Sourav Ganguly: షాకింగ్.. సౌరవ్ గంగూలీపై అవినీతి ఆరోపణలు!
Sourav Ganguly: పశ్చిమ బెంగాల్ క్రికెట్ రాజకీయాల్లో మరోసారి వేడి రాజుకుంది.
Sourav Ganguly: షాకింగ్.. సౌరవ్ గంగూలీపై అవినీతి ఆరోపణలు!
Sourav Ganguly: పశ్చిమ బెంగాల్ క్రికెట్ రాజకీయాల్లో మరోసారి వేడి రాజుకుంది. టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ నేతృత్వంలోని ప్రస్తుత క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (క్యాబ్) యాజమాన్యం, మాజీ అధ్యక్షుడు అవిషేక్ దాల్మియా మధ్య నెలకొన్న విభేదాలు బయటపడ్డాయి. అవినీతి, పరిపాలనా వైఫల్యాలపై దాల్మియా చేసిన ఆరోపణలకు క్యాబ్ ఘాటుగా సమాధానం ఇచ్చింది. సెప్టెంబర్‌లో జరగనున్న వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)కు ముందు ఈ వివాదం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.
క్రీడల్లో అవినీతి, అక్రమాలపై దర్యాప్తు జరిపే రాష్ట్ర ప్రభుత్వ స్పోర్ట్స్ ఇంటిగ్రిటీ అండ్ యాంటీ కరప్షన్ హెల్ప్‌లైన్‌ను ఇటీవల అవిషేక్ దాల్మియా ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. బెంగాల్ క్రికెట్‌లో అవినీతి, ఎంపికల్లో పారదర్శకత లోపం, వ్యవస్థలో లోపాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను క్యాబ్ ఖండించింది. సౌరవ్ గంగూలీ, కార్యదర్శి బాబ్లు కొలే సహా పలువురు అధికారులు సంతకం చేసిన మూడు పేజీల లేఖను పశ్చిమ బెంగాల్ క్రీడాశాఖ మంత్రి ఇంద్రనీల్ ఖాన్‌కు పంపించారు. అందులో అవిషేక్ ఆరోపణలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయని పేర్కొన్నారు.
క్యాబ్ తన లేఖలో సౌరవ్ గంగూలీ పరిపాలనా సామర్థ్యాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది. భారత జట్టు కెప్టెన్‌గా, క్యాబ్ అధ్యక్షుడిగా, బీసీసీఐ అధ్యక్షుడిగా, ఐసీసీ చైర్మన్‌గా పనిచేసిన గంగూలీపై ఇప్పటివరకు ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవని స్పష్టం చేసింది. అలాగే క్యాబ్‌లో ఇప్పటికే సుప్రీంకోర్టు ఆమోదించిన లోధా సంస్కరణల ప్రకారం.. అంబుడ్స్‌మన్, ఎథిక్స్ ఆఫీసర్ వ్యవస్థ ఉందని గుర్తు చేసింది.
మాజీ కోల్‌కతాహైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జ్యోతిర్మయ్ భట్టాచార్య ఈ బాధ్యతలు నిర్వహిస్తున్నారని, ఎవరైనా ఆధారాలతో ఫిర్యాదు చేస్తే నిష్పక్షపాతంగా విచారణ జరుగుతుందని పేర్కొంది. 'పటిష్ట వ్యవస్థ ఉన్నప్పటికీ అవిషేక్ దాల్మియా నేరుగా బహిరంగ లేఖలు రాయడం ఆశ్చర్యకరం. ఆయన స్వయంగా గతంలో క్యాబ్ కార్యదర్శిగా, అధ్యక్షుడిగా పనిచేసిన సమయంలో ఇదే వ్యవస్థ గురించి ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు' అని క్యాబ్ తన లేఖలో పేర్కొంది.
గత మూడు దశాబ్దాల్లో బి.ఎన్. దత్, జగ్‌మోహన్ దాల్మియా, సౌరవ్ గంగూలీ, అవిషేక్ దాల్మియా వంటి నేతల హయాంలో క్యాబ్‌పై ఎప్పుడూ వ్యవస్థాగత అవినీతి ఆరోపణలు రాలేదని కూడా గుర్తు చేసింది. ఒకే ఒక పాలన కాలంలో (అవిషేక్ కాలంలో) అన్నీ సక్రమంగా జరిగాయని, మిగతా పాలనలో లోపాలే ఉన్నాయని చెప్పడం సమంజసం కాదని వ్యాఖ్యానించింది. అవిషేక్ చేసిన ఫిర్యాదు నేపథ్యంలో క్యాబ్ కమిటీ సభ్యుడు అంబరీష్ మిత్రపై వచ్చిన ఆరోపణలు కూడా చర్చనీయాంశమయ్యాయి.
జట్టులో అవకాశాల కోసం కొందరు క్రికెటర్ల నుంచి డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు ఉన్నాయూయి. వాటిని మిత్ర ఖండించారు. మొత్తంగా చూస్తే.. బెంగాల్ క్రికెట్ పరిపాలనలో మళ్లీ రెండు వర్గాల మధ్య పోరు ప్రారంభమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. ఏజీఎం సమీపిస్తున్న తరుణంలో ఈ వివాదం మరింత ముదిరే అవకాశాలు ఉన్నాయని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి.




