Shubman Gill: నిజంగా అదృష్టమే, అప్పుడే గెలుస్తామనే నమ్మకం వచ్చింది.. అసలు విషయం చెప్పేసిన గిల్!
Shubman Gill on Gujarat Titans Thrilling Win: గుజరాత్ విజయంపై ఆ జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ స్పందించాడు. మూడు మ్యాచ్‌లు వరుసగా చివరి ఓవర్ వరకు వెళ్లినప్పటికీ.. ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపాడు.
Shubman Gill
Shubman Gill: ఐపీఎల్ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన థ్రిల్లింగ్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఒక్క పరుగు తేడాతో గెలిచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ 4 వికెట్లకు 210 పరుగులు చేయగా.. ఢిల్లీ 8 వికెట్లకు 209 పరుగులే చేసింది. గుజరాత్ విజయంపై ఆ జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ స్పందించాడు. మూడు మ్యాచ్‌లు వరుసగా చివరి ఓవర్ వరకు వెళ్లినప్పటికీ.. ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపాడు. చివరి బంతి వరకు పోరాడి గెలవడం జట్టుకు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందని చెప్పాడు. ఈ మ్యాచ్‌లో గెలవడం నిజంగా అదృష్టమే అని పేర్కొన్నాడు. ఐదో బంతికి డేవిడ్ మిల్లర్ సింగిల్ తీయకపోవడంతో తాము గెలవగలమన్న నమ్మకం వచ్చిందని గిల్ చెప్పుకొచ్చాడు.
మ్యాచ్‌లో కీలక మలుపుగా మారిన చివరి ఓవర్ గురించి శుభ్‌మన్ గిల్ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ముఖ్యంగా ఐదో బంతికి డేవిడ్ మిల్లర్ సింగిల్ తీసుకోకపోవడంపై స్పందిస్తూ.. 'మాకు గెలిచే అవకాశం ఉందని అప్పుడే నమ్మకం వచ్చింది' అని చెప్పాడు. చివరి బంతికి ముందు బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణతో చర్చించిన విషయాన్ని కూడా వెల్లడించాడు. 'చివరి బంతిని యార్కర్ వేయాలా లేక స్లో బంతి వేయాలా అనే విషయంలో బాగా చర్చించాము. పిచ్ పరిస్థితులను బట్టి స్లో బంతి వేయాలని నిర్ణయించుకున్నాము. ఆ నిర్ణయమే మ్యాచ్ ఫలితాన్ని ప్రభావితం చేసిందని చెప్పవచ్చు' గిల్ తెలిపాడు.
ఫీల్డింగ్ ప్రదర్శనపై శుభ్‌మన్ గిల్ నిజాయితీగా స్పందించాడు. 'నేను ఇచ్చిన ఓవర్త్రోస్, బౌండరీల వల్ల కొన్ని పరుగులు వచ్చాయి. ఈ విషయాన్నీ నిజాయితీగా ఒప్పుకోవాల్సిందే. అయితే ఇలాంటి ఉత్కంఠభరిత మ్యాచ్‌లలో ఒక్కో రన్ ఎంత ముఖ్యమో ఈ మ్యాచ్ ద్వారా తెలిసొచ్చింది. చివరకు ఒకే ఒక్క రన్ తేడాతో గెలిచిన నేపథ్యంలో ప్రతి చిన్న తప్పు లేదా మంచి ప్రయత్నం ఎంత ప్రభావం చూపుతుందో అర్థమైంది. ఈ పిచ్‌పై 210 పరుగులు సాధించడం మంచి స్కోరే. ఈ వికెట్‌పై చివరి ఓవర్లలో భారీ షాట్లు కొట్టడం అంత ఈజీ కాదు. పిచ్ కొంచెం స్లోగా ఉండటంతో బంతిని బౌండరీకి పంపడం కష్టంగా మారింది. అందుకే 10-15 పరుగులు ఎక్కువే చేశామని భావించాము. బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తే మ్యాచ్ గెలుస్తామనే ముందే అనుకున్నాం' అని గిల్ పేర్కొన్నాడు.
శుభ్‌మన్ గిల్ తన బ్యాటింగ్‌పై స్పందిస్తూ.. 'ఈ ఇన్నింగ్స్‌పై సంతోషంగా ఉన్నా. ఇప్పుడు విశ్రాంతి తీసుకుని తదుపరి మ్యాచ్ కోసం సిద్దమవ్వాలి. వచ్చే మ్యాచులో తప్పులు చేయకుండా పూర్తిగా ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తాం' అని చెప్పుకొచ్చాడు. ఢిల్లీ విజయానికి చివరి 2 బంతుల్లో 2 రన్స్ అవసరం కాగా.. అయిదో బంతికి సింగిల్ తీసే అవకాశమున్నా మిల్లర్ నిరాకరించాడు. చివరి బంతికి షాట్ ఆడలేకపోయిన మిల్లర్.. బై కోసం ప్రయత్నించగా స్ట్రైకింగ్ ఎండ్‌లోని కుల్దీప్ యాదవ్ రనౌటైపోయాడు. దాంతో మ్యాచ్ గుజరాత్ సొంతమైంది.


