Shreyas Iyer: అయ్యర్ సిక్స్ ఐడియా హిట్.. పంజాబ్ అసలు విజయ రహస్యం ఇదా!
Shreyas Iyer: ఐపీఎల్ 2026 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) టీమ్ దూసుకుపోతోంది. పంజాబ్ విజయం వెనుక అసలు రహస్యం ఏంటో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వెల్లడించాడు.
Shreyas Iyer: అయ్యర్ సిక్స్ ఐడియా హిట్.. పంజాబ్ అసలు విజయ రహస్యం ఇదా!
Shreyas Iyer: ఐపీఎల్ 2026 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) టీమ్ దూసుకుపోతోంది. తాజాగా లక్నో సూపర్ జెయింట్స్‌పై 54 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. ఐపీఎల్ 2026లో ఓటమి ఎరుగని జట్టు పీబీకేఎస్ మాత్రమే. ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌లలో ఐదు గెలవగా.. ఓ మ్యాచ్ వర్షంతో రద్దయింది.
అయితే పంజాబ్ విజయం వెనుక అసలు రహస్యం ఏంటో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వెల్లడించాడు. 'ఎవరు ఎక్కువ సిక్సులు కొడతారు?' అని డ్రెస్సింగ్ రూమ్‌లో సరదాగా ప్రారంభమైన పోటీ జట్టుకు కొత్త ఉత్సాహాన్ని తీసుకువచ్చిందని తెలిపాడు. ప్రియాంశ్ ఆర్య, కూపర్ కానోలీ, తాను సిక్సుల పోటీ పెట్టుకున్నామని.. గెలిచిన వారికి నా బ్యాట్ బహుమతిగా ఇస్తానని శ్రేయస్ చెప్పుకొచ్చాడు.
లక్నో మ్యాచ్‌లో పంజాబ్ బ్యాటర్లు ప్రియాంశ్ ఆర్య (93), కూపర్ కానోలీ (87) అద్భుతంగా బ్యాటింగ్ చేసి రెండో వికెట్‌కు 13.2 ఓవర్లలోనే 182 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరి దూకుడు కారణంగా పంజాబ్ 254/7 భారీ స్కోర్ నమోదు చేసింది. ఈ సీజన్‌లో ఇదే అత్యధిక స్కోర్‌గా నిలిచింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ బ్యాటర్లు 21 సిక్స్‌లు కొట్టడం గమనార్హం.
స్పిన్‌తో పాటు పేస్ బౌలింగ్‌లోనూ భారీ సిక్సులు బాదారు. మ్యాచ్ అనంతరం శ్రేయస్ మాట్లాడుతూ. 'ప్రియాంశ్, కూపర్ భాగస్వామ్యం అద్భుతం. కొన్ని షాట్లు నిజంగా ఆశ్చర్యపరిచాయి. ముఖ్యంగా బ్యాక్ ఫుట్‌పై ఫాస్ట్ బౌలర్లను స్ట్రైట్‌గా ఆడటం, మిడిల్ ఓవర్లలో చూపిన నిలకడ అద్భుతం. ఇష్టమొచ్చినట్లు ఆడితే ఔటయ్యే ప్రమాదమూ లేకపోలేదు. మిడిల్ ఓవర్లలో ఆర్య- కనోలీ నిర్మించిన ఇన్నింగ్స్ హైలైట్' అని ప్రశంసించాడు.
'కూపర్, ఆర్యతో నేను ఎప్పటికప్పుడు జట్టు సమావేశాల్లో మాట్లాడుతూ ఉంటా. ముగ్గురం కలిసి సిక్సుల పోటీ పెట్టుకుందాం అని వారితో అన్నాను. ఇతర బ్యాటర్లకూ ఓ మాటా చెప్పా. ఐపీఎల్ 2026లో ఎక్కువ సిక్స్‌లు కొట్టిన వారికి నా బ్యాట్‌ను బహుమతిగా ఇస్తానని ఆఫర్ చేశా. ఇది పెద్ద విషయం కాకపోయినా.. ఆటగాళ్లకు ఉత్సాహాన్ని ఇస్తుంది.
ఆటగాళ్లను స్వేచ్ఛగా ఆడనిస్తే వాళ్లు మెరుగైన ఫలితాలు ఇస్తారు. అదే మా జట్టు మంత్రం' అని శ్రేయస్ చెప్పాడు. కోచ్ రికీ పాంటింగ్ మ్యాచ్ ముందు జట్టును ప్రోత్సహిస్తారని, తాను కూడా కొన్ని సూచనలు ఇస్తానని తెలిపాడు. స్వేచ్ఛ ఇస్తే ఎలాంటి ఫలితం వస్తుందో చూస్తున్నాం అని, ఏ జట్టుపై ఎవరు ఎలా ఆడాలనేది వారికే వదిలేశా అని పంజాబ్ కెప్టెన్ చెప్పుకొచ్చాడు.
'మా బౌలర్లు అంతర్జాతీయ స్థాయి అనుభవం కలిగినవారు. మేము కొన్ని ప్రణాళికలు రూపొందిస్తాం, వాటిని కచ్చితంగా అమలు చేయడమే ముఖ్యం. వారు ఈ సీజన్ మొత్తం అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు' అని శ్రేయస్ పేర్కొన్నాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన ప్రియాంశ్ ఆర్య తన ఇన్నింగ్స్‌పై మాట్లాడుతూ.. 'నేను ఎక్కువగా సిక్సులు కొట్టడంపై ప్రాక్టీస్ చేయను. టైమింగ్‌పై దృష్టి పెడతాను.
అదే నాకు సహాయపడుతోంది. క్రీజులో ఎక్కువగా మాట్లాడకుండా ఉండటం వల్ల క్లియర్ మైండ్‌తో ఆడగలుగుతున్నాను' అని తెలిపాడు. సరదాగా ప్రారంభమైన సిక్సుల పోటీ ఇప్పుడు పంజాబ్ జట్టుకు విజయాల మార్గాన్ని చూపిస్తోంది. జట్టు ఆటగాళ్లకు స్వేచ్ఛ ఇవ్వడం, విశ్వాసం కల్పించడం ద్వారా శ్రేయస్ తన నాయకత్వాన్ని మరోసారి నిరూపిస్తున్నాడు.




