయిలో నిలబెట్టిన ఫాస్ట్ బౌలర్లలో షోయబ్ అక్తర్ ఒకడు. 'రావల్పిండి ఎక్స్‌ప్రెస్'గా పేరుగాంచిన ఆయన.. తన ఫాస్టెస్ట్ బౌలింగ్‌తో ప్రపంచ క్రికెట్‌లో ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు. ప్రస్తుతం ఆయన కుటుంబంలో చోటుచేసుకున్న ఈ విషాదం క్రికెట్ ప్రపంచాన్ని కూడా కలచివేసింది. అక్తర్ పాక్ తరఫున 46 టెస్టులు, 163 వన్డేలు, 15 టీ20లు ఆడాడు. మూడు ఫార్మాట్లలో కలిసి 450కి పైగా వికెట్స్ పడగొట్టాడు.




