IND vs ENG 4th T20I : కేవలం 48 పరుగులకే 3 వికెట్లు ఔట్.. షార్ట్ పిచ్ బంతుల వలలో చిక్కుకున్న భారత బ్యాటర్లు
IND vs ENG 4th T20I : ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో భారత బ్యాటర్ల పాత బలహీనత మరోసారి బయటపడింది. షార్ట్ పిచ్ బంతులు, ఎక్స్‌ట్రా బౌన్స్‌ను ఎదుర్కోలేక టాప్ ఆర్డర్ కుప్పకూలింది.
IND vs ENG 4th T20I
IND vs ENG 4th T20I : బ్రిస్టల్‌లోని కౌంటీ గ్రౌండ్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో భారత బ్యాటింగ్ పాత రంగు మరోసారి బయటపడింది. విదేశీ పిచ్‌లపై షార్ట్ పిచ్ బంతులు, ఎక్స్‌ట్రా బౌన్స్‌ను ఎదుర్కోవడంలో టీమిండియా బ్యాటర్లు పదే పదే తడబడుతున్నారు. ఇంగ్లాండ్ బౌలర్లు భారత బ్యాటర్లకున్న ఈ సాంకేతిక లోపాన్ని సరిగ్గా వాడుకుని వికెట్లు పడగొట్టారు. దీంతో భారత టాప్ ఆర్డర్ బ్యాటింగ్ లైన్ పేకమేడలా కూలిపోయింది. కేవలం 48 పరుగులకే భారత్ తన కీలకమైన టాప్-3 వికెట్లను కోల్పోయింది. సిరీస్ మొత్తం హెచ్చరికలు వస్తున్నప్పటికీ స్టార్ బ్యాటర్లు తమ తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోకపోవడంపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
ఈ మ్యాచ్ విశ్లేషణ సందర్భంగా భారత మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ దినేష్ కార్తీక్ ఒక కీలకమైన విషయాన్ని చెప్పారు. ఇంగ్లాండ్ పిచ్‌లపై లభించే స్పాంజీ బౌన్స్‌ను అంచనా వేయడంలో భారత బ్యాటర్లు పూర్తిగా విఫలమవుతున్నారని ఆయన అన్నారు. అత్యంత విచారకరమైన విషయం ఏమిటంటే.. అవుట్ అయిన టాప్ ఆర్డర్ బ్యాటర్లు ముగ్గురూ కూడా ఒకే రకమైన తప్పు చేసి వికెట్లు పారేసుకున్నారు. పిచ్‌పై బంతి ఎంత ఎత్తు వస్తుందో ఊహించకుండా అడ్డదిడ్డంగా పుల్ షాట్లు, అక్రాస్ ద లైన్ షాట్లు ఆడబోయి ఆతిథ్య జట్టుకు వికెట్లను బహుమతిగా ఇచ్చి పెవిలియన్ చేరారు. చివరకు స్పిన్నర్ వేసిన షార్ట్ బాల్‌ను కూడా సరిగ్గా ఆడలేకపోయారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
భారత ఇన్నింగ్స్ మూడో ఓవర్లోనే ఇంగ్లాండ్ స్పీడ్ స్టర్ జోఫ్రా ఆర్చర్ తన వేగంతో, షార్ట్ లెంగ్త్ బౌన్సర్‌తో యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీని పడగొట్టాడు. ఆర్చర్ వేసిన బంతి ఆఫ్ స్టంప్ వెలుపల పడి ఊహించని వేగంతో పైకి లేచింది. అక్కడ షాట్ ఆడటానికి తగినంత స్థలం లేకపోయినప్పటికీ వైభవ్ బలవంతంగా బ్యాట్ తిప్పాడు. దాంతో బంతి బ్యాట్ పైభాగానికి తగిలి గాల్లోకి లేచింది. 30 గజాల వలయం లోపలే మిడ్-ఆన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సామ్ కరన్ ఎలాంటి తప్పు చేయకుండా సులువుగా క్యాచ్ అందుకున్నాడు. ఈ సిరీస్‌లో వైభవ్ ఒకే బౌలర్‌కు ఒకే రీతిలో అవుట్ కావడం విశేషం.
ఐదో ఓవర్లో మరో పేసర్ జోష్ టంగ్.. వికెట్ కీపర్ బ్యాటర్ ఈషాన్ కిషన్‌ను తన షార్ట్ లెంగ్త్ అస్త్రంతో దెబ్బతీశాడు. బంతి ఈషాన్ శరీరాన్ని గురిపెడుతూ వేగంగా పైకి వచ్చింది. అయితే ఈషాన్ కిషన్ తన కాళ్లు ఏమాత్రం కదపకుండా, కేవలం చేతుల బలంతో అక్రాస్ ద లైన్ వెళ్లి ఒక భారీ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. కానీ బంతి సరిగ్గా టైమింగ్ అవ్వకపోవడంతో బ్యాట్ అంచుకు తగిలి వెనుక ఉన్న షార్ట్ థర్డ్ మ్యాన్ వైపు గాల్లోకి లేచింది. అక్కడ సిద్ధంగా ఉన్న సామ్ కరన్ మరో ఈజీ క్యాచ్ పట్టుకోవడంతో ఈషాన్ కిషన్ ఇన్నింగ్స్ ముగిసింది.
పేసర్లు షార్ట్ బాల్స్‌తో విరుచుకుపడుతుంటే, ఏడో ఓవర్లో ఇంగ్లాండ్ సీనియర్ లెగ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ మరో ఓపెనర్ అభిషేక్ శర్మను తన మాయాజాలంలో పడేసాడు. రషీద్ వికెట్ల లైన్ పై ఒక హాఫ్ వాలీ లాంటి చిన్న బంతిని వేశాడు. బౌండరీ లైన్ పెద్దదిగా ఉన్నప్పటికీ, అభిషేక్ శర్మ అక్రాస్ ద లైన్ భారీ షాట్ కోసం బ్యాట్ గట్టిగా తిప్పాడు. కానీ ఆ షాట్‌లో కనెక్టివిటీ, పవర్ లేకపోవడంతో బంతి గాల్లోకి లేచి నేరుగా బౌలర్ ఆదిల్ రషీద్ చేతుల్లోకే వెళ్ళింది. రషీద్ ముందుకు పరిగెత్తుకుంటూ వచ్చి ఒక అద్భుతమైన రిటర్న్ క్యాచ్‌ను అందుకున్నాడు. ఇలా ఇంగ్లాండ్ కండిషన్లలో భారత బ్యాటర్ల ఆటతీరు రోజురోజుకూ దిగజారుతోంది. టీమ్ థింక్-ట్యాంక్, కోచ్‌లు బ్యాటర్ల టెక్నిక్, అగ్రెసివ్ మైండ్‌సెట్‌పై వెంటనే దృష్టి పెట్టకపోతే ఈ పర్యటన మరింత ఘోరంగా మారే ప్రమాదం ఉంది.




