Shreyas Iyer: సర్పంచ్‌ సాబ్ అర్థమేంటో తెలియదు.. కానీ నాకు బాగా నచ్చేసింది!

Shreyas Iyer: పంజాబ్ కింగ్స్ సహచర ఆటగాళ్లు శ్రేయస్ అయ్యర్‌ను ప్రేమగా ‘సర్పంచ్ సాబ్’ అని పిలుచుకుంటున్నారు.

Rishvik
Published on: 18 April 2026 8:34 PM IST
Shreyas Iyer
X

Shreyas Iyer: సర్పంచ్‌ సాబ్ అర్థమేంటో తెలియదు.. కానీ నాకు బాగా నచ్చేసింది!

Shreyas Iyer: పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ప్రస్తుతం ఐపీఎల్‌ 2026లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. కెప్టెన్సీ, బ్యాటింగ్, ఫీల్డింగ్‌లలో అదరగొడుతున్నాడు. కెప్టెన్‌గా పీబీకేఎస్ జట్టుకు వరుస విజయాలు అందిస్తున్నాడు. ఇప్పటివరకు పంజాబ్ ఆడిన 5 మ్యాచ్‌లలో 4 విజయాలు అందుకుంది. ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. బ్యాటింగ్‌లో నాలుగు ఇన్నింగ్స్‌లలో 18, 50, 69, 66 పరుగులతో 203 రన్స్ బాదాడు. ఇక ఫీల్డింగ్‌లో ఓ స్టన్నింగ్ క్యాచ్ అందుకుని ఔరా అనిపించాడు. అంతేకాకుండా శ్రేయాస్ తన కొత్త నిక్‌నేమ్‌తో వార్తల్లో నిలుస్తున్నాడు.

పంజాబ్ కింగ్స్ సహచర ఆటగాళ్లు శ్రేయస్ అయ్యర్‌ను ప్రేమగా ‘సర్పంచ్ సాబ్’ అని పిలుచుకుంటున్నారు. ఐపీఎల్‌ టోర్నీలో గత కొన్నేళ్లుగా శ్రేయస్‌ జోరు కొనసాగుతోంది. బ్యాటర్, కెప్టెన్‌గా సత్తాచాటుతున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును తన సారథ్యంలో ప్లే ఆఫ్స్ చేర్చాడు. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌కు 2024లో టైటిల్‌ అందించాడు. 2025లో పంజాబ్‌ కింగ్స్ జట్టును ఫైనల్‌కు చేర్చాడు.

2026లో కూడా పీబీకేఎస్‌ను టైటిల్ దిశగా తీసుకెళుతున్నాడు. శ్రేయస్ గత కొన్నేళ్లుగా కేవలం కెప్టెన్‌గానే కాకుండా బ్యాటర్‌గానూ అలరిస్తూ ముందుకు సాగుతున్నాడు. దాంతో పంజాబ్‌లో చేరినప్పటి నుంచి ఆ జట్టు అభిమానులు, ప్లేయర్స్ తమ కెప్టెన్‌ను ముద్దుగా సర్పంచ్‌ సాబ్‌ అని పిలుచుకుంటున్నారు. ఈ పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను శ్రేయస్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నాడు.

'పంజాబ్ కింగ్స్ జట్టులో చేరిన కొత్తలో అందరూ నన్ను ‘సర్పంచ్’ అని పిలుస్తుంటే మొదట ఆశ్చర్యపోయా. ఆ పదానికి అర్థం ఏంటో తెలియక నా సహచరులనే అడిగి తెలుసుకున్నా. గ్రామాల్లో ప్రజలను ముందుండి నడిపించే నాయకుడిని, ఒక కుటుంబానికి లేదా ఒక సమూహానికి పెద్దగా ఉండేవారిని సర్పంచ్ అంటారని చెప్పారు.

అప్పుడు నాకు పూర్తి స్పష్టత వచ్చింది. సర్పంచ్ అనే పదానికి అర్ధం తెలిసాక.. ఆ నిక్‌నేమ్ నాకు బాగా నచ్చింది. సర్పంచ్ అనే పదం నా ప్రయాణంలో భాగమైంది. ఇది నాకు ఎంతో ఇష్టమైన నిక్‌నేమ్‌గా మారిపోయింది' అని శ్రేయస్ సంతోషం వ్యక్తం చేశాడు. జట్టును ముందుండి నడిపిస్తున్న తీరుకు ఈ పేరు సరిగ్గా సరిపోతుందని అభిమానులు కూడా భావిస్తున్నారు.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story