Vaibhav Sooryavanshi: అందుకేనా వైభవ్ అంతలా రెచ్చిపోతున్నాడు.. విజయ రహస్యం చెప్పేసిన కోచ్!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ వెనుక ఉన్న కఠోర శ్రమను అతని చిన్ననాటి కోచ్ మనీష్ ఓజా తాజాగా వెల్లడించారు.
Vaibhav Sooryavanshi: అందుకేనా వైభవ్ అంతలా రెచ్చిపోతున్నాడు.. విజయ రహస్యం చెప్పేసిన కోచ్!
Vaibhav Sooryavanshi: ప్రపంచ క్రికెట్లో ప్రస్తుతం సంచలనంగా మారిన యువ ఆటగాడు ఎవరంటే.. అందరూ 'వైభవ్ సూర్యవంశీ' అని టక్కున చెప్పేస్తారు. కేవలం 15 ఏళ్ల వయసులోనే దూకుడు బ్యాటింగ్‌తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు.ఐపీఎల్ 2026లో స్టార్ బౌలర్లను కూడా వదలని బుడ్డోడు.. మెరుపు శతకం కూడా బాదాడు. ఐపీఎల్ 2026లో అద్భుత ప్రదర్శన చేసిన వైభవ్.. 776 పరుగులు, 237కు పైగా స్ట్రైక్‌రేట్‌తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ ప్రదర్శనతో భారత జట్టులో చోటు సంపాదించి ఇంగ్లండ్ పర్యటనకు ఎంపికయ్యాడు. అయితే ఈ వైభవ్ వెనుక ఉన్న కఠోర శ్రమను అతని చిన్ననాటి కోచ్ మనీష్ ఓజా తాజాగా వెల్లడించారు.
రోజుకు 8 గంటల ప్రాక్టీస్.. 100 ఓవర్లు బ్యాటింగ్:
వైభవ్ సూర్యవంశీ విజయానికి అసలు కారణం అతను చిన్నప్పటి నుంచి చేసిన కఠిన సాధనేనని కోచ్ మనీష్ ఓజా తెలిపారు. ఎనిమిదేళ్ల వయసు నుంచే తన అకాడమీలో శిక్షణ పొందిన వైభవ్.. రోజుకు సుమారు 8 గంటల పాటు ప్రాక్టీస్ చేసేవాడని చెప్పారు. ఉదయం 7:30 గంటలకు సాధన ప్రారంభమై.. సాయంత్రం 4 గంటల వరకు కొనసాగేదని వెల్లడించారు. ప్రతి రోజు కనీసం 100 ఓవర్లు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసేవాడని, దాదాపు 600కు పైగా బంతులను ఎదుర్కొనేవాడని తెలిపారు. అందులో 200-300 బంతులను తానే స్వయంగా త్రో డౌన్ల రూపంలో వేసేవాడినని.. సపోర్ట్ స్టాఫ్, నెట్ బౌలర్లు కూడా సహకరించేవారని వివరించారు. అవసరమైతే బౌలింగ్ మెషిన్‌తో కూడా ప్రాక్టీస్ చేసేవాడని కోచ్ మనీష్ చెప్పారు.
ఆరు సంవత్సరాల కఠోర శ్రమే విజయానికి పునాది:
వైభవ్ బ్యాటింగ్‌లోని అద్భుతమైన టైమింగ్, భారీ షాట్ల వెనుక ఆరు సంవత్సరాల నిరంతర సాధన ఉందని మనీష్ ఓజా చెప్పారు. ఒకే విధమైన టెక్నిక్‌ను పదేపదే ప్రాక్టీస్ చేయడం వల్ల అతనిలో మసిల్ మెమరీ అభివృద్ధి చెందిందని తెలిపారు. సరైన సాంకేతికతతో, సరైన మార్గదర్శకత్వంలో, అంకితభావంతో చేసిన సాధన ఇప్పుడు అతడిని ప్రపంచ స్థాయి ఆటగాడిగా తీర్చిదిద్దిందన్నారు.
తల్లిదండ్రుల త్యాగాలు మరువలేనివి:
వైభవ్ ఎదుగుదల వెనుక అతని తల్లిదండ్రుల పాత్ర ఎంతో గొప్పదని కోచ్ పేర్కొన్నారు. సమస్తిపూర్ నుంచి పాట్నాలోని అకాడమీకి రోజూ రెండు గంటలకు పైగా ప్రయాణం చేసి శిక్షణకు హాజరవ్వడం చిన్న విషయం కాదన్నారు. వైభవ్ తండ్రి సంజీవ్ తనపై నమ్మకం ఉంచి కొడుకును తన వద్దకు తీసుకువచ్చారని, అందుకు జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పారు. అలాగే వైభవ్ తల్లి ఆర్తి చేసిన త్యాగాలు అసాధారణమని కొనియాడారు. ఆమె ప్రతిరోజూ తెల్లవారుజామున 2 గంటలకే లేచి వైభవ్, అతని తండ్రి, డ్రైవర్, బౌలర్లు సహా 10 నుంచి 15 మందికి సరిపడా భోజనం తయారు చేసేదని గుర్తు చేసుకున్నారు. అకాడమీలో భోజనం లేక ఇబ్బంది పడే పిల్లలకు కూడా ఆహారం అందించేవారని చెప్పారు.
వైభవ్ కోసం తల్లిదండ్రుల పరుగులు:
వైభవ్ విజయాన్ని చూసి ఇప్పుడు దేశవ్యాప్తంగా తల్లిదండ్రులు తమ పిల్లలను క్రికెట్ అకాడమీలకు తీసుకువస్తున్నారని కోచ్ వెల్లడించారు. గతంలో 9-10 ఏళ్ల పిల్లలను తీసుకువచ్చేవారని, ఇప్పుడు ఐదేళ్ల చిన్నారులతో కూడా తల్లిదండ్రులు వస్తున్నారని చెప్పారు. వైభవ్ కేవలం యువ క్రికెటర్లకే కాదు.. దేశవ్యాప్తంగా తల్లిదండ్రులకు కూడా స్ఫూర్తిగా మారాడని పేర్కొన్నారు. కష్టపడితే వయసుతో సంబంధం లేకుండా ప్రపంచ వేదికపై మెరవొచ్చని వైభవ్ నిరూపించాడని అన్నారు.
భారత క్రికెట్‌కు కొత్త ఆశాకిరణం:
ఐపీఎల్లో సంచలన ప్రదర్శనతో ప్రపంచ దృష్టిని ఆకర్షించిన వైభవ్ సూర్యవంశీ.. ఇప్పుడు భారత క్రికెట్ భవిష్యత్తుగా కనిపిస్తున్నాడు. చిన్న వయసులోనే క్రమశిక్షణ, కఠోర శ్రమ, కుటుంబ మద్దతుతో సాధించిన ఈ విజయం యువ క్రీడాకారులకు ఆదర్శంగా నిలుస్తోంది. ప్రపంచ క్రికెట్లో కొత్త సూపర్ స్టార్‌గా ఎదుగుతున్న వైభవ్ ప్రయాణం ఇప్పుడే ప్రారంభమైంది. భారత క్రికెట్లో గొప్ప ఆటగాడిగా ఎదిగాలని ఫాన్స్ కోరుకుంటున్నారు.




