టీమిండియా నుంచి పీకేశాడు, ఆ తర్వాత నాకే కోచ్‌గా రావాలనుకున్నాడు.. గంగూలీ సంచలన వ్యాఖ్యలు!
Sourav Ganguly: Sourav Ganguly on Greg Chappell Email. భారత క్రికెట్ చరిత్రలో అత్యంత వివాదాస్పద కోచ్-కెప్టెన్ జోడీ గంగూలీ, చాపెల్.
టీమిండియా నుంచి పీకేశాడు, ఆ తర్వాత నాకే కోచ్‌గా రావాలనుకున్నాడు.. గంగూలీ సంచలన వ్యాఖ్యలు!
Sourav Ganguly: భారత క్రికెట్ చరిత్రలో అత్యంత వివాదాస్పద కోచ్-కెప్టెన్ జోడీ ఏదంటే.. అందరూ సౌరవ్ గంగూలీ, గ్రెగ్ చాపెల్ అని టక్కున చెప్పేస్తారు. ఈ వివాదాస్పద జోడీ మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఒకప్పుడు తనను భారత జట్టు నుంచి తప్పించడంలో కీలక పాత్ర పోషించిన చాపెల్.. తర్వాత తనకే కోచ్‌గా రావాలని కోరాడని గంగూలీ తాజాగా వెల్లడించాడు. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన దాదా.. 2011లో తనకు చాపెల్ నుంచి వచ్చిన ఓ ఈమెయిల్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఆ సమయంలో తాను కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) కెప్టెన్‌గా ఉన్నానని, ఇంగ్లండ్‌లోని తన ఇంట్లో ఒక ఉదయం ఈమెయిల్స్ చెక్ చేస్తుండగా చాపెల్ నుంచి మెయిల్ వచ్చిందని చెప్పాడు.
'గ్రెగ్ చాపెల్ నుంచి వచ్చిన మెయిల్ చూసిన నేను ఒక్కసారిగా ఆశ్చర్యపోయాను. నిజంగానే గ్రెగ్ చాపెల్ పంపాడా? లేదా నకిలీ మెయిల్? హా అని అనుమానం వచ్చింది. పేరు, ఈమెయిల్ ఐడీ అన్నీ మరోసారి చెక్ చేశాను. ఎందుకంటే ఇలాంటి ఫేక్ మెయిల్స్ చాలానే వస్తుంటాయి. అన్ని చెక్ చేశాక చాపెల్ మెయిల్ అని నిర్ధారణకు వచ్చాను. ఆ మెయిల్లోని విషయం మరింత షాకింగ్‌గా అనిపించింది. అతను కేకేఆర్‌కు కోచ్‌గా రావాలని కోరాడు. అంతేకాదు నేను కెప్టెన్‌గా ఉండే జట్టుకే కోచ్ కావాలని చెప్పాడు' అంటూ గంగూలీ నవ్వుతూ చెప్పాడు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
ఈ విషయంపై సౌరవ్ గంగూలీ సరదాగా స్పందిస్తూ.. 'ఈ విషయం విన్న వాళ్లు దాదా అంత అమాయకుడు కాదులే అనుకుంటారు. ఒకసారి మోసపోయి ఉండొచ్చు కానీ రెండోసారి మళ్లీ అదే తప్పు చేయడు కదా' అని చమత్కరించాడు. అయితే విధి వేరేలా నిర్ణయించింది. 2011 ఐపీఎల్ మెగా వేలానికి ముందు కేకేఆర్ గంగూలీని విడుదల చేసింది. ఆ వేలంలో కూడా ఆయనను ఏ జట్టు కొనుగోలు చేయలేదు. అనంతరం పుణే వారియర్స్ ఇండియా తరఫున 2011, 2012 సీజన్లలో ఆడాడు. మరోవైపు కేకేఆర్ గౌతమ్ గంభీర్‌ను భారీ ధరకు కొనుగోలు చేసి కెప్టెన్‌గా నియమించింది.
2000లలో ఆస్ట్రేలియా కోచ్‌లతో సౌరవ్ గంగూలీకి సంబంధాలు అంతగా సాఫీగా సాగలేదు. భారత జట్టులో గ్రెగ్ చాపెల్‌తో వివాదం కారణంగా జట్టులో స్థానం కోల్పోయిన గంగూలీ.. 2009లో కేకేఆర్ కోచ్ జాన్ బుకానన్ హయాంలో కూడా కెప్టెన్సీ నుంచి తప్పించబడ్డాడు. తనకు, గ్రెగ్ చాపెల్‌కు మధ్య సంబంధాల గురించి మాట్లాడిన గంగూలీ.. ఇప్పటికీ ఆయన పంపే సందేశాలకు స్పందించనని స్పష్టం చేశాడు. 'నిజాయితీగా లేని వ్యక్తులతో నేను మాట్లాడను. అందుకే ఆయన మెసేజ్‌లకు సమాధానం ఇవ్వను' అని గంగూలీ తేల్చి చెప్పాడు.
భారత క్రికెట్ చరిత్రలో ఎన్నో వివాదాలకు కేంద్రబిందువైన గంగూలీ-చాపెల్ వ్యవహారం ముగిసి చాలా సంవత్సరాలు గడిచింది. అయినా ఇద్దరి మధ్య ఉన్న విభేదాలు ఇంకా పూర్తిగా తొలగిపోలేదని గంగూలీ తాజాగా చేసిన వ్యాఖ్యలు మరోసారి స్పష్టం చేస్తున్నాయి. భారత జట్టులో చాపెల్ ఎన్నో ప్రయోగాలు చేశాడు. ఆ సమయంలో ఆస్ట్రేలియా క్రికెట్ ఆటను శాసిస్తోంది. అప్పుడు భారత్ మాత్రమే ఆసీస్ జట్టుకు కాస్త పోటీగా నిలిచేది. ఆ సమయంలో టీమిండియాను మరింత కిందికి దిగజార్చాడు చాపెల్. ఆ తర్వాత ఆసీస్ ప్లేయర్స్ ఎవరూ టీమిండియా కోచింగ్ బృందంలోకి రాలేదు.




