IPL 2026 : రాజస్థాన్ రాయల్స్ విజయయాత్రకు బ్రేక్.. అరంగేట్రం మ్యాచ్‌లోనే ప్రళయం సృష్టించిన ప్రఫుల్
IPL 2026 : ఐపీఎల్ 2026లో హైదరాబాద్ సంచలన విజయం అందుకుంది. ప్రఫుల్ హింగే డెబ్యూ మ్యాచ్‌లోనే 4 వికెట్లతో రాజస్థాన్‌ను దెబ్బకొట్టాడు. ఈషాన్ కిషన్ 91 పరుగులతో చెలరేగాడు.
IPL 2026 SRH vs RR
IPL 2026 : ఐపీఎల్ 2026 సీజన్‌లో అప్రతిహత విజయాలతో దూసుకుపోతున్న రాజస్థాన్ రాయల్స్ విజయయాత్రకు బ్రేక్ పడింది. వరుసగా నాలుగు మ్యాచ్‌లు గెలిచి టేబుల్ టాపర్‌గా ఉన్న రాజస్థాన్, సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో అనూహ్యంగా చిత్తయ్యింది. ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన ఈ పోరులో హైదరాబాద్ కొత్త కుర్రాడు ప్రఫుల్ హింగే తన అరంగేట్రం మ్యాచ్‌లోనే చరిత్ర సృష్టించాడు. కేవలం ఒకే ఒక్క ఓవర్‌లో రాజస్థాన్ బ్యాటింగ్ వెన్ను విరిచేసి, హైదరాబాద్‌కు 57 పరుగుల భారీ విజయాన్ని అందించాడు.
హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే తొలి బంతికే స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ అవుట్ కావడంతో స్టేడియం ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది. కానీ కెప్టెన్ ఈషాన్ కిషన్ ఏమాత్రం బెదరకుండా రాజస్థాన్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. కేవలం 30 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన ఈషాన్, మొత్తం 44 బంతుల్లో 91 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరును అందించాడు. హెన్రిచ్ క్లాసెన్ (40)తో కలిసి మూడో వికెట్‌కు 88 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. చివర్లో నితీష్ రెడ్డి, సలిల్ అరోరా మెరుపులు మెరిపించడంతో హైదరాబాద్ నిర్ణీత ఓవర్లలో 217 పరుగుల భారీ స్కోరు సాధించింది.
218 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్‌కు తొలి ఓవర్‌లోనే ఊహించని షాక్ తగిలింది. తన మొదటి మ్యాచ్ ఆడుతున్న యువ పేసర్ ప్రఫుల్ హింగే రెండో బంతికే ఫామ్ లో ఉన్న వైభవ్ సూర్యవంశీని పెవిలియన్ పంపాడు. అక్కడితో ఆగకుండా అదే ఓవర్‌లో ధ్రువ్ జురెల్ సహా మరో రెండు వికెట్లు పడగొట్టి చరిత్ర సృష్టించాడు. దీంతో రాజస్థాన్ ఒక్క పరుగు కూడా చేయకుండానే మూడు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత మరో కొత్త బౌలర్ సాకిబ్ కూడా తన తొలి ఓవర్‌లోనే వికెట్ తీయడంతో రాజస్థాన్ కష్టాలు రెట్టింపు అయ్యాయి. కేవలం 9 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి రాయల్స్ దారుణమైన స్థితికి చేరుకుంది.
పీకల్లోతు కష్టాల్లో ఉన్న రాజస్థాన్‌ను డోనోవన్ ఫెరీరా (69), రవీంద్ర జడేజా (45) ఆదుకున్నారు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 122 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో రాజస్థాన్ కోలుకున్నట్లు కనిపించింది. అయితే, మరో డెబ్యూ బౌలర్ సాకిబ్ ఈ భాగస్వామ్యాన్ని విడదీయడంతో రాజస్థాన్ కథ ముగిసింది. సాకిబ్ కూడా 4 వికెట్లతో చెలరేగడంతో రాజస్థాన్ 159 పరుగులకే ఆలౌట్ అయ్యింది. మొత్తానికి ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 57 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి, రాజస్థాన్ ఓటమి లేని ప్రస్థానానికి అడ్డుకట్ట వేసింది.




