SRH vs RR: ఉప్పల్‌లో హై వోల్టేజ్ మ్యాచ్.. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు!

SRH vs RR: హైదరాబాద్, రాజస్థాన్ మ్యాచ్‌కు సంబంధించిన ఏర్పాట్లు కూడా కట్టుదిట్టంగా ఉన్నాయి.

Rishvik
Published on: 13 April 2026 6:30 PM IST
SRH vs RR
X

SRH vs RR: ఉప్పల్‌లో హై వోల్టేజ్ మ్యాచ్.. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు!

SRH vs RR: ఐపీఎల్ 2026లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య ఉప్పల్ స్టేడియం వేదికగా మరికొద్దిసేపట్లో హై వోల్టేజ్ మ్యాచ్ ఆరంభం కానుంది. రాత్రి 7 గంటలకు టాస్ పడనుండగా.. 7.30కు మ్యాచ్ మొదలవుతుంది. ప్రస్తుతం అద్భుత ఫామ్‌లో ఉన్న రాజస్థాన్ టేబుల్ టాపర్‌గా కొనసాగుతూ అజేయంగా దూసుకెళ్తోంది. ఐదవ విజయాన్ని ఖాతాలో వేసుకోవాలని లక్ష్యంగా ఉంది. మరోవైపు నాలుగు మ్యాచ్‌ల్లో మూడు ఓటములతో నిరాశలో ఉన్న సన్‌రైజర్స్.. హోమ్ గ్రౌండ్‌లో తొలి విజయాన్ని అందుకోవాలని చూస్తోంది.

రాజస్థాన్ రాయల్స్ తరఫున 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అతనితో పాటు యశస్వి జైస్వాల్ కూడా దుమ్మురేపుతున్నాడు. రాజస్థాన్ బౌలింగ్ కూడా బాగుంది. అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్న ఆర్ఆర్.. ఈ మ్యాచ్‌లో ఫెవరేట్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరోవైపు సన్‌రైజర్స్ బ్యాటింగ్ విభాగం పర్వాలేదనిపిస్తున్నప్పటికీ.. బౌలింగ్ విభాగం మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోతోంది. బుడ్డోడు వైభవ్ ధాటిని మన బౌలర్లు ఎలా అడ్డుకున్నారన్నదే ఇపుడు ఆసక్తిగా ఉంది. ఉప్పల్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే అవకాశం ఉండటంతో.. ఈ మ్యాచ్‌లో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. రెండు జట్లలోనూ హార్డ్ హిట్టర్స్ ఎక్కువగా ఉండటంతో ప్రేక్షకులకు హోరాహోరీ పోరు చూడొచ్చు.

ఇక ఈ మ్యాచ్‌కు సంబంధించిన ఏర్పాట్లు కూడా కట్టుదిట్టంగా ఉన్నాయి. ఈరోజు నుంచి స్టేడియంలోకి ప్రవేశం పూర్తిగా డిజిటల్ టికెట్ల ద్వారా మాత్రమే ఉంటుంది. ఫిజికల్ టికెట్ లేకపోయినా.. ఆన్‌లైన్‌లో పొందిన క్యూలర్ కోడ్ చూపించినా ప్రవేశం కల్పిస్తారు. సాయంత్రం 4 గంటల నుంచి ప్రేక్షకులను స్టేడియంలోకి వెళుతున్నారు. భద్రతా పరంగా కూడా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. స్టేడియం పరిసరాల్లో సుమారు 2 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయగా.. 430 సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ కొనసాగుతుంది. మ్యాచ్ సందర్భంగా అభిమానులను అలరించేందుకు ఫస్ట్ ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత లేజర్ షో నిర్వహించనున్నారు.

ట్రాఫిక్ నియంత్రణ కోసం స్టేడియం చుట్టూ ప్రత్యేక ఆంక్షలు విధించారు. ప్రేక్షకుల వాహనాల కోసం 11 పార్కింగ్ పాయింట్లు అందుబాటులో ఉంచారు. స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలను మల్కాజిగిరి కమిషనరేట్ పోలీసులు అమలు చేస్తున్నారు. స్టేడియం ఎంట్రీ గేట్ల వద్ద భద్రతా ఏర్పాట్లను ఉప్పల్ డీసీపీ సురేష్ కుమార్ పర్యవేక్షిస్తున్నారు. ప్రేక్షకులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత మాత్రమే స్టేడియంలోకి అనుమతిస్తున్నారు. అలాగే భద్రతా కారణాల రీత్యా ల్యాప్టాప్‌లు, బ్యాగులు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, వాటర్ బాటిల్స్, సిగరెట్లు, లైటర్లు స్టేడియంలోకి అనుమతించరని పోలీసులు ఇప్పటికే స్పష్టం చేశారు.

అంతేకాకుండా బ్యానర్లు, పదునైన వస్తువులపై పోలీసులు పూర్తి నిషేధం విధించారు. గత మ్యాచ్‌లో అనుమతించని స్మార్ట్ వాచ్‌లు, సన్ గ్లాసెస్, వాలెట్‌లు కూడా ఈసారి తీసుకురావద్దని సూచించారు. క్లాక్ రూమ్ సౌకర్యం లేకపోవడంతో అభిమానులు తమ వ్యక్తిగత వస్తువులను ఇంటి వద్దే ఉంచి రావాలని పోలీసులు సూచిస్తున్నారు. మ్యాచ్ దృష్ట్యా భద్రతను కట్టుదిట్టం చేయడంతో పాటు ట్రాఫిక్ నియంత్రణ చర్యలు కొనసాగుతున్నాయి. మొత్తంగా ఉప్పల్ స్టేడియంలో ఈరోజు జరగనున్న మ్యాచ్ క్రీడాభిమానులకు ఆసక్తికరంగా మారింది.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story