Sourav Ganguly: ఇది నా జీవితంలోనే అరుదైన గౌరవం.. సౌరవ్ గంగూలీ భావోద్వేగం!

Sourav Ganguly gets ICC Hall of Fame on his 54th birthday. టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి అరుదైన గౌరవం దక్కింది

Rishvik
Published on: 8 July 2026 10:11 PM IST
Sourav Ganguly
X

Sourav Ganguly: ఇది నా జీవితంలోనే అరుదైన గౌరవం.. సౌరవ్ గంగూలీ భావోద్వేగం!

Sourav Ganguly: టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) 'హాల్ ఆఫ్ ఫేమ్‌'లో దాదాకు చోటు దక్కింది. ఈ సందర్భంగా ఆనందం వ్యక్తం చేసిన గంగూలీ.. ఐసీసీతో పాటు ఛైర్మన్ జే షాకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. తన 54వ పుట్టినరోజు రోజునే ఈ గౌరవం దక్కడం జీవితాంతం గుర్తుండిపోయే క్షణమని కోల్‌కతా ప్రిన్స్ పేర్కొన్నారు. ఈ విషయాన్ని దాదా సోషల్ మీడియా వేదికగా కాస్త ముందుగానే వెల్లడించగా.. ఐసీసీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఐసీసీ 'హాల్ ఆఫ్ ఫేమ్‌'లో చోటు దక్కడంపై సౌరవ్ గంగూలీ స్పందిస్తూ... 'నన్ను ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చేర్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఐసీసీకి, ఛైర్మన్ జే షాకు నా ధన్యవాదాలు. ఇది నాకు ఎంతో గొప్ప గౌరవం. హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కిన భారత క్రికెటర్లలో నేను పదో ఆటగాడిని కావడం చాలా ఆనందంగా ఉంది. ప్రపంచ క్రికెట్ దిగ్గజాల సరసన నిలవడం నిజంగా అద్భుతమైన అనుభూతి. దానిని మాటల్లో చెప్పలేను' అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నేడు దాదా 54వ పుట్టినరోజు. ఈరోజునే 'దాదా: ది సౌరవ్ గంగూలీ స్టోరీ' పేరుతో తెరకెక్కుతున్న బయోపిక్ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. దాంతో దాదాకు డబుల్ ట్రీట్ అనే చెప్పాలి.

క్రికెట్ చరిత్రలో అసాధారణ సేవలు అందించిన ఆటగాళ్లను గౌరవించేందుకు ఐసీసీ 2009లో హాల్ ఆఫ్ ఫేమ్‌ను ప్రారంభించింది. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఐదేళ్ల తర్వాత మాత్రమే ఆటగాళ్లకు ఈ జాబితాలో చోటు దక్కుతుంది. ప్రపంచ క్రికెట్‌పై చిరస్థాయిగా ముద్ర వేసిన దిగ్గజాలకే ఈ అరుదైన గౌరవం లభిస్తుంది. మ్యాచ్ ఫిక్సింగ్ వివాదాల అనంతరం అత్యంత క్లిష్ట సమయంలో భారత జట్టు పగ్గాలు చేపట్టిన సౌరవ్ గంగూలీ.. భారత జట్టు ఆలోచనా విధానాన్నే మార్చేశారు. విదేశాల్లో కూడా పోరాడే జట్టుగా భారత్‌ను తీర్చిదిద్దారు. దూకుడు నాయకత్వం, ఆత్మవిశ్వాసాన్ని నింపిన కెప్టెన్‌గా దాదా ప్రత్యేక గుర్తింపు పొందారు. అద్భుత కవర్ డ్రైవ్‌లతో అభిమానులను అలరించిన దాదాకు 'గాడ్ ఆఫ్ ఆఫ్‌సైడ్' అనే బిరుదు కూడా ఉంది.

సౌరవ్ గంగూలీ తన అంతర్జాతీయ కెరీర్‌లో 424 మ్యాచ్‌లు ఆడారు. మూడు ఫార్మాట్లలో కలిపి మొత్తంగా 18,575 పరుగులు చేశారు. ఇందులో 38 సెంచరీలు, 107 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 113 టెస్టుల్లో 7,212 పరుగులు.. 311 వన్డేల్లో 11,363 పరుగులు చేశారు. భారత క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ బ్యాటర్లలో దాదా ఒకరిగా నిలిచారు. ఇక కెప్టెన్‌గా 196 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో భారత్‌కు నాయకత్వం వహించి.. 97 విజయాలు అందించారు. దాదా నాయకత్వంలోనే 2001లో స్టీవ్ వా నేతృత్వంలోని ఆస్ట్రేలియాపై బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ విజయం, 2003 ప్రపంచకప్ ఫైనల్‌కు చేరడం, 2004లో పాకిస్థాన్ గడ్డపై తొలి టెస్టు సిరీస్ విజయం వంటి ఎన్నో చిరస్మరణీయ విజయాలు భారత్ సాధించింది. ఎంఎస్ ధోనీ, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్, ఇర్ఫాన్ పఠాన్, గౌతమ్ గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్ వంటి యువ ఆటగాళ్లను ప్రోత్సహించి.. భారత క్రికెట్ భవిష్యత్తుకు బలమైన పునాదులు వేసిన కెప్టెన్‌గా కూడా దాదా పేరు భారత క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story