Vaibhav Sooryavanshi: టీ20ల్లో 200 రన్స్ చేస్తా.. ప్రపంచ క్రికెట్‌కు సూర్యవంశీ హెచ్చరిక!
Vaibhav Sooryavanshi: భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించాడు.
Vaibhav Sooryavanshi: టీ20ల్లో 200 రన్స్ చేస్తా.. ప్రపంచ క్రికెట్‌కు సూర్యవంశీ హెచ్చరిక!
Vaibhav Sooryavanshi: భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే తన విధ్వంసక బ్యాటింగ్‌తో సంచలనం సృష్టిస్తున్న ఈ యువ ఆటగాడు.. ఇప్పుడు టీ20 క్రికెట్ చరిత్రలోనే ఎవరికీ సాధ్యంకాని లక్ష్యాన్ని టార్గెట్‌గా పెట్టుకున్నాడు. టీ20ల్లో డబుల్ సెంచరీ (200 రన్స్) చేయాలనేదే తన కల అని వైభవ్ బహిరంగంగా ప్రకటించాడు. ప్రస్తుతం టీ20 క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌గా ఉన్న యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ 175 పరుగుల రికార్డును బద్దలు కొట్టి.. 200 పరుగులు చేయాలని తాను లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపాడు.
ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ నిర్వహించే ‘ది స్విచ్’ షోలో పాల్గొన్న వైభవ్ సూర్యవంశీ తన లక్ష్యాలను వెల్లడించాడు. ‘టీ20ల్లో 200 పరుగులు చేయాలని ఉంది’ అని వైభవ్ చెప్పగా.. వెంటనే పీటర్సన్ ‘క్రిస్ గేల్ 175 చేశాడు’ అని గుర్తు చేశాడు. దీనికి స్పందించిన వైభవ్.. ‘అవును.. ఆ రికార్డును నేను బ్రేక్ చేయాలనుకుంటున్నాను. ఒక మ్యాచ్‌లో పూర్తిగా 20 ఓవర్లు బ్యాటింగ్ చేసే అవకాశం వస్తే.. ఖచ్చితంగా 200 పరుగులు చేస్తాను’ అంటూ ధీమా వ్యక్తం చేశాడు.
ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఐపీఎల్ 2013లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడుతూ.. పుణె వారియర్స్‌పై గేల్ 175 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. పీటర్సన్ తన షోలో 50 బంతుల్లో 100 పరుగులు చేయాలని ఛాలెంజ్ విసిరగా.. బుడ్డోడు కేవలం 25 బంతుల్లోనే శతకం బాదేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను పీటర్సన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో రిలీజ్ చేశాడు. గతంలో ఇదే షోలో పాల్గొన్న శ్రేయస్ అయ్యర్ 22 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు.
200 పరుగులు చేస్తాను అని చెప్పిన వైభవ్ సూర్యవంశీ ఆత్మవిశ్వాసానికి కారణం కూడా ఉంది. ఇప్పటికే అతడు పలు అద్భుత ఇన్నింగ్స్‌లతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. అండర్-19 వరల్డ్‌కప్ ఫైనల్లో 175 పరుగులు బాదిన వైభవ్.. విజయ్ హజారే ట్రోఫీలో బిహార్ తరఫున 190 పరుగుల భారీ ఇన్నింగ్స్ ఆడాడు. ప్రస్తుతం టీ20ల్లో అతడి అత్యధిక వ్యక్తిగత స్కోర్ 144గా ఉంది. గత ఏడాది ఇంగ్లాండ్ అండర్-19 జట్టుపై కేవలం 52 బంతుల్లో 143 పరుగులు చేసి యువ వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డును వైభవ్ సృష్టించాడు. అలాగే ఏసీసీ మెన్స్ అండర్-19 ఆసియా కప్‌లో యూఏఈపై శతకం బాది.. భారత ఆటగాళ్లలో అత్యంత వేగవంతమైన టీ20 సెంచరీలు చేసిన జాబితాలో రిషభ్ పంత్, అభిషేక్ శర్మ సరసన చోటు దక్కించుకున్నాడు.
ఐపీఎల్ 2026లో కూడా వైభవ్ సూర్యవంశీ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున వరుసగా విధ్వంసక ఇన్నింగ్స్‌లు ఆడుతూ అందరి ప్రశంసలు అందుకున్నాడు. అతడి బ్యాటింగ్ చూసిన తర్వాత భవిష్యత్తులో క్రిస్ గేల్ రికార్డు కూడా బద్దలు కానుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో అత్యంత ప్రతిభావంతమైన యువ ఆటగాడిగా గుర్తింపు పొందుతున్న వైభవ్.. తన లక్ష్యాలతో ప్రత్యర్థి బౌలర్లకు ముందుగానే భారీ హెచ్చరిక పంపినట్టే కనిపిస్తోంది.




