T20 World Cup: క్రికెట్‌కే గుడ్‌బై చెప్పాలనుకున్నా.. వరల్డ్ కప్ స్టార్ భావోద్వేగం!

T20 World Cup: యువ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ వికెట్ తీయకున్నా.. అద్భుతంగా బౌలింగ్ చేసింది.

Rishvik
Published on: 15 Jun 2026 5:37 PM IST
T20 World Cup
X

T20 World Cup: క్రికెట్‌కే గుడ్‌బై చెప్పాలనుకున్నా.. వరల్డ్ కప్ స్టార్ భావోద్వేగం!

T20 World Cup: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భారత జట్టు శుభారంభం చేసింది. ఆదివారం బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన గ్రూప్-ఏ పోరులో టీమిండియా 64 పరుగుల తేడాతో గెలిచింది. స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (68), హిట్టర్ రిచా ఘోష్ (34), స్పిన్నర్ దీప్తి శర్మ (5/10) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. యువ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ వికెట్ తీయకున్నా.. అద్భుతంగా బౌలింగ్ చేసింది.

మూడు ఓవర్లు వేసి 17 రన్స్.. పాక్ బ్యాటర్లపై ఒత్తిడి పెంచింది. గాయాల అనంతరం కీలక మ్యాచ్ ఆడిన శ్రేయాంక.. తన జీవితంలో ఎదుర్కొన్న అత్యంత క్లిష్టమైన దశ గురించి భావోద్వేగం చెందింది. ఒక దశలో తీవ్ర నిరాశలోకి వెళ్లి క్రికెట్‌ను పూర్తిగా వదిలేయాలనిపించిందని వెల్లడించింది. అయితే కుటుంబ సభ్యుల అండ, తనపై తాను పెట్టుకున్న నమ్మకమే తిరిగి మైదానంలోకి తీసుకొచ్చిందని తెలిపింది.

14 నెలల పాటు క్రికెట్‌కు దూరం:

శ్రేయాంక పాటిల్ దాదాపు 14 నెలల పాటు గాయాల కారణంగా క్రికెట్‌కు దూరమైంది. 2024 జూలైలో పాకిస్థాన్‌తో జరిగిన ఆసియా కప్ మ్యాచ్‌లో ఆమె చేతి వేళ్లకు ఫ్రాక్చర్ అయింది. ఆ తర్వాత రెండు కాళ్లలో తీవ్రమైన షిన్ సమస్యలు, ఎడమ చేతి బొటనవేలికి గాయం కావడంతో వరుసగా ఇబ్బందులు ఎదుర్కొంది. ఈ గాయాల కారణంగా శ్రేయాంక చాలా కాలం జట్టుకు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఈ ఏడాది ప్రారంభంలో మహిళల ప్రీమియర్ లీగ్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడుతూ తిరిగి పోటీ క్రికెట్‌లోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం టీ20 ప్రపంచకప్‌ 2026లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తోంది.

డిప్రెషన్‌లోకి వెళ్లాను:

గాయాల సమయంలో ఎదుర్కొన్న మానసిక పరిస్థితి గురించి శ్రేయాంక మాట్లాడుతూ.. 'నేను డిప్రెషన్‌లోకి వెళ్లలేదని చెబితే అది అబద్ధమే అవుతుంది. గాయాల సమయంలో ఒక దశలో క్రికెట్‌ను పూర్తిగా వదిలేయాలని కూడా అనిపించింది. కానీ నా మనసులో ఒక మాట ఎప్పుడూ మెదిలేది. నేను ఈ ఆటను ఎంతగానో ప్రేమిస్తాను, క్రికెట్ ఆడటానికే నేను ఇక్కడ ఉన్నాను అని అనుకునేదాన్ని. అందుకే నేను ఓటమిని అంగీకరించలేదు' అని తెలిపింది.

కుటుంబమే బలం:

కష్టకాలంలో తన కుటుంబం ఇచ్చిన మద్దతు ఎంతో కీలకమైందని శ్రేయాంక వెల్లడించింది. 'మా నాన్న ఎప్పుడూ నాతో మాట్లాడేవారు. కుటుంబ సభ్యులంతా నాకు అండగా నిలిచారు. నా చుట్టూ మంచి వ్యక్తులు ఉండటం వల్లనే నేను ధైర్యంగా నిలబడగలిగాను. ఆ మద్దతే నన్ను ముందుకు నడిపించింది' అని చెప్పింది. పవర్‌ప్లేలో బౌలింగ్ చేయడం తనకు ఎప్పటినుంచో ఇష్టమని శ్రేయాంక తెలిపింది.

'ఒత్తిడిలో బౌలింగ్ చేయడం నాకు చాలా ఇష్టం. రాష్ట్ర జట్టు తరఫునైనా, భారత జట్టు తరఫునైనా పవర్‌ప్లేలో బౌలింగ్ చేయడాన్ని ఎంజాయ్ చేస్తాను. బ్యాటర్లకు అనుకూలంగా ఉండే ఆ దశలో పరుగులను కట్టడి చేసి వికెట్ల కోసం ప్రయత్నించడం నాకు సవాల్‌లా అనిపిస్తుంది' అని పేర్కొంది.

ఇంకా అసలు పరీక్ష మిగిలే ఉంది:

పాకిస్థాన్‌పై భారీ విజయం సాధించినప్పటికీ భారత జట్టు ఆత్మసంతృప్తికి లోనుకాకూడదని శ్రేయాంక హెచ్చరించింది. 'ఇది ప్రపంచకప్. ఇక్కడ ఏ జట్టునైనా తక్కువ అంచనా వేయలేం. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా వంటి బలమైన జట్లు ఉన్నాయి. ప్రతి మ్యాచ్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేయాల్సిందే. సరైన రోజున సరైన క్రికెట్ ఆడితేనే విజయాలు సాధించగలం' అని శ్రేయాంక పాటిల్ స్పష్టం చేసింది. గాయాలు, నిరాశ, డిప్రెషన్‌ను జయించి తిరిగి భారత జట్టులో స్థానం సంపాదించిన శ్రేయాంక స్టోరీ ప్రస్తుతం యువ క్రీడాకారులకు స్ఫూర్తిదాయకంగా మారింది.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story