David Warner: డేవిడ్ వార్నర్‌ను బ్లాక్ చేసిన సన్‌రైజర్స్.. స్క్రీన్ షాట్లతో గుట్టురట్టు

David Warner: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ, తమ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌ను సోషల్ మీడియాలో బ్లాక్ చేయడం ఇప్పుడు ఐపీఎల్ క్రికెట్ వర్గాల్లో సంచలనంగా మారింది.

Naresh.k
Published on: 25 May 2026 7:06 AM IST
David Warner
X

David Warner: డేవిడ్ వార్నర్‌ను బ్లాక్ చేసిన సన్‌రైజర్స్.. స్క్రీన్ షాట్లతో గుట్టురట్టు

Sunrisers Hyderabad: ఐపీఎల్‌లో కావ్య మారన్ నేతృత్వంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ, ఆ జట్టుకు ఏకైక ఐపీఎల్ కప్‌ను అందించిన మాజీ కెప్టెన్, ఆస్ట్రేలియా దిగ్గజం డేవిడ్ వార్నర్ మధ్య కోల్డ్ వార్ మరోసారి ముదిరింది. తనను ఎస్‌ఆర్‌హెచ్ మేనేజ్‌మెంట్ సోషల్ మీడియాలో బ్లాక్ చేసిందంటూ వార్నర్ స్వయంగా స్క్రీన్ షాట్లతో సహా బయటపెట్టడం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో తీవ్ర దుమారాన్ని రేపుతోంది.

అసలేం జరిగిందంటే..?

ప్రస్తుత సన్‌రైజర్స్ ఓపెనర్, తన తోటి ఆస్ట్రేలియా ఆటగాడు కమిన్స్ నాయకత్వంలో జట్టు ఆడుతున్న విధ్వంసకర ఇన్నింగ్స్‌లను అభినందిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక స్టోరీ పెట్టడానికి వార్నర్ ప్రయత్నించాడు. అందుకోసం SRH అధికారిక పేజీని ట్యాగ్ చేయబోగా.. ఆ పేజీ అతనికి కనిపించలేదు. దాంతో తాను బ్లాక్‌కు గురైన విషయాన్ని గ్రహించిన వార్నర్, ఆ స్క్రీన్ షాట్లను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.ఒకప్పుడు నేను ప్రాణంగా ప్రేమించిన, నా రక్తం చిందించిన ఫ్రాంచైజీ నన్ను ఇలా బ్లాక్ చేయడం బాధాకరం అనే భావన ఈ ఘటనతో వార్నర్ అభిమానుల్లో వ్యక్తమవుతోంది.

ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో వార్నర్

హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు డేవిడ్ వార్నర్ అంటే కేవలం ఒక విదేశీ ఆటగాడు మాత్రమే కాదు.. అతడు వారి గుండె చప్పుడు. 2016లో అద్భుతమైన కెప్టెన్సీ, బ్యాటింగ్‌తో ఒంటిచేత్తో సన్‌రైజర్స్‌కు ఏకైక ఐపీఎల్ టైటిల్‌ను అందించాడు. ఎస్‌ఆర్‌హెచ్ తరఫున ఆడినన్ని రోజులు ఆరెంజ్ క్యాప్‌ను తన ఇంటి పేరుగా మార్చుకున్నాడు. మైదానంలో ఆటతోనే కాకుండా.. బుట్టబొమ్మ సాంగ్‌కు డ్యాన్స్ చేస్తూ, తెలుగు డైలాగులు చెప్తూ హైదరాబాద్‌కు దత్తపుత్రుడు అయిపోయాడు.

వివాదానికి బీజం పడింది ఇక్కడే..

2021 సీజన్‌లో వార్నర్ ఫామ్ కోల్పోవడంతో ఎస్‌ఆర్‌హెచ్ మేనేజ్‌మెంట్ అతనిపై కఠినంగా వ్యవహరించింది. సీజన్ మధ్యలోనే కెప్టెన్సీ నుంచి తొలగించడమే కాకుండా, కనీసం డగౌట్‌లో కూడా కూర్చోనివ్వకుండా హోటల్ రూమ్‌కే పరిమితం చేసింది. ఆ తర్వాత మెగా వేలంలో అతన్ని వదిలేశారు. ఆ సమయంలోనే ఫ్రాంచైజీకి, వార్నర్‌కు మధ్య సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. అప్పుడే మేనేజ్‌మెంట్ అతని ఖాతాను బ్లాక్ చేసి ఉంటుందని స్పష్టమవుతోంది.

అభిమానుల ఆగ్రహం

ఈ బ్లాకింగ్ వ్యవహారం బయటకు రావడంతో ఎస్‌ఆర్‌హెచ్ అభిమానులు, నెటిజన్లు ఫ్రాంచైజీ యాజమాన్యం తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ట్రోఫీలు రావచ్చు, పోవచ్చు.. కానీ ఒక లెజెండ్‌కు ఇచ్చే గౌరవం ఇదేనా? అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీని సోషల్ మీడియాలో అన్‌ఫాలో చేయాలంటూ కొందరు అభిమానులు ప్రచారం కూడా మొదలుపెట్టారు. జట్టు కోసం రక్తం, చెమట ధారపోసిన ఆటగాడిని ఇలా అవమానించడం ఫ్రాంచైజీ సంస్కృతికే మచ్చ తెస్తోందని విమర్శిస్తున్నారు.

Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story