చరిత్ర సృస్టించిన శుభ్‌మన్ గిల్-ఇషాన్ కిషన్.. భారత క్రికెట్‌లోనే ఇదే తొలిసారి!
IND vs AFG: అఫ్గానిస్థాన్‌తో జరిగిన రెండో వన్డే మ్యాచ్ ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోయింది.
చరిత్ర సృస్టించిన శుభ్‌మన్ గిల్-ఇషాన్ కిషన్.. భారత క్రికెట్‌లోనే ఇదే తొలిసారి!
IND vs AFG: భారత వన్డే క్రికెట్ చరిత్రలో లక్నో వేదికగా బుధవారం అఫ్గానిస్థాన్‌తో జరిగిన రెండో వన్డే మ్యాచ్ ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోయింది. యువ బ్యాటర్లు శుభ్‌మన్ గిల్ (154; 110 బంతుల్లో 22×4, 2×6), ఇషాన్ కిషన్ (125; 79 బంతుల్లో 14×4, 7×6) విధ్వంసకర శతకాలతో చెలరేగి టీమిండియాకు భారీ విజయాన్ని అందించడమే కాకుండా.. భారత క్రికెట్ చరిత్రలో ఎన్నడూ నమోదు కాని అరుదైన రికార్డును తమ పేరిట లిఖించుకున్నారు.
80 బంతుల్లోపే సెంచరీలు:
భారత్ ఇప్పటివరకు 1,077 వన్డే మ్యాచ్‌లు ఆడినప్పటికీ.. ఒకే మ్యాచ్‌లో క్రీజులో ఉన్న ఇద్దరు బ్యాటర్లు 80 బంతుల్లోపే సెంచరీలు పూర్తి చేయడం ఇదే తొలిసారి. అఫ్గానిస్థాన్ బౌలర్లపై ఆరంభం నుంచే దాడికి దిగిన శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ జోడీ పరుగుల వర్షం కురిపించింది. శుభ్‌మన్ గిల్ 77 బంతుల్లో సెంచరీ పూర్తి చేయగా.. ఇషాన్ కిషన్ మరింత వేగంగా కేవలం 71 బంతుల్లోనే శతకం నమోదు చేశాడు. వీరిద్దరూ కలిసి రెండో వికెట్‌కు 224 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పి భారత ఇన్నింగ్స్‌కు అద్భుతమైన పునాది వేశారు. స్టార్స్ సచిన్-గంగూలీ, సెహ్వాగ్-గంభీర్, రోహిత్-విరాట్ కలిసి భారీగా పరుగులు చేసినా.. ఈ ఘనత అందుకోలేదు.
డబుల్ సెంచరీకి చేరువలో గిల్:
ఇషాన్ కిషన్ 125 పరుగుల వద్ద అవుట్ అయిన తర్వాత కూడా శుభ్‌మన్ గిల్ తన దూకుడును కొనసాగించాడు. సెంచరీ అనంతరం కేవలం 33 బంతుల్లో మరో 50 పరుగులు సాధించి ప్రత్యర్థి బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చెలాయించాడు. 43.3 ఓవర్ల వద్ద అవుట్ అయ్యే సమయానికి ఇంకా 39 బంతులు మిగిలి ఉండటంతో.. గిల్ రెండో డబుల్ సెంచరీ సాధిస్తాడని అభిమానులు ఆశించారు. అయితే రివర్స్ స్వీప్ ఆడే ప్రయత్నంలో క్యాచ్ అవుట్ అయ్యాడు. గిల్ 110 బంతుల్లో 22 ఫోర్లు, 2 సిక్సర్లతో 154 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు.
గిల్ ఖాతాలో మరో రెండు అరుదైన రికార్డులు:
ఈ మ్యాచ్ ద్వారా శుభ్‌మన్ గిల్ వ్యక్తిగతంగా కూడా పలు ఘనతలు సాధించాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 3000 పరుగులు పూర్తి చేసిన భారత బ్యాటర్‌గా నిలిచాడు. కేవలం 62 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మైలురాయిని చేరుకున్నాడు. అలాగే 2022 జనవరి తర్వాత వన్డేల్లో అత్యధిక సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న ఆటగాళ్ల జాబితాలో 9 అవార్డులతో విరాట్ కోహ్లీ సరసన చేరాడు.
వన్డే చరిత్రలోనే తొలిసారి:
భారత్ ఈ మ్యాచ్‌లో 49.5 ఓవర్లలో 402 పరుగులకు ఆలౌట్ అయింది. వన్డే క్రికెట్ చరిత్రలో ఒక జట్టు 400కు పైగా పరుగులు చేసి ఆలౌట్ కావడం ఇదే తొలిసారి. మరోవైపు వన్డేల్లో భారత్ 400 ప్లస్ స్కోరు చేయడం ఇది ఎనిమిదోసారి. దీంతో అత్యధిక సార్లు 400+ స్కోర్లు చేసిన దక్షిణాఫ్రికా రికార్డును టీమిండియా సమం చేసింది.
అఫ్గానిస్థాన్‌కు రెండో అతిపెద్ద ఓటమి:
403 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గానిస్థాన్ భారత బౌలర్ల ధాటికి నిలవలేకపోయింది. ఫలితంగా 170 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. అఫ్గానిస్థాన్ వన్డే చరిత్రలో పరుగుల పరంగా ఇది రెండో అతిపెద్ద ఓటమిగా నమోదైంది. అంతకుముందు 2015 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా చేతిలో 275 పరుగుల తేడాతో ఓడింది.




