దేశద్రోహి, ఫిక్సర్ అంటూ దూషించాడు.. గౌతమ్ గంభీర్‌పై మాజీ పేసర్ సంచలన ఆరోపణలు!

Sreesanth Slams Gautam Gambhir: భారత మాజీ ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు.

Rishvik
Published on: 20 Jun 2026 5:46 PM IST
Sreesanth Slams Gautam Gambhir
X

దేశద్రోహి, ఫిక్సర్ అంటూ దూషించాడు.. గౌతమ్ గంభీర్‌పై మాజీ పేసర్ సంచలన ఆరోపణలు!

Sreesanth vs Gambhir: భారత మాజీ ఫాస్ట్ బౌలర్ ఎస్. శ్రీశాంత్ మరోసారి టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. 2023 డిసెంబర్‌లో జరిగిన లెజెండ్స్ లీగ్ క్రికెట్ (ఎల్ఎల్సీ) మ్యాచ్ సందర్భంగా తమ మధ్య చోటుచేసుకున్న వాగ్వాదానికి సంబంధించిన మరిన్ని విషయాలను తాజాగా వెల్లడించాడు. గతంలో గంభీర్ తనను 'ఫిక్సర్' అని పిలిచాడని ఆరోపించిన శ్రీశాంత్.. ఇప్పుడు 'దేశద్రోహి' అంటూ కూడా అవమానించాడని పేర్కొన్నాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన శ్రీశాంత్.. ఎల్ఎల్సీ మ్యాచ్ ఘటన ఎలా జరిగిందో వివరించాడు.

'మ్యాచ్‌లో గౌతమ్ గంభీర్ తొలి బంతికే ముందుకొచ్చి షాట్ ఆడాడు. అతను చాలా మంచి క్రికెటర్. అందులో ఎలాంటి సందేహం లేదు. గంభీర్ ఆట గురించి నాకు బాగా తెలుసు. అందుకే తర్వాతి బంతిని బౌన్సర్‌గా వేశాను. ఆ సమయంలో అతను ఓ మాట అంటూ నన్ను దూషించాడు. అంతటితో ఆగకుండా ఫిక్సర్ అని పిలిచాడు. అప్పుడు నేను బాగానే ఉన్నావా గౌతీ భాయ్ అని అడిగాను. నేను అతడి దగ్గరకు వెళ్లడంతో కొట్టడానికి వస్తున్నానని అనుకున్నాడేమో. ఆ తర్వాత అసభ్య పదజాలంతో దూషిస్తూ మళ్లీ మళ్లీ ఫిక్సర్, దేశద్రోహి అని అన్నాడు' అని శ్రీశాంత్ పేర్కొన్నాడు.

గౌతమ్ గంభీర్, శ్రీశాంత్ ఇద్దరూ కలిసి 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో సభ్యులుగా ఉన్నారు. అయితే ఆటగాళ్లుగా రిటైర్ అయిన తర్వాత వీరిద్దరి మధ్య సంబంధాలు దెబ్బతిన్నట్లు ఈ ఘటనతో తెలుస్తోంది. గంభీర్ చేసిన వ్యాఖ్యలు 2013 ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసును ఉద్దేశించినవే. ఆ కేసులో శ్రీశాంత్‌పై తొలుత బీసీసీఐ జీవితకాల నిషేధం విధించింది. అనంతరం ఆ శిక్షను ఏడేళ్లకు తగ్గించడంతో.. 2020లో మళ్లీ క్రికెట్ ఆడే అవకాశం లభించింది. కరోనా అనంతరం 2023లో లెజెండ్స్ లీగ్ క్రికెట్ జరగగా.. గంభీర్, శ్రీశాంత్ ప్రత్యర్థులుగా తలపడ్డారు.

గౌతమ్ గంభీర్‌ను ప్రధాన కోచ్‌గా తప్పించి.. ఎంఎస్ ధోనీని భారత జట్టుకు మెంటార్‌గా చేయాలని శ్రీశాంత్ తాజాగా వ్యాఖ్యానించాడు. ఇపుడు ఏకంగా గౌతీపైనే విమర్శలు చేశాడు. ప్రస్తుతం గౌతమ్ గంభీర్ భారత పురుషుల జాతీయ జట్టు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. అతని కోచింగ్‌లో భారత్ ఇప్పటికే 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ, 2026 టీ20 ప్రపంచకప్‌లను గెలుచుకుని విజయవంతమైన జట్టుగా నిలిచింది. అయితే శ్రీశాంత్ చేసిన తాజా ఆరోపణలపై గంభీర్ ఇప్పటివరకు స్పందించలేదు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు భారత క్రికెట్ వర్గాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారాయి.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story