Vaibhav Sooryavanshi: శ్రీలంక ఆటగాడితో వైభవ్ సూర్యవంశీ గొడవ.. కొద్దిగైతే కొట్టేసుకునేవారే.. వీడియో వైరల్!
Vaibhav Sooryavanshi: భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ.. శ్రీలంక ఆటగాడితో వాగ్వాదానికి దిగాడు.
Vaibhav Sooryavanshi: శ్రీలంక ఆటగాడితో వైభవ్ సూర్యవంశీ గొడవ.. కొద్దిగైతే కొట్టేసుకునేవారే.. వీడియో వైరల్!
Vaibhav Sooryavanshi: ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా దంబుల్లా వేదికగా సోమవారం జరిగిన ఇండియా ‘ఎ’, శ్రీలంక ‘ఎ’ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు అసలైన మజాను అందించింది. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ పోరు టైగా ముగియగా.. అనంతరం నిర్వహించిన సూపర్ ఓవర్‌లో శ్రీలంక ‘ఎ’ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే మ్యాచ్ ముగిసిన అనంతరం చోటుచేసుకున్న సంఘటనలు మరింత చర్చనీయాంశంగా మారాయి. భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ.. శ్రీలంక ఆటగాడితో వాగ్వాదానికి దిగాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
అంపైర్లతో పలుమార్లు తీవ్ర చర్చలు:
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా ‘ఎ’ జట్టు 49.2 ఓవర్లలో 265 పరుగులకు ఆలౌటైంది. సుర్యాంశ్ షెడ్జే 72 పరుగులతో జట్టును ఆదుకోగా.. విప్రాజ్ నిగమ్ 51 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 266 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక ‘ఎ’ జట్టు చివరకు 50 ఓవర్లలో 265/9 స్కోరు చేయడంతో మ్యాచ్ టైగా ముగిసింది. మ్యాచ్ టై అయిన తర్వాత సూపర్ ఓవర్ నిర్వహించాలా లేదా అన్న విషయంలో కొంత గందరగోళం నెలకొంది. భారత కెప్టెన్ తిలక్ వర్మ అంపైర్లతో పలుమార్లు తీవ్ర చర్చలు జరిపాడు. ఆపై శ్రీలంక సూపర్ ఓవర్ చివరి బంతికి నో-బాల్ ప్రకటించడంపై తిలక్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు.
ఇద్దరు కొట్టేసుకునేవారే:
సూపర్ ఓవర్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక ‘ఎ’ 16 పరుగులు సాధించింది. 17 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 10 పరుగులకే పరిమితమవడంతో శ్రీలంక విజయం సాధించింది. మ్యాచ్ ముగిసిన అనంతరం పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఓటమి నిరాశలో ఉన్న వైభవ్ సూర్యవంశీ.. శ్రీలంక ‘ఎ’ జట్టుకు చెందిన ఓ ఆటగాడితో వాగ్వాదానికి దిగాడు. ఇద్దరు ఒకరికొకరు చేతులతో నెట్టేసుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తతగా మారుతుండగా.. లంక కీపర్ జోక్యం చేసుకున్నాడు. సూర్యవంశీకి సర్దిచెప్పి పక్కకు తీసుకెళ్లడంతో పరిస్థితి సద్దుమణిగింది. లంక ప్లేయర్స్ మధ్యలోకి రాకుంటే.. ఇద్దరు కొట్టేసుకునేవారే. ఇందుకు సంబందించిన పిక్స్, వీడియోస్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
అద్భుతంగా పోరాడిన భారత్:
ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్ ‘ఎ’ జట్టు అద్భుతంగా పోరాడింది. బౌలర్లు చివరి బంతి వరకు మ్యాచును తీసుకెళ్లారు. అయితే 10 పరుగుల పెనాల్టీ, సూపర్ ఓవర్‌లో జరిగిన చిన్న చిన్న తప్పిదాలు విజయాన్ని దూరం చేశాయి. మరోవైపు శ్రీలంక ‘ఎ’ ఒత్తిడిని తట్టుకుని చివరకు విజయం సాధించి టోర్నీలో కీలకమైన రెండు పాయింట్లు దక్కించుకుంది. ఈ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని తదుపరి మ్యాచ్‌ల్లో బలంగా పుంజుకోవాలని భారత్ ‘ఎ’ జట్టు భావిస్తోంది.




