Shreyas Iyer: అదే తప్పు పదేపదే చేస్తున్నారు.. 'సర్పంచ్ సాబ్' ఉద్యోగం ఊడుతుంది జర చూసుకో!

Shreyas Iyer: Saba Karim says Shreyas Iyer must prove his captaincy. ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో వరుస పరాజయాలు ఎదుర్కొంటున్న భారత జట్టుపై మాజీ క్రికెటర్ల నుంచి విమర్శలు కొనసాగుతున్నాయి.

Ravi
By Ravi
Published on: 10 July 2026 9:28 PM IST
Shreyas Iyer
X

Shreyas Iyer: అదే తప్పు పదేపదే చేస్తున్నారు.. 'సర్పంచ్ సాబ్' ఉద్యోగం ఊడుతుంది జర చూసుకో!

Shreyas Iyer: ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో వరుస పరాజయాలు ఎదుర్కొంటున్న భారత జట్టుపై మాజీ క్రికెటర్ల నుంచి విమర్శలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నాయకత్వంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ వికెట్‌కీపర్, మాజీ సెలెక్టర్ సబా కరీమ్.. శ్రేయస్ కెప్టెన్సీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఐపీఎల్‌లో చూపించిన వ్యూహాత్మక కెప్టెన్సీ కనిపించడం లేదన్నాడు. ఐపీఎల్ సారథ్యంను ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్‌లో కూడా ప్రదర్శించే సమయం వచ్చిందని అభిప్రాయపడ్డాడు. ఇంకా ఇలాగే కొనసాగితే 'సర్పంచ్ సాబ్' ఉద్యోగం ఊడుతుందని వార్నింగ్ ఇచ్చాడు.

టీ20 ప్రపంచకప్ 2026 విజయం తర్వాత సూర్యకుమార్ యాదవ్ స్థానంలో శ్రేయస్ అయ్యర్ భారత టీ20 జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. అయితే అతని నాయకత్వంలో భారత్ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. ఐర్లాండ్‌తో 2-0తో సిరీస్ కోల్పోయిన భారత్.. ఇప్పుడు ఇంగ్లండ్ చేతిలో కూడా వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడి సిరీస్‌ను చేజార్చుకుంది.

జియో హాట్‌స్టార్‌లో సబా కరీమ్ మాట్లాడుతూ.. 'శ్రేయస్ అయ్యర్ తన నాయకత్వాన్ని ఇప్పుడు నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది. ఐపీఎల్‌లో అతడు అద్భుతమైన వ్యూహాలతో జట్టును నడిపించాడు. కానీ అదే ఆలోచన, అదే వ్యూహం అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటివరకు కనిపించలేదు. అతడికి సమయం ఆసన్నమైంది. ఇప్పటికైనా శ్రేయాస్ తన కెప్టెన్సీని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది' అని అన్నాడు.

శివమ్ దూబేను ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు పంపిన నిర్ణయం తనకు ఆశ్చర్యం కలిగించిందని కరీమ్ తెలిపాడు. 'ఐపీఎల్‌లో శ్రేయస్ కెప్టెన్‌గా ఉంటే అలాంటి నిర్ణయం తీసుకునేవాడు కాదు. నా అభిప్రాయం ప్రకారం ఆ స్థానంలో తిలక్ వర్మను పంపాల్సింది. భారత బ్యాటింగ్‌లో వరుసగా లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లే ఉండటం సమస్యగా మారింది.

మిడిల్ ఓవర్లలో సీనియర్ రైట్ హ్యాండ్ బ్యాటర్ అవసరం. అందుకు సంజు శాంసన్‌ను తుది జట్టులోకి తీసుకోవాలి. ప్రస్తుతం సంజు కంటే మంచి ఎంపిక లేదు. తిలక్ వర్మను కొనసాగిస్తే.. శివమ్ దూబే స్థానంలో సంజును తీసుకురావాలి. దీంతో బ్యాటింగ్ మరింత బలపడుతుంది' అని వివరించాడు.

వాషింగ్టన్ సుందర్ స్థానంలో యువ ఆల్‌రౌండర్ సూర్యాంశ్ షెడ్గేకు అవకాశం ఇవ్వాలని సబా కరీమ్ సూచించాడు. 'షెడ్గే రెండు మూడు ఓవర్లు మీడియం పేస్ బౌలింగ్ చేయగలడు. దీంతో ఆరో బౌలర్ పాత్రను కూడా సమర్థంగా నిర్వహించగలడు. భారత జట్టు పరాజయాలకు ప్రధాన కారణం ఇంగ్లండ్ పరిస్థితులకు తగ్గట్టు ఆడలేకపోవడమే. జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్ వరుసగా షార్ట్‌పిచ్ బంతులు వేస్తున్నా భారత బ్యాటర్లు ఆ వ్యూహాన్ని అర్థం చేసుకోలేకపోయారు.

కొత్త బంతితో బౌండరీల కోసం తొందరపడకుండా సింగిల్స్ తీసుకుంటూ ఇన్నింగ్స్‌ను నిర్మించాల్సింది. కానీ భారత బ్యాటర్లు అదే తప్పు పదే పదే చేశారు. మధ్య ఓవర్లలో కూడా పరుగుల వేగం చాలా మందగించింది. మరోవైపు ఇంగ్లండ్ బ్యాటర్లు భారత స్పిన్నర్లకు పూర్తిస్థాయిలో అవకాశం ఇవ్వలేదు. మన ప్లేయర్స్ ఇంకా భారత పిచ్‌లపై ఆడుతున్నట్లే ఉన్నారు. ఇంగ్లండ్ పరిస్థితులకు తగ్గట్టు మార్పులు చేసుకోవడం లేదు. ప్రపంచకప్ గెలిచిన జట్టు నుంచి ఇలాంటి ఆటను ఎవరూ ఆశించరు' అని విశ్లేషించాడు.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story