Shubman Gill: అరుదైన టెస్టుకు నాయకత్వం.. శుభ్‌మన్ గిల్ సంతోషం.. గర్వంగా ఉందంటూ..!
India 600th Test. టీమిండియా టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తన కెప్టెన్సీపై వస్తున్న ఒత్తిడి, జట్టు ప్రదర్శనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
Shubman Gill: అరుదైన టెస్టుకు నాయకత్వం.. శుభ్‌మన్ గిల్ సంతోషం.. గర్వంగా ఉందంటూ..!
Shubman Gill: టీమిండియా టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తన కెప్టెన్సీపై వస్తున్న ఒత్తిడి, జట్టు ప్రదర్శనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్‌గా ఇప్పటివరకు భారత్‌కు భారీ టెస్టు సిరీస్ విజయాన్ని అందించలేకపోయినప్పటికీ.. నాయకత్వ బాధ్యతల్లో తాను ఎంతో సౌకర్యంగా ఉన్నానని గిల్ స్పష్టం చేశాడు. గత ఏడాది కాలంగా భారత జట్టు సరైన దిశలోనే ముందుకు సాగుతోందని, జట్టు పురోగతి తనకు సంతృప్తినిస్తోందని టీమిండియా ప్రిన్స్ తెలిపాడు. ఇంగ్లండ్ పర్యటనలో గిల్ తొలిసారి టెస్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. ఆ సిరీస్‌లో భారత్ 2-2తో డ్రా చేసుకుంది. ఆ తర్వాత స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో భారత్ పరాజయం చవిచూసింది. అనంతరం స్వదేశంలో ఆఫ్ఘనిస్థాన్‌పై విజయం సాధించింది.
శనివారం నుంచి గాలేలో శ్రీలంకతో భారత్ మొదటి టెస్ట్ ఆడనుంది. తొలి టెస్టుకు ముందు నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ... 'కెప్టెన్సీ బాధ్యతల్లో నేను చాలా సౌకర్యంగా ఉన్నాను. గత ఏడాది కాలంగా జట్టు ఎలా ముందుకు సాగుతోందో చూస్తే చాలా సంతోషంగా ఉంది. మేము సరైన దిశలోనే అడుగులు వేస్తున్నామని నమ్ముతున్నాను. ప్రస్తుతం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో భారత్ ఐదో స్థానంలో ఉంది. వచ్చే ఏడాది జరగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అర్హత సాధించాలంటే ఇకపై ప్రతి టెస్టు కీలకమే. భారత్ ఇంకా తొమ్మిది టెస్టులు ఆడాల్సి ఉంది. అందులో ఆరు లేదా ఏడు మ్యాచ్‌లు గెలిస్తే ఫైనల్ రేసులో నిలిచే అవకాశాలు మెరుగవుతాయి. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుకోవడమే ప్రస్తుతం మా ప్రధాన లక్ష్యం. శ్రీలంకతో సిరీస్ మాకు చాలా ముఖ్యమైనది. ఈ సిరీస్ కోసం సరైన రీతిలో సన్నద్ధమయ్యాం’' గిల్ తెలిపాడు.
శ్రీలంకతో తొలి టెస్టు భారత క్రికెట్ చరిత్రలో ప్రత్యేకమైన మైలురాయిగా నిలవనుంది. ఇది టీమిండియా ఆడబోయే 600వ టెస్టు మ్యాచ్. ఈ చారిత్రక మ్యాచ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం గిల్‌కు దక్కడం మరింత ప్రత్యేకం. గతంలో మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ 100వ టెస్టుకు, విరాట్ కోహ్లీ 500వ టెస్టుకు నాయకత్వం వహించారు. ‘దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఏ టెస్టుకైనా కెప్టెన్‌గా వ్యవహరించడం గొప్ప గౌరవం. ఇక భారత 600వ టెస్టుకు నాయకత్వం వహించడం నాకు మరింత ప్రత్యేకమైన విషయం. అది స్వాతంత్ర్య దినోత్సవం రోజున జరగడం ఈ అవకాశాన్ని మరింత గొప్పగా మార్చింది’ అని గిల్ భావోద్వేగంగా చెప్పాడు.
శ్రీలంక పరిస్థితులపై కూడా గిల్ స్పందించాడు. 'భారత్, శ్రీలంకలో స్పిన్నర్ల పాత్ర ఒకే విధంగా ఉంటుంది. ముఖ్యంగా బంతి పాతబడిన తర్వాత స్పిన్నర్లు మరింత ప్రభావం చూపుతారు. అయితే భారత్‌లోని వివిధ ప్రాంతాల్లో పిచ్‌ల స్వభావం భిన్నంగా ఉంటుంది. గాలె పిచ్‌లో ఇటీవల మ్యాచ్‌లను పరిశీలిస్తే మంచి బౌన్స్ కనిపిస్తోంది. ముంబైలోని ఎర్ర మట్టి పిచ్‌ల మాదిరి గాలె పరిస్థితులు కొంత దగ్గరగా ఉంటాయి' అని గిల్ చెప్పుకొచ్చాడు. శ్రీలంక పరిస్థితులను త్వరగా అర్థం చేసుకుని, స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కోవడమే భారత బ్యాటర్లకు కీలకంగా మారనుంది. డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో నిలవాలంటే శ్రీలంకతో సిరీస్‌ను విజయంతో ప్రారంభించడమే గిల్ సేన ముందున్న ప్రధాన లక్ష్యం.




