Shubman Gill: మానవ్ సుతార్ చాలా ప్రతిభావంతు.. ఎక్కడికో వెళ్లిపోతాడు!
Shubman Gill: మానవ్ సుతార్‌లో చాలా ప్రతిభావంతుడని, చాలా కాలం పాటు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తాడని శుభ్‌మన్ గిల్ ధీమా వ్యక్తం చేశాడు.
Shubman Gill: మానవ్ సుతార్ చాలా ప్రతిభావంతు.. ఎక్కడికో వెళ్లిపోతాడు!
Shubman Gill: శ్రీలంకతో గాలె వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్ 165 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. భారత టెస్టు చరిత్రలో 600వ మ్యాచ్‌గా నిలిచిన ఈ మ్యాచ్‌లో యువ స్పిన్నర్ మానవ్ సుతార్, బ్యాటర్ దేవదత్ పడిక్కల్ అద్భుత ప్రదర్శనతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ.. వీరిద్దరిపై ప్రశంసల వర్షం కురిపించాడు. ముఖ్యంగా సుతార్ ప్రదర్శనపై గిల్ ప్రత్యేకంగా స్పందించాడు. అతడిలో చాలా ప్రతిభావంతుడని, చాలా కాలం పాటు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తాడని ధీమా వ్యక్తం చేశాడు.
'మానవ్ సుతార్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. భారత్ తరఫున తన తొలి మ్యాచ్‌లోనూ, ఈ మ్యాచ్‌లోనూ గొప్పగా రాణించాడు. అతడు చాలా ప్రతిభావంతుడు. భవిష్యత్తులో చాలా కాలం పాటు భారత్ తరఫున ఆడగడు. సుతార్ ఎన్నో రికార్డులు బద్దలు కొడతాడు' అని శుభ్‌మన్ గిల్ ప్రశంసించాడు. గాలె టెస్టులో సుతార్ ఏకంగా 10 వికెట్లు పడగొట్టి మ్యాచ్ హీరోగా నిలిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీసిన సుతార్.. రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లతో చెలరేగాడు. దీంతో ఈ మ్యాచ్‌లో 10/101 గణాంకాలు నమోదు చేశాడు. కేవలం రెండో టెస్టులోనే ఇలాంటి ప్రదర్శన చేయడంతో సుతార్‌పై క్రికెట్ వర్గాల్లో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
దేవదత్ పడిక్కల్‌ను కూడా శుభ్‌మన్ గిల్ అభినందించాడు. సాయి సుదర్శన్ గాయపడటంతో మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన పడిక్కల్.. తొలి ఇన్నింగ్స్‌లో అద్భుతంగా ఆడి 167 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ 44 పరుగులు బాదాడు. సెంచరీ చేసిన తర్వాత కూడా భారీ ఇన్నింగ్స్‌గా మలచడం టీమిండియాకు ఎంతో ఉపయోగపడిందని గిల్ పేర్కొన్నాడు. 'సెంచరీ చేయడం ముఖ్యం. కానీ సెంచరీ తర్వాత కూడా అదే ఏకాగ్రతతో కొనసాగి భారీ స్కోరు చేయడం చాలా కీలకం. పోటీగా ఉన్న మ్యాచ్‌ను సౌకర్యవంతమైన స్థితిలోకి తీసుకెళ్లేది ఇలాంటి ఇన్నింగ్సులే. రెండో ఇన్నింగ్స్‌లో కూడా అతడు స్పిన్నర్లపై ఆధిపత్యం ప్రదర్శించిన తీరు చూడటానికి అద్భుతంగా ఉంది' అని గిల్ చెప్పాడు.
భారత్ 600వ టెస్టులో విజయం సాధించడం తనకు ఎంతో ప్రత్యేకమని సారథి గిల్ పేర్కొన్నాడు. దేశం తరఫున 600వ టెస్టులో గెలవడం గర్వంగా ఉందని, ఈ విజయం ఎంతో సంతృప్తినిచ్చిందని చెప్పాడు. గాలెలో వాతావరణ పరిస్థితుల కారణంగా మ్యాచ్ పూర్తవుతుందా లేదా అనే అనుమానాలు ఉన్నప్పటికీ.. జట్టు ఆటగాళ్లు ఒత్తిడిని సమర్థంగా ఎదుర్కొన్నారని గిల్ తెలిపాడు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరుకోవడమే తమ అంతిమ లక్ష్యమని స్పష్టం చేశాడు. టెస్టు విజయాలు అంత సులభంగా రావని, అందుకే శ్రీలంకపై సాధించిన ఈ విజయం మరింత ఆనందాన్ని ఇచ్చిందని గిల్ చెప్పాడు.
రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 193 పరుగులకే ఆలౌట్ కావడంపై పెద్దగా ఆందోళన చెందడం లేదని గిల్ తెలిపాడు. చివరి ఇన్నింగ్స్‌లో శ్రీలంకపై ఎక్కువ సమయం బౌలింగ్ చేసేందుకు తమకు తగినన్ని ఓవర్లు కావాలనే ఉద్దేశంతోనే భారత బ్యాటర్లు దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించారని వివరించాడు. గాలె పిచ్‌పై పరుగులు చేయడం అంత సులభం కాదని, ఆ దూకుడు కారణంగానే కొన్ని వికెట్లు త్వరగా కోల్పోయామని చెప్పాడు. అయినప్పటికీ భారత్ అప్పటికే సౌకర్యవంతమైన స్థితిలో ఉందని, మా ప్లాన్ ప్రకారమే ఆడామని గిల్ పేర్కొన్నాడు. 600వ టెస్టులో భారత్ ఘన విజయం సాధించడంతో పాటు మానవ్ సుతార్ వంటి యువ ఆటగాడి అద్భుత ప్రదర్శన జట్టుకు మరింత బలాన్నిచ్చింది.




