Shreyas Iyer: ఎంఎస్ ధోనీ, రోహిత్‌ శర్మ కంటే.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యరే తోపు!

Irfan Pathan backs Shreyas Iyer: పంజాబ్ కింగ్స్ సారథి శ్రేయస్‌ అయ్యర్‌పై ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసల వర్షం కురిపించాడు.

Rishvik
Published on: 6 May 2026 10:17 PM IST
Shreyas Iyer Better Than Dhoni and Rohit, Irfan Pathan Makes Bold IPL Captaincy Claim
X

Shreyas Iyer: ఎంఎస్ ధోనీ, రోహిత్‌ శర్మ కంటే.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యరే తోపు!

Irfan Pathan backs Shreyas Iyer: పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) సారథి శ్రేయస్‌ అయ్యర్‌పై మాజీ భారత ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసల వర్షం కురిపించాడు. శ్రేయస్‌ సారథ్యం అద్భుతమని పేర్కొన్నాడు. ఐపీఎల్‌లో అత్యుత్తమ కెప్టెన్ల జాబితాలో శ్రేయస్ ముందు వరుసలో ఉంటాడన్నాడు. మరో ఐపీఎల్ టైటిల్ గెలిస్తే.. ఐపీఎల్ చరిత్రలోని గొప్ప కెప్టెన్స్ ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ, గౌతమ్ గంభీర్‌లను కూడా దాటే స్థాయికి చేరాడని అభిప్రాయపడ్డాడు. మూడు వేర్వేరు ఫ్రాంచైజీలను ఐపీఎల్ ఫైనల్‌కు తీసుకెళ్లగలగడం మాములు విషయం కాదని, అందరిలోకెల్లా అయ్యరే తోపు అని ఇర్ఫాన్ పఠాన్ చెప్పుకొచ్చాడు.

ఐపీఎల్ 2026 సందర్భంగా జియో హాట్‌స్టార్‌తో ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ... 'శ్రేయస్ అయ్యర్ మూడు ఫ్రాంచైజీలను ఫైనల్‌కు తీసుకెళ్లాడు. ఇది ఐపీఎల్ చరిత్రలో అరుదైన ఘనత. అందులోనూ కేకేఆర్‌కు టైటిల్ అందించాడు. పంజాబ్‌ కింగ్స్ కోసం ఇంకొక ట్రోఫీ గెలిస్తే.. ఐపీఎల్ చరిత్రలోని గొప్ప కెప్టెన్లను అందరినీ అధిగమిస్తాడు. ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ, గౌతమ్ గంభీర్‌ల కంటే శ్రేయస్ అత్యుత్తమ కెప్టెన్‌లలో ఒకరిగా నిలుస్తాడని నేను భావిస్తున్నాను. మూడు వేర్వేరు ఫ్రాంచైజీలను ఫైనల్స్‌కు తీసుకెళ్లడం అంత సులభం కాదు. ప్రతి ఫ్రాంచైజీ భిన్నంగా ఉంటుంది. సంస్కృతి, వ్యవస్థ, ఆలోచనా విధానం పూర్తిగా వేరుగా ఉంటాయి. అన్నింటినీ సర్దుకుపోయి, జట్టును ముందుకు నడిపించడం అంత తేలిక కాదు. ఇప్పటివరకు ఎవరూ అలా చేయలేదు' అని చెప్పాడు.

దిగ్గజ కెప్టెన్‌ల విజయాలతో శ్రేయస్ అయ్యర్ ప్రయాణాన్ని పోలుస్తూ.. ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ, గౌతమ్ గంభీర్‌లు ఒకే జట్టుకు ట్రోఫీలు అందించారని ఇర్ఫాన్ పఠాన్ పేర్కొన్నారు. 'ధోనీ ఐదు టైటిళ్లను చెన్నై సూపర్ కింగ్స్‌కు అందించాడు. రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్‌కు ఐదు టైటిళ్లు అందించాడు. అలాగే గౌతమ్ గంభీర్ కోల్‌కతా నైట్ రైడర్స్‌కు రెండు టైటిళ్లు అందించాడు. కానీ శ్రేయస్ అయ్యర్ ఏకంగా మూడు ఫ్రాంచైజీలను ఫైనల్‌కు తీసుకెళ్లాడు. అన్ని పరిస్థితుల్లో విజయవంతంగా జట్టును నడిపించడం అయ్యర్ సామర్థ్యాన్ని చూపిస్తోంది' అని ఇర్ఫాన్ ప్రశంసలు కురిపించాడు.

శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో పంజాబ్ కింగ్స్ మంచి ప్రదర్శన కనబరుస్తోంది. ఐపీఎల్ 2025లో ఫైనల్‌కు చేరుకున్న పంజాబ్.. ఆర్సీబీ చేతిలో ఓడిపోయినా మంచి పోటీ ఇచ్చింది. ప్రస్తుతం ఐపీఎల్ 2026లో కూడా పంజాబ్ అద్భుత ఫామ్‌లో ఉండి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈసారి కూడా ఫైనల్ చేరడం పక్కా అనే చెప్పాలి. మరో టైటిల్ గెలిస్తే శ్రేయస్ పేరు ఐపీఎల్ చరిత్రలో అత్యుత్తమ కెప్టెన్లలో అగ్రస్థానంలో నిలిచే అవకాశాలు ఉన్నాయి.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story