Smriti Mandhana: స్మృతి మంధాన చారిత్రక ఘనత.. మొదటి క్రికెటర్‌గా రికార్డుల్లో!

Smriti Mandhana: Smriti Mandhana Becomes 3rd Indian Woman to Play 300 International Matches. భారత మహిళల క్రికెట్ టీమ్ స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన మరో అరుదైన మైలురాయిని అందుకుంది.

Rishvik
Published on: 10 July 2026 6:56 PM IST
Smriti Mandhana
X

Smriti Mandhana: స్మృతి మంధాన చారిత్రక ఘనత.. మొదటి క్రికెటర్‌గా రికార్డుల్లో!

Smriti Mandhana: భారత మహిళల క్రికెట్ టీమ్ స్టార్ ఓపెనర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన మరో అరుదైన మైలురాయిని అందుకుంది. అంతర్జాతీయ క్రికెట్‌లో అతి పిన్న వయస్సులో 300 మ్యాచ్‌లు ఆడిన బ్యాటర్‌గా రికార్డుల్లో నిలిచింది. ఇంగ్లండ్‌తో ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో ఈరోజు ప్రారంభమైన టెస్టు మ్యాచ్‌లో బరిలోకి దిగిన స్మృతి.. ఈ మైలురాయిని అందుకుంది. అంతేకాదు భారత మహిళల జట్టు తరఫున 300 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన మూడో క్రికెటర్‌గా కూడా చరిత్ర సృష్టించింది. దాదాపు పదేళ్లకు పైగా భారత జట్టుకు ఆడుతున్న స్మృతి.. తన నిలకడైన ప్రదర్శనతో ఈ ఘనతను అందుకుంది.

29 ఏళ్ల స్మృతి మంధాన ఇప్పటివరకు 9 టెస్టులు, 120 వన్డేలు, 171 టీ20 మ్యాచ్‌లు ఆడింది. స్మృతి 2013 ఏప్రిల్‌లో భారత జట్టు తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసింది. అప్పటి నుంచి అన్ని ఫార్మాట్లలోనూ జట్టుకు కీలక బ్యాటర్‌గా ఎదిగింది. లార్డ్స్ టెస్టు ఆమె కెరీర్‌లో తొమ్మిదో టెస్టు మ్యాచ్‌గా నిలిచింది. వన్డే క్రికెట్‌లో స్మృతి ఇప్పటికే 5,411 పరుగులు చేసి.. భారత మహిళల జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించింది. టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో కూడా 4,538 పరుగులు చేసి ప్రపంచ మహిళల క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాటర్లలో ఒకరిగా గుర్తింపు పొందింది. టెస్టు క్రికెట్‌లో ఇప్పటివరకు 14 ఇన్నింగ్స్‌లు ఆడిన ఆమె 635 పరుగులు చేసింది. ఇందులో రెండు సెంచరీలు, మూడు అర్ధశతకాలు ఉన్నాయి.

భారత మహిళల క్రికెట్ చరిత్రలో అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. హర్మన్‌ప్రీత్ ఇపటివరకు 374 మ్యాచ్‌లు ఆడింది. మాజీ దిగ్గజ కెప్టెన్ మిథాలీ రాజ్ 333 మ్యాచ్‌లతో రెండో స్థానంలో ఉంది. 300 మ్యాచ్‌ల మైలురాయిని చేరుకున్న స్మృతి మంధాన మూడో స్థానంలో నిలిచింది. జులన్ గోస్వామి (284 మ్యాచ్‌లు), దీప్తి శర్మ (280 మ్యాచ్‌లు) ఈ జాబితాలో టాప్ 5లో ఉన్నారు.

300 అంతర్జాతీయ మ్యాచ్‌ల మైలురాయిని చేరుకోవడం ద్వారా స్మృతి మంధాన భారత మహిళల క్రికెట్‌లో తన పేరును ప్రత్యేకంగా లిఖించుకుంది. మూడు ఫార్మాట్లలో కలిపి మొత్తం 10 వేలకు పైగా పరుగులు చేసింది. ఇందులో 17 శతకాలు, 74 అర్ధ శతకాలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో మరిన్ని పరుగులు, రికార్డులతో భారత జట్టుకు విజయాలు అందించాలని టీమిండియా ఫాన్స్ కోరుకుంటున్నారు. లార్డ్స్‌లో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో ఓపెనర్ స్మృతి హాఫ్ సెంచరీ సాధించింది.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story