Shreyas Iyer: ఆ మాటలే నన్ను మార్చేశాయి.. అసలు విషయం చెప్పేసిన సర్పంచ్ సాబ్!

Shreyas Iyer reveals his success story: తన సక్సెస్‌కు అసలు కారణం ఏంటో శ్రేయాస్ అయ్యర్ వెల్లడించాడు. తనపై వచ్చిన విమర్శలే ప్రేరణగా మారాయని సర్పంచ్ సాబ్ వెల్లడించాడు.

Rishvik
Published on: 28 April 2026 2:26 PM IST
Shreyas Iyer
X

Shreyas Iyer

Shreyas Iyer: శ్రేయాస్ అయ్యర్.. భారత జట్టులో నిలకడైన బ్యాటర్లలో ఒకడిగా గుర్తింపు పొందాడు. ఇటీవల తన అద్భుత ఆటతో మరో స్థాయికి చేరుకున్నాడు. ముఖ్యంగా టీ20 ఫార్మాట్‌లో శ్రేయాస్ ప్రదర్శన మరింత మెరుగైంది. ఇప్పుడు కేవలం బ్యాటర్ మాత్రమే కాకుండా.. ఫినిషర్‌గా, నాయకుడిగా కూడా మరో మెట్టుకు ఎదిగాడు. పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా 2025, 2026 సీజన్‌లో జట్టును విజయాల దిశగా నడిపిస్తున్నాడు. తన సక్సెస్‌కు అసలు కారణం ఏంటో శ్రేయాస్ వెల్లడించాడు.

తనపై వచ్చిన విమర్శలే ప్రేరణగా మారాయని, విమర్శలే తన సక్సెస్‌కు కారణం అని శ్రేయాస్ అయ్యర్ వెల్లడించాడు. 'గతంలో నేను విఫలమయ్యాను. ముఖ్యంగా షార్ట్ బాల్స్‌కు ఎక్కువగా అవుట్ అయ్యేవాడిని. నా బలహీనత గురించి వచ్చిన విమర్శలు నన్ను తీవ్రంగా ప్రభావితం చేశాయి. నువ్వు ఈ పరిస్థితిలో జట్టుకు ఆడలేవు, ఇక అసాధ్యం అన్నారు. ఆ మాటలు నాకు అసహనాన్ని కలిగించాయి. అందరి విమర్శలు తప్పు అని నిరూపించాలనే సంకల్పమే నన్ను ముందుకు నడిపించింది' అని సర్పంచ్ సాబ్ చెప్పాడు.

ముంబై ఇండియన్స్‌ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో షార్ట్ బాల్‌ను సిక్స్ కొట్టడం ద్వారా తనపై ఉన్న విమర్శలకు శ్రేయాస్ అయ్యర్ గట్టి సమాధానం ఇచ్చాడు. 'ఇప్పుడు నా జోన్‌లోకి షార్ట్ బాల్ వస్తే వదలడం లేదు. ఆ బంతిని బౌండరీకి పంపడమే నా లక్ష్యం. ఇంజ్యూరి సమయంలో నాపై ఎన్నో అనుమానాలు వ్యక్తమయ్యాయి. నాకు వెన్ను గాయం అయ్యాక నేను మునుపటిలా ఆడలేనని కొందరు అన్నారు. నేను ఎందుకు ఆడలేను అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. ఇక్కడ మైండ్‌సెట్ చాలా ముఖ్యం. నా ఆటను మెరుగుపర్చుకోవడానికి కఠిన సాధన చేశాను. రోజుకు సుమారు 300 బంతులను ఎదుర్కొన్నా. టాప్ బౌలర్ల బంతుల్లో ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తున్నా. అలాగే కోచ్‌లైన ప్రవీణ్ ఆమ్రే, అభిషేక్ నాయర్‌లతో నిరంతరం చర్చలు జరుపుతూ నా ఆటను మెరుగుపర్చుకుంటున్నా' అని అయ్యర్ చెప్పాడు/

ఏబీ డివిలియర్స్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి దిగ్గజాల బ్యాటింగ్ రిథమ్‌ను గమనించి.. అదే తరహాలో నేను ఆడదానికి ప్రయత్నిస్తున్నా అని సర్పంచ్ సాబ్ శ్రేయాస్ అయ్యర్ తెలిపాడు. విమర్శలను ప్రేరణగా మార్చుకుని, కష్టపడి సాధన చేసి, తన బలహీనతలను బలాలుగా మార్చుకున్న శ్రేయాస్ యువ క్రికెటర్లకు గొప్ప స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ దూసుకెళుతోంది. శ్రేయాస్ సారథ్యంలో ఇప్పటివరకు ఆడిన అన్ని మ్యాచులలో గెలిచింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో పంజాబ్ అగ్ర స్థానంలో ఉంది. మిగిలిన ఏడూ మ్యాచులలో మరో రెండు విజయాలు సాధిస్తే ప్లే ఆఫ్స్ చేరుకుంటుంది. ఐపీఎల్ 2025లో శ్రేయాస్ సారథ్యంలో పంజాబ్ ఫైనల్ ఆడిన విషయం తెలిసిందే.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story