Vaibhav Suryavanshi: గ్రౌండ్‌లోనే వెక్కి వెక్కి ఏడ్చిన వైభవ్ సూర్యవంశీ

Vaibhav Suryavanshi: ఐపీఎల్ 2026 క్వాలిఫయర్ 2లో రాజస్థాన్ రాయల్స్‌పై గుజరాత్ టైటాన్స్ ఘన విజయం సాధించి ఫైనల్లోకి దూసుకెళ్ళింది.

Naresh.k
Published on: 30 May 2026 7:21 AM IST
Vaibhav Suryavanshi
X

Vaibhav Suryavanshi: గ్రౌండ్‌లోనే వెక్కి వెక్కి ఏడ్చిన వైభవ్ సూర్యవంశీ

GT vs RR: ఐపీఎల్ 2026 సీజన్ క్లైమాక్స్ ఊహించని మలుపులతో క్రికెట్ ప్రియులను ఉర్రూతలూగిస్తోంది. శుక్రవారం ముల్లన్‌పూర్‌లో జరిగిన హై-వోల్టేజ్ క్వాలిఫయర్-2 పోరులో గుజరాత్ టైటాన్స్ అద్భుత విజయాన్ని అందుకుని ఫైనల్లోకి దూసుకెళ్ళింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఆడిన మెరుపు శతకం పుణ్యమా అని గుజరాత్ 7 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌ను చిత్తు చేసింది. ఈ విజయంతో మే 31న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడేందుకు గుజరాత్ టైటాన్స్ సిద్ధమైంది. ఇరు జట్లూ తమ రెండో ఐపీఎల్ టైటిల్ కోసం ఈ తుది పోరులో తలపడనుండటం విశేషం.

మ్యాచ్ ముగిసిన తర్వాత మైదానంలో ఒక హృదయవిదారక దృశ్యం కనిపించింది. ఈ సీజన్‌ అంతా ప్రత్యర్థి బౌలర్లను వణికించిన రాజస్థాన్ రాయల్స్ 15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీ తన భావోద్వేగాలను అదుపు చేసుకోలేకపోయాడు. జట్టును ఫైనల్స్‌కు చేర్చలేకపోయాననే ఆవేదనతో ఆ కుర్రాడు డగౌట్‌లో తలదించుకుని నిశ్శబ్దంగా ఏడ్చేశాడు. అతని కళ్ళలో కన్నీళ్లు చూసి క్రికెట్ అభిమానుల గుండె పగిలింది. అయితే, వైభవ్‌కు ఈ సీజన్ ఒక కలలాంటిది. కేవలం 16 మ్యాచ్‌లలోనే 776 పరుగులు సాధించి, ప్రస్తుతం సీజన్ అత్యధిక రన్ స్కోరర్‌గా ఆరెంజ్ క్యాప్ తన వద్దే ఉంచుకున్నాడు. ఇంత చిన్న వయసులో కొండంత ప్రదర్శన చేసినా, ట్రోఫీకి అడుగుదూరంలో నిలిచిపోవడం ఆ యువ క్రికెటర్‌ని తీవ్రంగా కలిచివేసింది.

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్‌కు గుజరాత్ బౌలర్లు చుక్కలు చూపించారు. స్కోరు బోర్డుపై కేవలం 9 పరుగులు చేరేసరికే స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (1), ధ్రువ్ జురెల్ (7) వికెట్లను కోల్పోయి రాజస్థాన్ తీవ్ర కష్టాల్లో పడింది. ఆ దశలో వైభవ్ సూర్యవంశీ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అనుభవజ్ఞుడైన ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాతో కలిసి ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. మైదానం నలువైపులా క్లాస్, మాస్ షాట్లతో విరుచుకుపడుతూ కేవలం 47 బంతుల్లో 7 సిక్సర్లు, 8 ఫోర్ల సాయంతో 96 పరుగుల విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ సెంచరీ మిస్ అయినప్పటికీ జట్టుకు ఒక గౌరవప్రదమైన స్కోరు అందించాడు.

మరోవైపు జడేజా 35 బంతుల్లో 45 పరుగులతో నాటౌట్‌గా నిలవగా, ఆఖర్లో డోనోవన్ ఫెరీరా కేవలం 11 బంతుల్లోనే 38 రన్స్ చేసి మెరుపులు మెరిపించడంతో.. రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 214 పరుగుల భారీ స్కోరు సాధించింది. గుజరాత్ బౌలర్లలో హోల్డర్, రబాడా చెరో 2 వికెట్లు తీయగా, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ చెరో వికెట్ పడగొట్టారు. 215 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్‌ను కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ముందుండి నడిపించాడు. రాజస్థాన్ బౌలర్లను చీల్చిచెండాడుతూ మ్యాచ్‌ను వన్‌సైడ్ చేసేశాడు. గిల్ మెరుపు శతకంతో గుజరాత్ సులువుగా లక్ష్యాన్ని ఛేదించి ఫైనల్ టికెట్ దక్కించుకుంది. ఐపీఎల్ చరిత్రలో గుజరాత్ ఫైనల్‌కు చేరడం ఇది మూడోసారి. మరి మే 31న అహ్మదాబాద్‌లోని హోమ్ గ్రౌండ్‌లో గిల్ సేన రెండోసారి కప్పు కొడుతుందా? లేక ఆర్సీబీ మరోసారి టైటిల్ ముద్దాడుతుందా? అనేది చూడాలి.


Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story