Shubman Gill: అదే మా కొంపముంచింది.. టీమిండియా ఓటమిపై గిల్ అసంతృప్తి!
Shubman Gill: భారత్ ఓటమిపై కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. బ్యాటింగే తమ కొంపముంచింది అని స్పష్టం చేశాడు.
Shubman Gill: అదే మా కొంపముంచింది.. టీమిండియా ఓటమిపై గిల్ అసంతృప్తి!
Shubman Gill: ఇంగ్లండ్‌తో కార్డిఫ్‌లో గురువారం జరిగిన రెండో వన్డేలో భారత్ నాలుగు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ముందుగా భారత్ 44 ఓవర్లలో 233 పరుగులకు ఆలౌటైంది. అనంతరం 234 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ 44.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓటమిపై భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. బ్యాటింగే తమ కొంపముంచింది అని స్పష్టం చేశాడు.
మంచి ఆరంభం లభించినప్పటికీ దానిని భారీ స్కోరుగా మలచడంలో విఫలమయ్యామని అంగీకరించాడు. 25 ఓవర్లు ముగిసే తమ బ్యాటింగ్ మంచి స్థితిలో ఉందని.. ఓ దశలో తాము 300-310 పరుగులు చేస్తామని అనిపించిందన్నాడు. మధ్య ఓవర్లలో వరుసగా వికెట్లు కోల్పోవడం వల్లనే భారీ స్కోర్ చేయలేకపోయామని గిల్ తెలిపాడు.
మ్యాచ్ అనంతరం శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ... 'నిజం చెప్పాలంటే ఇది చాలా నిరాశ కలిగించింది. 25 ఓవర్ల తర్వాత మేం మంచి స్థితిలో ఉన్నాం. కనీసం 300 లేదా 310 పరుగులు చేస్తామని అనుకున్నాం. కానీ మధ్య ఓవర్లలో వికెట్లు కోల్పోయాం. అదే మ్యాచ్ ఫలితాన్ని మార్చేసింది. రెండు మ్యాచ్‌ల్లోనూ బ్యాటింగ్ కుప్పకూలింది.
టెయిల్ ఎండర్లు పెద్దగా బ్యాటింగ్ చేయరని మాకు తెలుసు. లోయర్ మిడిల్ ఆర్డర్ నుంచి మరింత మెరుగైన ప్రదర్శన ఆశించాము. మాకు లభించిన అద్భుతమైన ఆరంభాన్ని ఉపయోగించుకోలేకపోయాం. ఇకపై చిన్న చిన్న భాగస్వామ్యాలు నిర్మించి భారీ స్కోర్లు చేయడంపై దృష్టి పెడతాం' అని వివరించాడు.
గిల్ తన ఔట్ గురించి మాట్లాడుతూ.. 'కవర్‌లో నేరుగా క్యాచ్ ఇవ్వడం ఎప్పుడూ బాధగానే ఉంటుంది. ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయం కూడా జట్టుపై ప్రభావం చూపింది. బ్యాటింగ్ చేస్తూ గాయపడిన సుందర్ బౌలింగ్ చేయలేకపోవడంతో ప్రధాన బౌలర్లనే వరుసగా ఉపయోగించాల్సి వచ్చింది. దాంతో బౌలింగ్ వ్యూహాలు మార్చాల్సి వచ్చింది. అయితే పిచ్ ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా ఉండటంతో గాయం మ్యాచ్ ఫలితాన్ని పూర్తిగా మార్చిందని మాత్రం నేను భావించడం లేదు' అని స్పష్టం చేశాడు.
ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ అద్భుత ఇన్నింగ్స్‌పై గిల్ ప్రశంసలు కురిపించాడు. '233 పరుగుల లక్ష్యాన్ని కాపాడటం చాలా కష్టం. 300 పరుగులకు పైగా చేసి ఉంటే జో రూట్‌పై మరింత ఒత్తిడి తీసుకురాగలిగేవాళ్లం. కానీ 4.5 నుంచి 5 పరుగుల రన్‌రేట్‌తో ఛేదించాల్సిన లక్ష్యాలు రూట్‌కు బాగా అలవాటు. అతడిని తప్పిదం చేయించే అవకాశం మాకు దొరకలేదు. రూట్ బాగా ఆడాడు' అని పేర్కొన్నాడు. ఈ ఓటమితో మూడు వన్డేల సిరీస్ 1-1తో సమమైంది. ఇప్పుడు సిరీస్ విజేతను నిర్ణయించే మూడో వన్డేపై అందరి దృష్టి నెలకొంది.
ఈ మ్యాచులో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మెరిశాడు. 66 బంతుల్లో 8 ఫోర్లతో 65 రన్స్ బాదాడు. శ్రేయస్ అయ్యర్ 71 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సులతో 66 రన్స్ చేసి మెరిశాడు. బౌలింగ్లో జస్ప్రీత్ బుమ్రా (1/45), అక్షర్ పటేల్ (1/35) రాణించారు. గుర్నూర్ బ్రార్ (2/67), ప్రసిద్ధ్ కృష్ణ (1/52) వికెట్ తీసినా.. భారీగా రన్స్ సమర్పించుకున్నారు.




